నవరత్నాలతో వైఎస్ పాలన
► అద్దంకి నవరత్నాల సభలో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
► తప్పుడు హామీలతో సీఎం ప్రజలను మోసగించాడని ధ్వజం
► నవరత్నాలపై ఇంటింటి ప్రచారం చేయాలని పిలుపు
అద్దంకి : రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ పాలన కాలవాలంటే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలతోనే సాధ్యమని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పట్టణంలోని శ్రీనివాస ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన నవరత్నాల సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వచ్చే నెల 11వ తేదీ నుంచి వైఎస్సార్ గుర్తుగా జగనన్నకు తోడుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి గడపగడపకు నవరత్నాల పథకాల గురించి ప్రజలకు వివరించాలని కోరారు.
2014 ఎన్నికల్లో వందలకొద్దీ హామీలిచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు అవి అమలు చేయకుండా ఏ విధంగా ప్రజలను మోసం చేశాడో ప్రజలకు తెలియజేయాలన్నారు. కేవలం జగన్ వస్తున్నాడని సరిపెట్టకుండా ఆయన అధికారంలోకి వస్తే ఏ విధంగా మేలు జరుగుతుందో ప్రజలకు వివరించాలని సూచించారు. ఆ తర్వాత జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాల గురించి ఎంపీ వివరించారు. మొదటిది రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతుకు రూ.50 వేల పెట్టుబడి నిధి అందుతుందన్నారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, ప్రకృతి వైపరీత్యాలకు నష్టం జరిగితే ఐదెకరాల లోపు రైతులను ఆదుకునేందుకు రూ.20 వేల కోట్ల కేటాయింపుతో 67 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని వివరించారు.
డ్వాక్రా మహిళల రుణమాఫీ పథకం, మూడోది అవ్వాతాతలకు రూ.2 వేల పింఛన్, నాలుగోది పిల్లల చదువు కోసం అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి ఇంట్లో ఇద్దరు పిల్లల చదువు కోసం నగదు, పేదల ప్రజల కోసం 25 లక్షల ఇళ్లు, ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా 20 నిమిషాల్లోనే 108 రాక, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు, జలయజ్ఞం ప్రాజెక్టుల పూర్తి, అంచెలంచెలుగా మద్యపాన నిషేధం చేస్తారని చెప్పారు. కొరిశపాడు ఎత్తిపోతల పథకం రైతులకు సరైన నష్టపరిహారం అందజేసేలా కృషి చేసి ఆ పథకాన్ని పూర్తి చేయిస్తామని చెప్పారు. రాబోయో ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా డాక్టర్ బాచిన చెంచుగరటయ్యే పోటీ చేస్తారని, ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ వైవీ కోరారు.
సీఎం అవినీతిని ఎండగట్టాలి : గరటయ్య
సీఎం అవినీతిని ఎండగట్టాలని వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బాచిన చెంచుగరటయ్య విజ్ఞప్తి చేశారు. అద్దంకి శాససభ్యునిగా గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన వ్యక్తి ఏనాడైనా పెండింగ్ ప్రాజెక్టుల గురించి పట్టించుకున్నాడా.. అని పరోక్షంగా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను ప్రశ్నించారు. యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని ప్రారంభించి 8 ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఎందుకు పూర్తి కాలేదని శాసనసభ్యుడిని గరటయ్య ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి చుండూరి రవి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు జజ్జర ఆనందరావు, బాపట్ల పార్లమెంట్ ఇన్చార్జి డాక్టర్ వరికూటి అమృతపాణి, నాయకులు వై.వెంకటేశ్వరరావు, రమణారెడ్డి, వంపుగడి శ్రీనివాసరావు, బాచిన కృష్ణచైతన్య, ప్రసాద్, అట్లా చిన్న వెంకటరెడ్డి, ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.