హోంగార్డు వేతనం రూ.19,884
- రాష్ట్ర అవతరణ వేళ హోంగార్డులకు తీపికబురు
- జీతాల పెంపును సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పనిచేస్తున్న 19 వేల మంది హోంగార్డుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించబోతున్నట్టు తెలిసింది. రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హోంగార్డుల జీతభత్యాల పెంపును ప్రకటిస్తారని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. హోంగార్డులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం, ఆ మేరకు చర్యలు చేపట్టినా.. న్యాయపరంగా చిక్కులు ఏర్పడే అవకాశం ఉండటంతో తాజాగా జీతభత్యాలను పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
భారీగా జీతాల పెంపు..
ఉమ్మడి రాష్ట్రంలో హోంగార్డు జీతం రూ.6 వేలు మాత్రమే. రాష్ట్ర విభజన తర్వాత అధికారికంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం హోంగార్డుల వేతనాలను రెండు దశల్లో పెంచింది. రూ.3 వేల చొప్పున మొత్తం రూ.6 వేలు పెంచి ప్రస్తుతం రూ.12 వేలు చెల్లిస్తోంది. అయితే కానిస్టేబుల్ స్కేల్‌కు దగ్గరగా ఉండేలా హోంగార్డుల జీతభత్యాలు ప్రతిపాదించాలని సీఎం కేసీఆర్ గతంలోనే డీజీపీని ఆదేశించారు. దీంతో జనవరిలో పోలీస్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఈ మేరకు హోంగార్డులకు రూ.19,884 వేలు చెల్లించేలా నిర్ణయం తీసుకోవాలని పోలీస్ శాఖ కోరింది. ఆ ప్రతిపాదనల ప్రకారం స్కేలు వివరాలు..
ప్రభుత్వంపై అదనపు భారం..
పోలీస్ శాఖలోని 14 విభాగాల్లో పనిచేస్తున్న 19,201 మంది హోంగార్డులకు నూతన పే స్కేల్ ప్రకారం జీతభత్యాలు ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై ప్రతి నెలా రూ.38.17 కోట్లు, ఏటా రూ.458.15 కోట్ల అదనపు భారం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఇవి కాక ప్రతి హోంగార్డుకు ఇచ్చే యూనిఫాం అలవెన్స్ వల్ల రూ.6.7 కోట్లు భారం పడుతుందని పేర్కొంది.
స్పెషల్ పోలీస్ అసిస్టెంట్స్ కుదరదు..
జీతభత్యాల పెంపుతో పాటు హోంగార్డులందరినీ స్పెషల్ పోలీస్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. అయితే న్యాయ శాఖ మాత్రం అలా కుదరదని, దీని వల్ల న్యాయపరంగా చిక్కులు వస్తాయని సూచించినట్టు తెలుస్తోంది. అంతే కాక హోంగార్డులను పర్మినెంట్ చేయడం వల్ల నిరుద్యోగుల నుంచి నిరసన వ్యక్తమయ్యే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు సైతం ప్రభుత్వానికి సూచించాయి. దీంతో ప్రభుత్వం జీతభత్యాల పెంపుతో సరిపెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.