అక్రమాల పుట్ట.. కాల్ సెంటర్
కర్నూలు(అగ్రికల్చర్):
డీఆర్డీఏ-ఐకేపీ అక్రమాలకు నిలయంగా మారాయి. ఇందులో పని చేసే సిబ్బంది సొంత లాభాలపైనే దృష్టి సారిస్తున్నారనే విమర్శలున్నాయి. అవినీతిపై చర్యలు లేకపోవడంతో రోజురోజుకు అక్రమాలు పెరిగిపోతున్నాయి. జిల్లా సమాఖ్య బీమా కాల్ సెంటర్లో జరిగిన అక్రమాలపై చర్యలు ఉంటాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే చర్యలు తీసుకుంటున్నామంటూ అధికారులు హడావుడి చేస్తున్నారు. ఇప్పటికే గతంలో కాల్సెంటర్లో అకౌంటెంట్‌గా పని చేసిన విజయలక్ష్మిపై కర్నూలులోని మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అక్రమాలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న ఏపీఎం రాజేష్‌పై కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని జిల్లా సమాఖ్య తీర్మానించింది. ప్రస్తుతం రాజేష్ సస్పెన్షన్‌లో ఉన్నారు.
భారీగా అక్రమాలు
జిల్లా సమాఖ్య కాల్ సెంటర్లో జరిగిన అక్రమాలపై 2005-06 నుంచి 2013-14 వరకు ఇటీవల స్పెషల్ ఆడిట్ జరిగింది. ఇందులో కాల్ సెంటర్లో జరిగిన అక్రమాలు భారీగా వెలుగు చూశాయి. నిధులను నకిలీ లబ్ధిదారుల అకౌంట్లకు రూ.28.35 లక్షలు మల్లించినట్లు స్పష్టమైంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.6.70 లక్షలు దుర్వినియోగమయ్యాయి. ఈ అక్రమాలకు గతంలో పని చేసిన పీడీల ఆమోదం కూడా ఉన్నట్లుగా ఆడిట్లో వెల్లడైనట్లు తెలుస్తోంది. 633 కుటుంబాలకు ఉద్దేశపూర్వకంగా రూ.80.65 లక్షలు డబుల్ పేమెంట్ చేసినట్లు నిర్ధారణ అయింది. 39 డెత్ క్లయిమ్‌లకు సంబంధించిన పరిహారాన్ని కాల్ సెంటరు సిబ్బంది, బంధువుల అకౌంట్లకు మళ్లించినట్లు వెల్లడైంది.
సంతకాలు సైతం ఫోర్జరీ!
కాల్ సెంటరులో జరిగిన అక్రమాలతో గతంలో అకౌంటెంటుగా పని చేసిన విజయలక్ష్మి, కంప్యూటర్ ఆపరేటర్లు గోపాల్, శ్యామల, టెలిఫోన్ ఆపరేటర్లు ప్రసన్నకుమారికి ప్రత్యక్ష సంబంధం ఉందని తేల్చారు. మాజీ జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు మద్దమ్మ సంతకాలను సైతం ఫోర్జరీ చేసినట్లు సమాచారం. పలువురు హెచ్ఆర్ సిబ్బంది అక్రమాలతో పరోక్ష సంబంధం ఉన్నట్లుగా తేల్చారు. కాల్ సెంటరులో పని చేసిన ముగ్గురు ఏపీఎంలు, ఇద్దరు డీపీఎంలకు పరోక్ష సంబంధం ఉన్నందున వీరిపై చర్యలకు జిల్లా సమాఖ్య డీఆర్డీఏ- వెలుగు పీడీకి సిఫారసు చేసింది.