ముక్తాపురంలో హోం మంత్రి పర్యటన
కనగానపల్లి (రాప్తాడు) : రాష్ట్ర హోం మంత్రి చిన్నరాజప్ప గురువారం కనగానపల్లి మండలంలోని ముక్తాపురంలో పర్యటించారు. అనంతపురం నుంచి బెంగళూరు వెళ్తున్న ఆయన ముక్తాపురం వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారి పక్కన కొత్తగా ఏర్పాటు చేస్తున్న హౌసింగ్ కాలనీని సందర్శించారు. కొత్తగా నిర్మిస్తున్న ఎన్టీఆర్ గృహ నిర్మాణాలను మంత్రి పరిటాల సునీతతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటి నిర్మాణాల నాణ్యత, లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులపై అధికారులతో మాట్లాడారు.
మోడల్ కాలనీలో 36 గృహాలనూ ఒకే విధంగా నిర్మించడంతోపాటు, ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులనూ కల్పిస్తున్నామని మంత్రి సునీత హోంమంత్రికి తెలిపారు. ఈ వారం లోపల కాలనీలో సిమెంట్ రోడ్లు, వీధి కొళాయిలు ఏర్పాటు చేయించి ఈ నెల 5వ తేదీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు. అనంతరం సీఎం పర్యటన ఏర్పాట్లపై హోం మంత్రి అధికారులతో ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా, మండల స్థాయి అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
శిల్పారామం సందర్శన
అనంతపురం రూరల్ : నగర పరిధిలోని శిల్పారామాన్ని చిన్నరాజప్ప సందర్శించారు. నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే శిల్పారామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం మొక్కలు నాటారు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, స్థానిక సర్పంచ్ పెదయ్యతోపాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.