home rent Claims
-
హైదరాబాద్‌లో రెంట్లు ఎంత పెరిగాయో తెలుసా..
హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇంటి అద్దెలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. రోజు రోజుకు రెంట్లు పెంచేస్తుండడంతో అద్దెకట్టేవారికి ఆర్థికభారం పెరుగుతోంది. ప్రస్తుతం చాలా కంపెనీలు Work from Home వర్క్ ఫ్రం హోం తొలగించి ఉద్యోగస్థులను ఆఫీసులకు రమ్మంటున్నాయి. దాంతో అద్దె ఇళ్లకు గిరాకీ పెరుగుతోంది. అదే అదనుగా ఇంటి యజమానులు రెంట్ పెంచుతున్నారు. కొవిడ్ పూర్వం అద్దెలకు ప్రస్తుతం ఉన్న అద్దెలకు భారీ వ్యత్యాసం ఉంది. 2019తో పోలిస్తే ఇంటి రెంట్లు ఎంత పెరిగాయనేదానిపై ప్రముఖ రియల్టీ సంస్థ హౌసింగ్.కామ్ కీలక నివేదిక విడుదల చేసింది. ఆ విషయాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికలోని వివరాల ప్రకారం.. 2019 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇంటి అద్దెలు దాదాపు 25-30 శాతం మేర పెరిగాయి. అలాగే రెసిడెన్షియల్ ప్రాపర్టీల రెంట్లు 15-20 శాతం మేర అధిమయ్యాయి. అద్దెలు పెరిగిన క్రమంలో రెంటల్ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల కనిపించినట్లు నివేదిక పేర్కొంది. అయితే, ప్రపంచ వ్యాప్తంగా న్యూయార్క్, లండన్, దుబాయ్, సింగపూర్ వంటి గ్లోబల్ రియల్ ఎస్టేట్ మార్కెట్లతో పోలిస్తే దేశంలో చాలానే గ్యాప్ ఉన్నట్లు తెలిపింది. దేశంలోని టాప్ నగరాల్లో ప్రాపర్టీల ధరలు 2019 ధరలతో పోలిస్తే ప్రస్తుతం 15 నుంచి 20 శాతం మేర పెరిగినట్లు హౌసింగ్.కామ్ నివేదిక వెల్లడించింది. ప్రాపర్టీలు, అద్దె ఇళ్ల కోసం ఆన్లైన్లో సర్చ్ చేస్తున్న వారి సంఖ్య సైతం భారీగానే పెరిగినట్లు తెలిపింది. కొనుగోలు ఇండెక్స్‌తో పోలిస్తే ఐఆర్ఐఎస్ ఇండెక్స్ 23 పాయింట్లు అధికంగా ఉందని పేర్కొంది. ఇదీ చదవండి: ఓవెన్ సైకిళ్లు వచ్చేశాయ్.. ఓ లుక్కేయండి.. 'కరోనా మహమ్మారి తర్వాత హౌసింగ్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రాపర్టీల కొనుగోలు, అద్దెల డిమాండ్ అధికమైంది. దాదాపు దశాబ్ద కాలం పాటు స్తబ్దుగా కొనసాగిన హౌసింగ్ మార్కెట్ ధరల పెరుగుదల గత రెండేళ్లలో మాత్రం గణనీయంగా పెరిగింది. నగరాలను బట్టి ఈ ధరల పెరుగుదల ఆధారపడి ఉంటుంది. అయితే ప్రధాన నగరాల్లోని ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రాపర్టీల ధరలు భారీగా పెరిగాయి.' అని హౌసింగ్.కామ్ సీఈఓ ధ్రువ్ అగర్వాల్ తెలిపారు. -
కరోనా: ఇంటి రెంట్ మూడు నెలలు వాయిదా
సాక్షి, ముంబై : దేశ వ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటి కిరాయి వసూలును మూడు నెలల పాటు వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం కోరింది. ఇంటి రెంట్‌తో పాటు, భూముల కిరాయిలు కూడా వాయిదా వేయాలని ఇంటి యజమానులకు తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశంలో మే 3 వరకు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో పనులు లేక ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. పెద్ద ఎత్తున ఆదాయ మార్గాలు మూసుకుపోయాయి. ఈ నేపథ్యంలో నగరాల్లో ఇళ్ల కిరాయిలు కట్టడం కొందరికి కష్టతరంగా మారింది. ఈ విషయాన్ని పలువురు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారులతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసిన ఠాక్రే.. కిరాయిలను మూడు నెలల పాటు వాయిదా వేసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. కాగా దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదవుతున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 3000 దాటింది. మృతుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. రోజురోజుకూ పెద్ద ఎత్తున వైరస్ కేసులు పెరగడం అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు ముంబై సమీపంలోని ధారావి మురికివాడకూ వైరస్ వ్యాప్తించింది. ఇప్పటి వరకు అక్కడ 90కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. -
ఇంటద్దె క్లెయిమ్‌లో జాగ్రత్త!
ఉద్యోగస్తులు అద్దె ఇంట్లో ఉంటూ అద్దె చెల్లించడం.. ఆ మేరకు రశీదులు ఇవ్వడం... ఆ ఇవ్వడం కూడా కేవలం తన యాజమాన్యానికి ఇవ్వటం... యాజమాన్యం ఎలాంటి తనిఖీ లేకుండా తన సొరుగులో పెట్టేసుకోవటం... ఇంటద్దె క్లెయిమ్‌ను అనుమతించటం... ఆ మేరకు ఆదాయం తగ్గింపు... పన్ను భారం తగ్గింపు... ఇదంతా ఇన్నాళ్లూ జరుగుతున్న ప్రహసనం. మనలో మన మాట!! వీటిల్లో ఎన్నెన్నో దొంగ క్లెయిమ్‌లు కూడా ఉంటున్నాయి. అవి... 1. తక్కువ అద్దె ఇచ్చి.. ఎక్కువ మొత్తానికి రశీదు అందజేయటం 2. అసలు ఏ మాత్రం అద్దె చెల్లించకుండా రశీదు సమర్పించటం 3. సొంత ఇంట్లోనే ఉంటూ అద్దె ఇంట్లో ఉన్నట్లు రశీదు ఇవ్వటం 4. తండ్రి లేదా తల్లి ఇంట్లోనో ఉంటూ అద్దె ఇచ్చినట్లు చూపించడం 5. భార్యాభర్తలిద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ.. ఇద్దరూ రెండు అద్దె రశీదులివ్వటం 6. నకిలీ ఓనర్... లేని ఓనర్ పాత్రను సృష్టించి అద్దె రశీదు ఇవ్వడం. 7. ఏదో ఒక డమ్మీ ఇంటి నంబరుతో రశీదు ఇవ్వడం వంటివి. కంపెనీల యాజమాన్యాలు ఈ క్లెయిమ్‌లను సరిగ్గా వెరిఫై చేయకుండా ఊరుకుంటున్నాయి. సహవాసం వల్లనో, అరకొర సిబ్బంది వల్లనో ఏ కారణం వల్లనో ఇచ్చిన వివరాలు చెక్ చేయటం... ఇచ్చిన రశీదుల్లో నిజమెంత అని గానీ .. పేరు కానీ, ఇంటి నంబరు కానీ, అద్దె మొత్తం గానీ చెక్ చేయడం లేదు. గుడ్డిగా రశీదులు తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఇటువంటి వాటిమీద నిఘా పెడుతోంది ఐటీ డిపార్ట్మెంటు. అంతే కాకుండా ఈ మధ్య వెలువడిన జడ్జిమెంట్‌లో సారాంశం ఏమిటంటే... అధికారులు హెచ్ఆర్ఏ విషయంలో చెక్ చేయాలని, క్లెయిమ్ నిజమా కాదా అన్నది నిర్ధారించుకోవాలని, నిజం కాకపోతే నోటీసులు, ట్యాక్సులు, వడ్డీలు.. పెనాల్టీలు మొదలైన రూపాల్లో వడ్డన ఉంటుంది. కాబట్టి మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు... అద్దె ఇంట్లోనే ఉంటుంటే ముందుగా అగ్రిమెంటు రాసుకోండి చెక్కు, డీడీ ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా అద్దె చెల్లించండి. అద్దె కాకుండా చెల్లించే కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు, నిర్వహణ ఖర్చులు మొదలైనవి బ్యాంకు ద్వారా చెల్లించండి. తప్పనిసరి పరిస్థితుల్లో నగదు చెల్లిస్తే రూ.1 రెవెన్యూ స్టాంపు అతికించండి. మీరు చెల్లించే అద్దె నెలకి రూ.5,000 దాటితే టీడీఎస్ చేసి, రికవరీ చేసి ఆ మొత్తాన్ని గవర్నమెంటు ఖజానాలో చెల్లించాలి. వ్యవహారానికి సంబంధించి అన్ని కాగితాలు, పే స్లిప్పులు, బ్యాంకు ఖాతాలు, రశీదులు మొదలైనవి భద్రపర్చుకోండి. ఓనర్ పాన్‌కార్డ్ జిరాక్స్ తీసుకోండి. ఇంటి మున్సిపల్ ట్యాక్స్ రశీదులో ఉన్న పేరున్న వ్యక్తి నుంచే రశీదు పొందాలి. ఓనర్షిప్ మారితే సేల్ డీడ్గానీ తీసుకోండి. చాలా మంది దొంగ రశీదులు ఇస్తున్నారు. వ్యవహారం నిజమే కావొచ్చు.. అంటే ఇల్లు, ఇంటద్దె, చెల్లింపు అన్నీ కరెక్టే కావొచ్చు.. కానీ ఓనరు పన్ను భారాన్ని తగ్గించడానికి, బదిలీ చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు తగిన జాగ్రత్త వహించండి. మీరు నిజంగానే అద్దె చెల్లిస్తూ మీ తల్లిదండ్రుల ఇంట్లోనైనా ఉండొచ్చు. కానీ అద్దె చెల్లించండి. దాన్ని అటు మీ తల్లిదండ్రుల ఇన్కమ్ ట్యాక్స్‌లో ఆదాయం కింద చూపించండి. భార్యాభర్తలు ఒకే ఇంట్లో కాపురం చేస్తూ.. ఒకరే అద్దె చెల్లిస్తూ, ఇద్దరూ క్లెయిమ్ చేయకండి. ఒకే ఇంట్లో ఉంటూ.. మీరు వేరు వేరు దొంగ ఇంటి నంబర్లు ఇచ్చి మినహాయింపు పొందే ప్రయత్నం చేయొద్దు.