ఎన్యూమరేటర్ల నిర్బంధం
పెనుబల్లి: పెనుబల్లి మండల పరిధిలోని కుప్పెనకుంట్లలో ఇళ్లకు స్టిక్కర్లు వేయకపోవడంతో సుమారు 150 కుటుంబాలకు సర్వే నిర్వహించలేదు. దీంతో అందరికీ సర్వే పూర్తి చేసిన తర్వాతే ఎన్యూమరేటర్లు బయటకు వెళ్లాలంటూ గ్రామస్తులు వారిని మంగళవారం రాత్రి నిర్బంధించారు. అధికారుల నిర్లక్ష్యంతో కొందరి ఇళ్లకు అసలు స్టిక్కర్లు వేయలేదని, మరికొందరి ఇళ్లలో ఒకరి కంటే ఎక్కువ కుటుంబాలు నివాసం ఉంటున్నప్పటికీ వారిని గుర్తించలేదని స్థానికులు ఆందోళనకు దిగారు.
అందరినీ సర్వే చేసేంతవరకు కదలనీయబోమని స్పష్టం చేశారు. దీంతో విషయం తెలుసుకున్న వీఎం బంజర్ ఎస్సై బి. పరుశురాం ఆ గ్రామానికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు. అందరి వివరాలు సేకరించిన తర్వాతే ఎన్యూమరేటర్లు వెళ్తారని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. కాగా, మంగళవారం అర్ధరాత్రి వరకూ గ్రామంలో సర్వే కొనసాగుతూనే ఉంది.