ఈ డాక్టర్ ఫీజు...
డాక్టర్ కర్నాటి భాస్కరరెడ్డి 30 ఏళ్లుగా కర్నూలులో ఉచిత హోమియో వైద్యసేవలు అందిస్తున్నారు. మానవసేవే మాధవసేవగా భావించే రాధాస్వామి సత్సంగ్ బోధనలకు ఆకర్షితులైన ఆయన పేదల సేవే పరమావధిగా వృత్తి ధర్మాన్ని కొనసాగిస్తున్నారు. డిస్పెన్సరీలో ఉచిత వైద్యం అందిస్తూనే ఇల్లిల్లూ తిరిగి ఒక్క రూపాయి ఫీజుతో హోమియో వైద్యాన్ని అందిస్తూ వైద్యవృత్తికే వన్నె తెస్తున్నారు. కర్నూలు నగరంలోని ధర్మపేటలో ఉచిత హోమియో వైద్యం అందిస్తున్న డాక్టర్ కె. భాస్కర్‌రెడ్డి తాను సేవా రంగంలోకి వచ్చిన వైనం గురించి ‘సాక్షి’తో మాట్లాడారు.
మా స్వగ్రామం ప్రకాశం జిల్లా కంభం. నాన్న కెవి సుబ్బారెడ్డి, అమ్మ చెన్నమ్మ. నాన్న బ్రిటిష్ హయాంలో నంద్యాల సమీపంలోని నూనెపల్లి డిప్యూటీ తహశిల్దార్‌గా పనిచేసేవారు. నా చదువు కంభంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో పాఠశాలలో సాగింది. అదే క్యాంపస్‌లో ఉండే జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాను. తర్వాత 1972-75 పీరియడ్‌లో మార్కాపురంలోని ఎస్వీకెవి డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తి చేశాను. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్‌గా పనిచేసిన మామ రామిరెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని మా నాన్న నన్ను మంచి లాయర్‌గా చేయాలని భావించారు. గుంటూరులోని ఏసీ కాలేజిలో లా కోర్సులో చేర్పించారు. అయితే నాకు మాత్రం ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేయాలని ఉండేది. డిగ్రీ క్లాస్మేట్ జయచంద్రారెడ్డి భోపాల్‌లో ఇంగ్లీష్ లిటరేచర్‌లో చేరి నన్నూ రమ్మనడంతో లా కోర్సు మధ్యలో ఆపేసి, నాన్నకు చెప్పకుండా భోపాల్ వెళ్లాను. అప్పటికే అక్కడ అడ్మిషన్లు అయిపోయాయి. అనంతరం 1976లో ఆగ్రాలోని దయాల్బాగులో పోలీస్ డిపార్ట్మెంట్లో సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరాను.
సమయానికి రాలేకపోయాను
నేను 1977లో ఆగ్రాలో సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సమయంలో ఊళ్లో (కంభం) అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. ఆ విషయం తెలిస్తే నేను బాధపడతానని సీరియస్‌గా ఉంది, వెంటనే రావాలని మాత్రమే టెలిగ్రామ్ పెట్టారు. సమయానికి చేరుకోలేకపోయాను. అమ్మ ఖననం అయిన మూడు రోజులకు దినకర్మలకు వచ్చాను. నాన్న చాలా బాధపడ్డారు. కన్న తల్లి చనిపోతే చూడ్డానికి రాలేని ఉద్యోగం అవసరం లేదని తెగేసి చెప్పారు. వెంటనే రాజీనామా చేసి వచ్చెయ్యమ్మన్నారు. 1979 వరకు ఆగ్రాలో పనిచేసి, ఆ తర్వాత రాజీనామా చేసి వెనక్కి వచ్చేశాను.
సేవ కోసమే హోమియో వైద్యం
మా మామ నారాయణరెడ్డి హోమియో వైద్యులు. ఆయనను చూసి హోమియో వైద్యంపై మక్కువ పెంచుకున్నాను. ఈ కారణంగా ఆ వైద్యంలో కొంత ప్రవేశం ఉండేది. పూర్తిస్థాయిలో వైద్యం నేర్చుకోవాలన్న ఉద్దేశ్యంతో భువనేశ్వర్‌లోని బిరాజీ యూనివర్శిటిలో హోమియో(డిప్లమా) కోర్సు చేశాను. అనంతరం కంభంలోనే కొన్నాళ్ల పాటు హోమియో వైద్యం ద్వారా స్థానిక ప్రజలకు సేవ చేశాను. 1984లో నాకు సహ సత్సంగి పద్మజతో వివాహం అయ్యింది. ఆ తర్వాత ఆమెతో పాటు కర్నూలు వచ్చేశాను. 1986లో స్థానిక ధర్మపేటలోని రాధాస్వామి చారిటబుల్ హోమియో డిస్పెన్సరిలో ఉచిత హోమియో వైద్యసేవలు ప్రారంభించాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా నిరంతరం ఇక్కడ సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రతిరోజూ వంద మందికి పైగా ఉచితంగా హోమియో వైద్యం అందిస్తూ వస్తున్నాను.
గురువు సూచనతో ఇంటింటికీ వెళ్లి వైద్యం
రాధాస్వామి సత్సంగ్ ఎనిమిదవ గురువు హుజూర్ డాక్టర్ ప్రేమ్‌శరణ్ సత్సంగి సాహ మొదటిసారి పద కొండేళ్ల క్రితం కర్నూలు వచ్చారు. ధర్మపేటలోని రాధాస్వామి దయాల్బాగు డిస్పెన్సరీని సందర్శించారు. ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్న మురికివాడలను చూసి ఎంతో బాధపడ్డారు. ఆ భగవంతుని ప్రసన్నత మనకు కావాలంటే ఆయన పిల్లలైన తోటి మానవులకు సేవ చేయాలని సూచించారు. ఈ మేరకు ఈ పేదల ఇంటికే వెళ్లి వైద్యం చేయాలని ఆదేశించారు. ఆయన ఆజ్ఞ ప్రకారం గత పదేళ్లుగా వైద్య సేవలు అవసరమైన ప్రతి ఇంటికి వెళ్లి హోమియో వైద్యం అందిస్తున్నాను.
ఒక్క రూపాయి ఎందుకంటే...:
ధర్మపేటలో దాదాపు 1200 నివాస గృహాలు ఉన్నాయి. ప్రతి బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అన్ని ఇళ్లు తిరిగి హోమియో వైద్యం అందిస్తున్నాం. ఫీజుగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకుంటున్నాం. ఉచితంగా వైద్యం చేస్తున్నామనే భావన వైద్యునికి, ఉచితంగా వైద్యం అందుకుంటున్నామన్న భావన రోగులకు ఉండకూడదన్న ఉద్దేశ్యంతోనే ఒక్క రూపాయి ఫీజు తీసుకుంటున్నాం. అన్ని వ్యాధులకు చికిత్సను అందిస్తున్నాం. అంటువ్యాధులు ప్రబలకుండా ఉచిత వైద్య శిబిరాలూ నిర్వహిస్తున్నాం. ఈ వైద్యునికి దేవుడు చిరాయువును, సంపదను ఇవ్వాలని కోరుకుందాం!
ఉచితంగా వైద్యం చేస్తున్నామనే భావన వైద్యునికి, ఉచితంగా వైద్యం అందుకుంటున్నామన్న భావన రోగులకు ఉండకూడదన్న ఉద్దేశ్యంతోనే ఒక్క రూపాయి ఫీజు తీసుకుంటున్నాము.
- డాక్టర్ కె. భాస్కర్‌రెడ్డి