Honda Activa scooters
-
యాక్టివా 125 ప్రీమియం ఎడిషన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా తాజాగా యాక్టివా 125 స్కూటర్ ప్రీమియం ఎడిషన్‌ను విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర డ్రమ్ బ్రేక్స్ రూ.78,725, డిస్క్ బ్రేక్ వేరియంట్ రూ.82,280 ఉంది. డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్, సెమి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, ఏసీజీ సైలెంట్ స్టార్ట్ సిస్టమ్, ఐడ్లింగ్ స్టాప్ స్టార్ట్ సిస్టమ్, బ్లాక్ ఇంజన్, బ్లాక్ ఫ్రంట్ సస్పెన్షన్ వంటి హంగులు ఉన్నాయి. ప్రీమియం గ్రాఫిక్స్, లుక్ కస్టమర్లను ఇట్టే ఆకట్టుకుంటుందని కంపెనీ తెలిపింది. -
ఎట్టకేలకు చిక్కిన యాక్టివాల దొంగ
సాక్షి, మహబూబ్‌నగర్ క్రైం: హోండ కంపెనీ వాహనాలకు ఫైనాన్స్ ఇచ్చే కార్యాలయంలో రికవరీ ఎజెంట్‌గా పని చేసిన అనుభవం ఉండటం వల్ల కేవలం హోండా కంపెనీకి చెందిన యాక్టివా స్కూటర్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేశాడు. రోడ్డుపై..వివిధ పెళ్లిల సమయంలో పంక్షన్ హాల్స్‌లలో పార్క్ చేసిన వాటిని మాత్రమే దొంగలిస్తూ వచ్చాడు. ఎట్టకేలకు హోండా యాక్టివాల దొంగను పోలీసులు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ బి.అనురాధ మంగళవారం వివరాలను మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్‌లోని మీర్ ఆలం మండి ప్రాంతానికి చెందిన మీర్ షబ్బీర్ అలీ మహబూబ్‌నగర్ నుంచి హోండా యాక్టివాపై జడ్చర్ల వైపు వెళ్తుంటే రూరల్ ఎస్ఐ ఖాజాఖాన్ ఏనుగొండ దగ్గర అతణ్ణి పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారణ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఫైజల్ అనే వ్యక్తితో కలిసి షబ్బీర్ అలీ గత మూడు నెలల కాలంలో హైదరాబాద్‌లోని రాచకొండ పరిధిలో చోరీ చేసిన 15ద్విచక్ర వాహనాలు, మహబూబ్‌నగర్‌లో చేసిన రెండు ద్విచక్ర వాహనాల చోరీల గురించి విచారణలో అంగీకరించాడు. చోరీ చేసిన 17వాహనాలను జిల్లా కేంద్రంలోని సద్దలగుండు ప్రాంతానికి చెందిన నదీం ఇంట్లో ఉంచాడు. వాటిని ఇప్పటికే వేరు వేరుగా 17మందికి ఒక్కొక్కరికి రూ.25వేల చొప్పున విక్రయించాడు. వాటిని వారం రోజుల్లో తీసుకువెళ్లాలని చెప్పాడు. ఈ క్రమంలోనే అతను పోలీసులకు పట్టుపడటంతో నదీం ఇంట్లో ఉంచిన 17యాక్టివ వాహనాలను రికవరీ చేశారు. వాటి విలువ రూ.10లక్షల 20వేలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. రికవరీ ఎజెంట్ అనుభవంతోనే హైదరాబాద్‌లోని చార్మినార్ మీర్ అలం మండి ప్రాంతానికి చెందిన షబ్బీర్ అలీ గతంలో మణికొండలో హోండా కంపెనీకి సంబంధించిన ద్విచక్ర వాహనాలకు రుణాలు ఇచ్చే కార్యాలయంలో రికవరీ ఎజెంట్‌గా పనిచేశాడు. హైదరాబాద్‌కు చెందిన ఫైజల్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుని కేవలం హోండా కంపెనీకి చెందిన యాక్టివా వాహనాలను లక్ష్యం చేసుకుని చోరీలు చేయడం మొదలుపట్టి పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే షబ్బీర్ అలీ గతంలో చెన్ స్నాచింగ్ కేసులలో జైలు శిక్ష కూడా అనుభవించాడని పోలీసులు తెలిపారు. -
ఐదు నెలల్లో పది లక్షల హోండా యాక్టివా అమ్మకాలు
నంబర్ వన్ టూవీలర్గా హ్యాట్రిక్ ముంబై: హోండా యాక్టివా స్కూటర్లు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో 10 లక్షలు అమ్ముడయ్యాయి. దీంతో దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టూ-వీలర్‌గా యాక్టివా నిలిచిందని హోండా మోటార్‌సైకిల్ అండ స్కూటర్ ఇండియా తెలిపింది. కొన్ని నెలలుగా టూవీలర్ల మార్కెట్లో అమ్మకాలు క్షీణిస్తూ వస్తున్నప్పటికీ, ఈ స్థాయి అమ్మకాలు సాధించామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) యధ్‌విందర్ సింగ్ గులేరియా చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్-ఆగస్టు కాలానికి 10,01,350 యాక్టివాలను విక్రయించామని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలం విక్రయాలతో పోల్చితే 20 శాతం వృద్ధి సాధించామని వివరించారు. పండుగ సీజన్ ఇలాంటి జోష్‌తో ఆరంభమైనందుకు ఆనందంగా ఉందని కంపెనీ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ కీత మురమత్సు చెప్పారు. వరుసగా మూడు నెలల పాటు అత్యధికంగా అమ్ముడైన టూవీలర్గా యాక్టివా హ్యాట్రిక్ కొట్టిందని తెలిపారు. భారత్‌లో విక్రయమవుతున్న టూవీలర్లలో మూడోవంతు స్కూటర్లదే. ఈ స్కూటర్ల మార్కెట్లో హోండా మార్కెట్ వాటా 59 శాతంగా ఉండగా, ఒక్క యాక్టివా బ్రాండ్ స్కూటర్ల వాటానే 51 శాతంగా ఉంది. మొత్తం టూవీలర్ల మార్కెట్లో హోండా మార్కెట్ వాటా 27 శాతమని అంచనా.