Honorable Mention
-
ఎన్టీఆర్‌తో నటించేటప్పుడు విలువలు నేర్చుకున్నా
‘‘నేను చిన్నతనం నుంచి ఎన్టీఆర్‌గారిని ఆదర్శంగా తీసుకునేదాన్ని. ఆయనతో నటించేటప్పుడు క్రమశిక్షణ, సిన్సియారిటీ, అంకితభావం, నిబద్ధత, మాటతీరు.. వంటి విలువలు నేర్చుకున్నాను’’ అని సీనియర్ నటి ఎల్.విజయలక్ష్మి అన్నారు. దివంగత నటుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తెనాలిలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ అవార్డు అందుకున్నారు ఎల్.విజయలక్ష్మి. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఆమెకు హీరో బాలకృష్ణ గౌరవ సత్కారం చేశారు. అనంతరం ఎల్.విజయలక్ష్మి మాట్లాడుతూ– ‘‘ఎంతో అభిమానంతో అమెరికా నుంచి నన్ను పిలిపించి గౌరవించడం చూస్తుంటే కళ్లు చెమర్చుతున్నాయి. ఇందుకు బాలకృష్ణ, ఆలపాటి రాజా, బుర్రా సాయిమాధవ్‌లకు థ్యాంక్స్. వివాహం అయ్యాక సినిమాలు మానేసి అమెరికా వెళ్లాను. అక్కడ సీఏ చదివానంటే ఎన్టీఆర్‌గారి స్ఫూర్తి వల్లే. రామానాయుడు, ఎన్టీఆర్‌గార్ల తరం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. మళ్లీ ఇలాంటి వేడుకలకు రావాలనుంది’’ అన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘విజయలక్ష్మిగారు వందకుపైగా సినిమాల్లో నటిస్తే అందులో 60కి పైగా నాన్నగారితో నటించారు. ఆమె మహిళా సాధికారతకు ప్రతీక. ఆమె ఎక్కిన మెట్లను భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలి’’ అన్నారు. ‘‘1964లో మా బేనర్లో(సురేశ్ ప్రొడక్షన్స్) నిర్మించిన ‘రాముడు భీముడు’ సినిమాలో విజయలక్ష్మిగారు నటించారు. అందులో ‘‘దేశమ్ము మారిందే..’ అనే సాంగ్ కోసం ఆమె ఎంత కష్టపడ్డారో నాన్నగారు (రామానాయుడు) చెబుతుండేవారు’’ అన్నారు నిర్మాత డి.సురేశ్ బాబు. ఈ వేడుకలో రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, డైరెక్టర్ వైవీఎస్ చౌదరి, నిర్మాతలు సి.కల్యాణ్, ప్రసన్న కుమార్, బసిరెడ్డి, రామసత్యనారాయణ, జూబ్లీహిల్స్ మాజీ కార్పొరేటర్ ఖాజా సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
తెలుగుదనాన్ని మర్చిపోకండి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పుట్టిన ఊరు, మట్టి వాసనలు, వంటలు వాటి గుభాళింపులు, పలకరింపులు, చదువు నేర్పిన గురువులను, పరిసరాలను మరిచిపోవద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కోరారు. సతీ సమేతంగా అమెరికా పర్యటనలో ఉన్న సీజేఐకి అమెరికా న్యూజెర్సీలోని ఎడిసన్‌లో నార్త్ అమెరికా తెలుగు ప్రతినిధులు శుక్రవారం ఆత్మీయ సన్మానం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడారు. అమెరికా వంటి దేశాల్లో మన సంస్కృతీ సంప్రదాయాలను మరవకుండా, ఆచార వ్యవహారాలను పెద్దపీట వేస్తూ జీవితాన్ని గడపటం అందరూ గర్వించాల్సిన విషయమని ఆయన కొనియాడారు. “అమెరికాలో 2010–17 మధ్య కాలంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 85% పెరిగింది. మిగతా ఆసియా భాషలతో పోలిస్తే తెలుగు భాష ప్రథమ స్థానంలో ఉంది’అని ఆయన తెలిపారు. తెలుగు భాషను ఎంతగా గౌరవిస్తామో, ఇతర భాషలను సైతం అదే విధంగా గౌరవించుకోవాలన్నారు. ఉద్యోగరీత్యా అవసరమైన విషయాలకు మాత్రమే భాష, సంస్కృతులను త్యాగం చేయాల్సి ఉంటుందే తప్ప, దైనందిన జీవితంలో, కుటుంబంలో రోజువారీ కార్యకలాపాల్లో మాతృభాషను వాడటం మరవొద్దని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. తెలుగులో చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చనడానికి తానే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. మాతృభాషలో చదువుకొని న్యాయశాస్త్రంలో ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. దేశంలో న్యాయం ఆకాంక్షించే ప్రతీ ఒక్కరికీ సత్వర న్యాయం అందేలా అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రజల అర్జీలను పరిష్కరించేందుకు తగిన సంఖ్యలో కోర్టులు, జడ్జీలనూ నియమించాల్సిన అవసరం ఉందన్నారు. -
మెరిసిన చిత్రం
ప్రతి గీత సంస్కృతికి రూపం. ప్రతి చిత్రం భారతీయతను చాటే రూపం. ‘ట్రెడిషన్స్ ఆఫ్ ఇండియా’ను అద్భుతమైన బొమ్మల్లో చూపి... అంతర్జాతీయ ఖ్యాతి గడించారు నగర విద్యార్థులు. బంగ్లాదేశ్‌లోని ‘బంగ్లాదేశ్ శిశు అకాడమీ’ ఇటీవల నిర్వహించిన ఇంటర్నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్లో మనోళ్ల చిత్రాలకు బహుమతులు వరుస కట్టాయి. పేదింటి నుంచి వచ్చిన అమర్నాథ్ (ఇంజనీరింగ్), కుమారి సోనీ, సందీప్ కుమార్ (బీఎఫ్ఏ), శ్రీనిధి (8వ తరగతి)లు చూపిన అద్వితీయ ప్రతిభకు కాంస్య పతకాలు దక్కాయి. మరో పదహారు మంది చిన్నారులకు ‘హానరబుల్ మెన్షన్’ సర్టిఫికెట్లు వచ్చాయి. అత్తాపూర్ ‘యంగ్ ఎన్వాయస్ ఇంటర్నేషనల్’ ఆర్ట్ స్కూల్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం అధికారి ఇనముల్ హక్వీచౌదరి విద్యార్థులకు ఈ బహుమతులు అందించారు. వీరంతా ఈ స్కూల్ విద్యార్థులే కావడం విశేషం. భారత్‌లో పెళ్లి తంతుపై వివిధ భంగిమల్లో వీరు గీసిన చిత్రాలు అక్కడ అందర్నీ మంత్రముగ్ధులను చేశాయి. మన దేశం నుంచి ఈ ఎగ్జిబిషన్లో బహుమతులు గెలుచుకున్నది కూడా వీరే. దీనిపై విద్యార్థులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘వీరి ఆర్ట్ అద్భుతం. వారిని మరింతగా ప్రోత్సహించాలనే బహుమతులు ఇవ్వడానికి స్వయంగా వచ్చా’ అన్నారు హక్వీచౌదరి. వీఎస్