హార్స్ షో అదుర్స్
పెద్దాపురం :జిల్లా చరిత్రలో తొలిసారిగా పెద్దాపురంలో రాష్ట్రస్థాయి హార్స్ షో అద్వితీయంగా జరిగింది. హార్స్ లవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ హార్స్ షో ఆండ్ ఈవెంట్స్ కాంపిటీషన్ నిర్వహించారు. గతంలో సామర్లకోటలో హార్స్ షో నిర్వహించడానికి సన్నాహాలు జరిగినా పోలీసులు అడ్డుకోవడంతో అర్థాంతరంగా నిలిచిపోయాయి. రెండేళ్ల తరువాత పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు ప్రోత్సాహంతో హార్స్ లవర్స్ అసోసియేషన్ సారథులు కె. వెంకటరెడ్డి, అనిల్‌రెడ్డి, ఏఎస్వీఎస్ రామరాజు ఆధ్వర్యంలో ఈ హార్స్ షో చేపట్టారు. ఏడీబీ రోడ్డు ఇండిస్ట్రియల్ ఏరియాలోని ఖాళీ స్థలంలో ప్రత్యేక ఏర్పాట్ల మధ్య ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్సాహభరిత వాతావరణంలో ఈ షో నిర్వహించారు. గుర్రాల ప్రదర్శనను ఉదయం ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు లాంఛనంగా ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా కాకినాడ ఎంపీతోట నరసింహం హాజరయ్యారు.
బహుమతి ప్రదానోత్సవానికి డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప హాజరయ్యారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి సుమారు 70 గుర్రాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ గుర్రాల అందాల పోటీలు జరిగాయి. ఆడ, మగ విభాగాల్లో అందాల పోటీలతో పాటు, గుర్రాల రేస్ కూడా నిర్వహించారు. మగ గుర్రాల అందాల పోటీలో ఏఎస్వీఎస్ రామరాజు (కాకినాడ) గుర్రానికి ప్రథమ, ఎస్. రవికుమార్ (విజయవాడ) గుర్రానికి ద్వితీయ, డి.సత్యనారాయణమూర్తి (పిఠాపురం తాటిపర్తి) గుర్రానికి తృతీయ, బాబా (పసలపూడి) గుర్రానికి నాలుగో బహుమతి లభించాయి.
ఆడగుర్రాల అందాల పోటీల్లో కాకినాడకు చెందిన అనిల్‌రెడ్డి (ప్రథమ), విశాఖపట్నానికి చెందిన శ్రీకాంత్ (ద్వితీయ), అమలాపురం డివిజన్ ఉప్పలగుప్తానికి చెందిన బుజ్జి (తృతీయ), అనపర్తికి చెందిన లక్ష్మీ శ్రీనివాస్ నాలుగో బహుమతులను కైవసం చేసుకున్నారు. పిల్లల విభాగంలో కాకినాడకు చెందిన అనిల్‌రెడ్డి (ప్రథమ), తణుకుకి చెందిన నరసింహారావు( ద్వితీయ), విజయవాడకు చెందిన ఎస్కే షాజహాన్( తృతీయ), గోకవరానికి చెందిన దాసరి తమ్మన్నదొర నాలుగో బహుమతిని గెలుచుకున్నారు. గుర్రాల పరుగుపోటీల్లో కాకినాడకు చెందిన కె. వీరబాబు (ప్రథమ), వన్నెపూడికి చెందిన వి.మణి(ద్వితీయ), రాజమండ్రికి చెందిన పందలపాక అప్పారావు (తృతీయ) బహుమతులు గెలుచుకున్నారు. విజేతలకు డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప బహుమతి ప్రదానం చేశారు.
అపూర్వ జనాదరణ
జిల్లాలో తొలిసారిగా నిర్వహించిన గుర్రాల అందాల పోటీలు తిలకించేందుకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. జిల్లా నలుమూలలు నుంచి పెద్ద ఎత్తున కార్లలో తరలివచ్చి పలువురు పోటీలను తిలకించారు. డిప్యూటీ సీఎం చినరాజప్ప, ఎమ్మెల్సీ భాస్కరరామారావు, ఎంపీ తోట నరసింహం, మున్సిపల్ ఆర్డీ రాజేంద్రప్రసాద్ ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రౌండ్‌లోనే ఉండి పోటీలను ఆసక్తిగా తిలకించారు. ఎంపీ తోట కాసేపు గుర్రపుస్వారీతో సందడి చేశారు.