నో క్యూర్..
సాక్షి, వరంగల్ రూరల్: జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. పైన పటారం.. లోన లొటారం అనే రీతిలో బయట సూపర్‌స్పెషాలిటీ బోర్డులతో పాటు రకరకాల వైద్య నిపుణుల పేర్లు ఉంటున్నాయి. లోపల అడుగు పెడితే మాత్రం అందుకు విరుద్ధంగా ఒకరిద్దరు వైద్యులు మాత్రమే ఉంటారు. అర్హత లేకున్నా అన్నీ తామై వైద్య చికిత్సను ప్రారంభిస్తారు. కనీస సౌకర్యాలు లేకున్నా నాసిరకం వైద్యం అందిస్తూ కార్పొరేట్ స్థాయిలో ఫీజులు లాగుతారు. అవసరం లేకున్నా రకరకాల పరీక్షల పేరిట దండుకుంటారు. రోగి పరిస్థితి చేయిదాటితే వరంగల్, హైదరాబాద్‌లకు రెఫర్ చేస్తూ చేతులు దులుపుకుంటారు.
మెజారిటీ ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇదే తంతు జరుగుతున్నా, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఇటీవల నెక్కొండలోని ఓ ప్రైవేట్ సర్జికల్ ఆసుపత్రిలో ఓ మహిళ వైద్యురాలిపై రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ ఆస్పత్రి ప్రిస్పిక్షన్ పైన సైతం సదరు వైద్యాధికారి పేరు మీద ఉంది. కానీ ఆ వైద్యురాలు అందులో వైద్య సేవలు అందించడం లేదు. జిల్లా వైద్య అధికారుల తనిఖీలో వెలువడ్డ నిజాలు ఇవి. సదరు ఆస్పత్రిపై పలు ఆరోపణలు రావడంతో ఇటీవల డిప్యూటీ డీఎంహెచ్ఓ తనిఖీలు నిర్వహించారు. ఆ ఆస్పత్రిలో సర్జికల్ క్లీనిక్ నడిపే వైద్యాధికారి లేకుండా అర్హతలేని వైద్యులు సర్జికల్లు నిర్వహిస్తున్నారని తేలింది. దీంతో సదరు ఆస్పత్రికి జిల్లా వైద్యాధికారి నోటీసులు అందించారు.
ఇతర దేశాల్లో చదువులు..
జిల్లాలో అర్హతలేని వైద్యుల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఏ అర్హత లేకున్నా వైద్యులుగా చెలామణి అవుతూ దవాఖానాలు ప్రారంభించి చికిత్స అందిస్తున్నారు. ఎంసెట్ రాసిన అభ్యర్థులకు వారికి వచ్చిన మార్కుల ఆధారంగా ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తారు. మెడికల్ సీటుకు అర్హత సాధించని వారు ప్రైవేట్ కళాశాలల్లో ఫీజు చెల్లించి ఎంబీబీఎస్ పూర్తి చేస్తారు. ప్రభుత్వం నుంచి గుర్తింపు ఉన్న కళాశాలలల్లో మాత్రమే ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారిని మాత్రమే వైద్యులుగా ప్రభుత్వం గుర్తిస్తుంది. స్థానికంగా ఎంబీబీఎస్ సీట్లు రాని వారు రష్యా, ఉక్రెయిన్ లాంటి దేశాల్లో ఫీజు తక్కువ కావడంతో చదువు సాగిస్తున్నారు. అక్కడ ఎంబీబీఎస్ లేకపోవడంతో ఎండీ చదివినట్లు అక్కడి ప్రభుత్వాలు సర్టిఫికెట్లు అందజేస్తాయి.
విదేశాల్లో మెడికల్ విద్యను అభ్యసించిన వారుదేశ వ్యాప్తంగా ఢిల్లీలో నిర్వహించే పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఇక్కడి ప్రభుత్వాలు వైద్యుడిగా గుర్తిస్తాయి. ఏటా దేశం నుంచి 15వేల మందికి పైగా విదేశాల్లో మెడికల్ విద్యను అభ్యసిస్తున్నవారు ఇక్కడికి వచ్చిన తర్వాత పరీక్షల్లో పాసయిన వారిని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన వారు ఇక్కడ ఆస్పత్రిపై ఏర్పాటు చేసిన బోర్డుపై పెద్ద అక్షరాలతో ఎండీ రష్యా, ఉక్రెయిన్ అని రాసి బ్రాకెట్లో ఎంబీబీఎస్ అని పెట్టుకోవాలి. కానీ రష్యా, ఉక్రెయిన్‌లో చదివినా ఇక్కడికి వచ్చిన తర్వాత జిల్లాల్లో ఎండీ వైద్యులుగా చెలామణి అవుతున్నారు. ఎండీగా ఇక్కడి ప్రభుత్వాలు గుర్తించాలంటే ఎంబీబీఎస్ తర్వాత మూడేళ్ల కోర్సు చేయాలి. కానీ ధనార్జనే ధ్యేయంగా వైద్య వృత్తిని చేపట్టిన కొందరు అర్హత లేని వైద్యులు చేస్తున్న పనులు వైద్య వృత్తికి చెడ్డ పేరు తీసుకవస్తున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 41 నర్సింగ్ హోంలు, రిజిస్టర్ ఇన్ పేషెంట్ ఆస్పత్రులు ఉన్నాయి.
బోర్డులకే పరిమితం..
జిల్లాలోని పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట పలు వైద్యశాలల్లో డాక్టర్లు లేకున్నా వారి పేర్లు బయట బోర్డులపై రాస్తున్నారు. విజిటింగ్ వైద్యులు ఆయా ఆసుపత్రుల్లో వచ్చి వైద్యసేవలు అందించినప్పుడు వారు వచ్చే రోజు సమయం తప్పకరాయాలి. కానీ వైద్యశాల వద్ద ఏర్పాటు చేస్తున్న బోర్డులో 24 గంటల పాటు సదరు వైద్యుడు అక్కడే ఉన్నట్లు అర్థం వస్తుంది. ఆస్పత్రిలో ఇస్తున్న ఓపీ చిటీలో స్థానికంగా లేని వైద్యుల పేర్లు రాస్తున్నారు. మరికొన్ని ఆస్పత్రులు సూపర్ స్పెషాలిటీ పేరిట ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. అత్యవసర సేవల పేరుతో బోర్డులు ఏర్పాటు చేసిన అత్యవసర కేసులు వస్తే వరంగల్, హైదరాబాద్‌లకు రీఫర్ చేస్తున్నారు.
ఆసుపత్రుల తనిఖీల కోసం కమిటీలు వేశాం
కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు రిజిస్ట్రేషన్ ఒకరి పేరు మీద.. అందుబాటులో ఉండేది మరొకరని మా దృష్టికి వచ్చింది. జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేసేందుకు రెండు కమిటీలను వేశాం. నర్సంపేటకు డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, పరకాల, వర్ధన్నపేటలకు డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్యామ్ నీరజలను తనిఖీ అధికారులుగా నియమించాం. ఈ కమిటీ మూడు రోజు ల్లో తనిఖీ చేసి నివేదిక అందిస్తారు. ఈ నివేదికల ప్రకారం వాటిపై చర్యలు తీసుకుంటాం.
–డాక్టర్ మధుసూదన్,
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి