వ్యవస్థను బాగుచేసేందుకే ‘ఆస్పత్రి నిద్ర’
► మంత్రి కామినేని శ్రీనివాస్
అనంతపురం: వైద్య వ్యవస్థను బాగు చేయడం కోసమే ‘ఆస్పత్రి నిద్ర’ చేపట్టినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. సోమవారం రాత్రి అనంతపురం సర్వజనాస్పత్రిలోని సూపరింటెండెంట్ చాంబర్లో ఆయనతో పాటు మంత్రి పల్లె రఘునాథరెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ‘ఆస్పత్రి నిద్ర’ చేపట్టారు.
ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ వైద్య రంగంలో చిన్నచిన్న లోపాలున్న మాట వాస్తవమేనన్నారు. ప్రభుత్వం వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మంగళవారం ఉదయం సర్వజనాస్పత్రిని తనిఖీ చేస్తానని, మధ్యాహ్నం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహిస్తానన్నారు. ఇక్కడి సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఆస్పత్రిలోని అన్ని వార్డుల్లో సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. నీట్లో సీబీఎస్ఈ సిలబస్ ఉండడంతో తెలుగు విద్యార్థులకు కష్టంగా మారే అవకాశం ఉందన్నారు. ఎంసెట్‌లో వెయిటేజీ మార్కులుంటాయని, కానీ నీట్లో ఆ పరిస్థితి ఉండదన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మంత్రి పరిటాల సునీత, కలెక్టర్ కోన శశిధర్, మేయర్ స్వరూప, డిప్యూటీ మేయర్ గంపన్న, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నీరజ, సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్, ఆర్ఎంఓ వైవీ రావు, అడిషనల్ డీఎంఈ బాబ్జి తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ మల్లికార్జున వర్మ ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టారు.
పోస్టులు భర్తీ చేయాలి
ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో 124 జీవో ప్రకారం 510 పోస్టులను భర్తీ చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు మంత్రి కామినేనికి వినతిపత్రం అందజేశారు. ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఐదు నెలలుగా జీతాలు రాలేదని, తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. మెడికల్ కళాశాలకు పీజీ సీట్లు వచ్చేలా చూడాలన్నారు. అర్బన్ హెల్త్సెంటర్లను ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవలో ఆరోగ్యమిత్రలను తొలగించకుండా పాతవాళ్లనే కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌ఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు బండి పరశురాం, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్‌మోహన్, అధికార ప్రతినిధులు చింతకుంట మధు, శ్రీకాంత్‌రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తం, యువజన విభాగం నగర అధ్యక్షుడు మారుతినాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఎంఆర్ఐ సౌకర్యం కల్పించండి
సర్వజనాస్పత్రిలో ఎంఆర్ఐ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మంత్రికి వినతిపత్రం అందజేశారు. సర్వజనాస్పత్రి, మెడికల్ కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని విన్నవించారు.
మంత్రి కోసం ఇన్ని ఆర్భాటాలా?
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పర్యటన సందర్భంగా సర్వజనాస్పత్రిలో ఆర్భాటాలు చేయడమేంటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. సోమవారం రాత్రి ఆయన సర్వజనాస్పత్రిని పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల కొరతతో రోగులకు సక్రమంగా సేవలు అందించలేకపోతున్నట్లు కొందరు ఉద్యోగులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో అధికారులు తీవ్రంగా విఫలమయ్యారని ఆగ్రహించారు. కార్యక్రమంలో రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు రావుల వెంకయ్య, జిల్లా
కార్యదర్శి జగదీష్, జిల్లా సహాయ కార్యదర్శులు జాఫర్ తదితరులు పాల్గొన్నారు.