ఆతిథ్యం, విమానయాన రంగాల్లో అధిక ఉద్యోగాలు
ముంబై: విమానయానం, ఆతిథ్య రంగాల్లో ఈ ఏడాది ఉద్యోగాలు జోరుగా వస్తాయని నిపుణులంటున్నారు. ఈ రెండు రంగాల్లో విదేశీ కంపెనీలు పెట్టుబడులు కొనసాగిస్తున్నాయని, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయని గ్లోబల్హంట్ ఎండీ సునీల్ గోయల్ చెప్పారు. ఈ కారణాల వల్ల ఈ రెండు రంగాల్లో ఈ ఏడాది హైరింగ్ 40% వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఇదే విధమైన అభిప్రాయాన్ని కెల్లీ సర్వీసెస్ ఇండియా ఎండీ కమల్ కర్నాథ్ వ్యక్తం చేశారు.
ఆతిథ్య రంగంలో ఈ ఏడాది 60,000-80,000, విమానయాన రంగంలో పదేళ్లలో 3.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని వివరించారు. ఈ ఏడాది హైరింగ్ 20-25 శాతం వృద్ధి సాధిస్తుందని పీపుల్స్ట్రాంగ్ హెచ్ఆర్ సర్వీసెస్ సీఈఓ పంకజ్ బన్సాల్ చెప్పారు. ఆతిథ్యం, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాల్లో హైరింగ్ 25 శాతానికి పైగా వృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. వాహన, సాఫ్ట్వేర్, ఐటీ, బీపీఓ, ఐటీఈఎస్ రంగాల్లో 10 శాతం వృద్ధి ఉంటుందని వివరించారు.
బడ్జెట్లో ఆతిథ్యం, విమానయాన రంగాలకు నజరానాలు ప్రకటిస్తారని, దీంతో ఈ రెండు రంగాల్లో హైరింగ్ 8-10 శాతం చొప్పున పెరుగుతుందని తెలిపారు. ప్రధాని మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కారణంగా తయారీ రంగంలో కూడా భారీగానే ఉద్యోగావకాశాలు ఉంటాయని, అయితే వివిధ రంగాల్లో ప్రతిభ గల ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉందని నిపుణులంటున్నారు.