వసతిగృహాన్ని తరలిస్తే ఊరుకోం..
శ్రీకాకుళం : అక్కుపల్లి ఎస్సీ బాలుర వసతిగృహం తరలిస్తే సహించేది లేదని ఆ గ్రామస్తులు హెచ్చరించారు. ఇటీవల ప్రభుత్వం ఇక్కడ వసతిగృహం ఎత్తివేసింది. దీంతో వసతిగృహం వార్డెన్ శశిభూషణరావు బుధవారం వచ్చి అందులో ఉన్న సామగ్రి పలాస ఎస్సీ వసతిగృహానికి తరలించేందుకు పూనుకోగా అక్కుపల్లి, బైపల్లి గ్రామస్తులంతా ఏకమై అడ్డుకున్నారు.
వసతిగృహం పునరుద్దరణకు ఓ పక్క తాము ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ విషయం పలాస ఎమ్మెల్యే దృష్టిలో ఉందన్నారు. అయినా తమకు సమాచారం లేకుండా వార్డెన్ గుట్టుగా సామగ్రి తరలించడంతో గ్రామస్తులు మండిపడ్డారు. వార్డెన్‌ను నిలదీశారు. మాజీ ఎంపీపీ ఎస్.మోహనరావు, వైఎస్సార్సీపీ మండల అధికార ప్రతినిధి ఎం.రాంప్రసాద్, శ్రీరామాసేవా సంఘం అధ్యక్షుడు బర్రి పురుషోత్తం ఆధ్వర్యంలో వసతిగృహానికి మరో తాళం వేసి తమకు తెలియకుండా ఇక్కడ నుంచి ఏ వస్తువూ తరలించడానకి వీల్లేదని వార్డెన్ శశిభూషణరావుకు స్పష్టం చేశారు. అనంతరం ఆ శాఖ డీడీతో మాట్లాడారు. పాఠశాల సముదాయ చైర్మన్ ఎం.శేఖర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.