గ్రంథులకు గుడ్
తాబేలుకు ఒక నేచురల్ హెల్మెట్ ఉంటుంది. అది తలను మాత్రమే గాక... దాని ఒంటినంతా రక్షిస్తుంది. గ్రంథులను ఉత్తేజపరచి, దేహానికంతా రోగనిరోధకశక్తిని కలిగించి, గట్టి తాబేటి హెల్మెట్లాంటి రక్షణనిచ్చే ఆసనమే కూర్మాసనం... అనగా తాబేటి ఆసనం. ఇది బహుమేటి ఆసనం. కూర్మాసనమంత ప్రయోజనానిచ్చేవే ఇక్కడున్న పశ్చిమోత్తానాసనం, జానుశీర్షాసనం. ఈ ఆసనాలు వేయండి. ఆరోగ్యానికి ఇమ్యూనిటీ అనే హెల్మెట్ తొడగండి.
1జాను శీర్షాసన
కుడికాలు ముందుకు స్ట్రెచ్ చేసి ఎడమ మడమ పెరీనియంకు ఉంచి, శ్వాస తీసుకుని చేతులు, నడుము బాగా పైకి సాగదీయాలి. శ్వాస వదులుతూ నడుము కింద భాగం నుండి స్ట్రెచ్ చేస్తూ ముందుకు వంగి రెండు చేతులతో కుడిపాదం పట్టుకుని గడ్డం మోకాలు కిందకు తీసుకురావాలి. 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. కుడి కాలు ముందుకి స్ట్రెచ్ చేయలేనివారు మోకాలు కొంచెం పైకి లేపి ఉంచవచ్చు. కుడిపాదం అందనట్లైతే ఒక తాడును గాని, బెల్టును గాని పాదం చుట్టూ పోనించి రెండు చేతులతో పట్టుకుని శ్వాస వదులుతూ కొంచెం కొంచెం ముందుకు వంగడానికి ప్రయత్నించవచ్చు.
ఉపయోగాలు: కాలేయం, స్ప్లీన్, కిడ్నీ భాగాలకు మంచిది. జాగ్రత్తలు: స్త్రీలలో రుతుచక్రం మొదలైన తరువాత 13 నుండి 18వ రోజు మధ్యలో అండము విడుదలై గర్భాశయం వైపుకు ప్రయాణిస్తుంది. ఈ ఆసనము వలన అండం దిగువ ప్రయాణం ఆపబడుతుంది. కనుక గర్భం ధరించాలనుకునే స్త్రీలు ఈ రోజులలో ఈ ఆసనం చేయకూడదు.
2పశ్చిమోత్తానాసన
పశ్చిమ అంటే వీపు భాగం, ఉత్తాన అంటే సాగదీయడం. ఈ ఆసనంలో వీపు భాగం బాగా సాగదీయబడుతుంది కనుక పశ్చిమోత్తానాసన అని పేరు. కాళ్లు రెండూ కలిపి ముందుకు స్ట్రెచ్ చేసి శ్వాస తీసుకుంటూ చేతులు పైకి, శ్వాస వదులుతూ తల, చేతులు ముందుకు వ ంచి రెండు చేతులతో రెండు పాదాలు ఇంటర్ లాక్ చేసి పట్టుకునే ప్రయత్నం చేయాలి. నుదురు మోకాలుకు దగ్గరగా లేదా మోకాలు క్రిందకు, మోచేతులు రెండూ వీలైతే నేల మీద పెట్టే ప్రయత్నం చేయాలి. 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస తీసుకుంటూ తల, చేతులు పైకి శ్వాస వదులుతూ రెండు చేతులు ప్రక్క నుండి అరచేతులు భూమి వైపుకు చూపిస్తూ క్రిందకు తీసుకురావాలి. ఫొటోలో చూపిన విధంగా చేయలేని వారు ఏదైనా తాడును గాని, బెల్టును గాని తీసుకుని పాదాల క్రింద సపోర్టుగా ఉంచి రెండు కొనలను రెండు చేతులతో పట్టుకుని ముందు వంగే ప్రయత్నం చేయవచ్చు.
ఉపయోగాలు: వెన్నెముక, వీపు భాగాలు, కిడ్నీలు, ఎడ్రినలిన్ గ్రంథులకు చక్కగా టోనింగ్ జరుగుతుంది. పొట్ట బాగా లోపలికి లాగబడుతుంది. కనుక పొట్టలో కొవ్వు తగ్గుతుంది. జీర్ణశక్తికి మంచిది.
జాగ్రత్తలు: వెన్నెముక, సయాటిక సమస్యలు ఉన్నవారు మోకాళ్లు పైకి లేపి ఉంచవచ్చు. నిదానంగా చేసినట్లైతే సయాటిక సమస్యను పరిష్కరించవచ్చు.
3కూర్మాసన
కూర్మం అనగా తాబేలు. రెండు కాళ్లు ముందుకు, కాళ్ళ మధ్యలో రెండు అడుగుల దూరం, మోకాళ్లు కొంచెం పైకి లేపి శ్వాస వదులుతూ తల, శరీరాన్ని ముందుకు వంచి, చేతులను రెండు మోకాళ్ల కిందకు తీసుకువెళ్లి, వెనుక వీపు కింద భాగంలో చేతులు రెండు ఇంటర్లాక్ చేసి లేదా ఎడమచేతి మణికట్టును కుడి చేతితో పట్టుకుని, 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస తీసుకుంటూ తల, శరీరం పైకి తీసుకురావాలి. ఫొటోలో చూపిన విధంగా చేయలేని వారు రెండు కాళ్ల మధ్యలో నిలువుగా ఒక బాలిస్టర్ను ఉంచి శ్వాస వదులుతూ ముందుకు వంగి తల, ఛాతి భాగాలను బాలిస్టర్ మీద పెట్టి సౌకర్యంగా విశ్రాంత స్థితిలో ఉండవచ్చు.
ఉపయోగాలు: జీర్ణావయవాలకు, వెన్నెముకకు, ఎడ్రినలిన్ గ్రంథులకు మంచిది. హైబీపికి, మానసిక ప్రశాంతతకు మంచి ఆసనం.
యోగావగాహన
హఠయోగ సాధనలోని ముఖ్యమైన భాగాలు ఆరు.
1. శుద్ధిక్రియలు 2. ఆసనాలు 3. ప్రాణాయామం 4. ముద్రలు. 5. బంధనాలు 6. కుండలిని. ఈ వారం శుద్ధిక్రియల గురించి తెలుసుకుందాం. వీటిని ఆయుర్వేదంలో షట్కర్మలుగా, యోగాలో షట్క్రియలుగా పిలుస్తారు. షట్క్రియలు 6 రకాలు: 1. నేతి 2. ధౌతి 3. వస్తి 4. భాతి 5. నౌలి 6. త్రాటకం
1. నేతి: కొంచెం ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటిని కొమ్ముచెంబుతో తీసుకుని తలను ప్రక్కకు వంచి, నీటిని ఒక ముక్కు రంధ్రంలో నుండి పోసినప్పుడు అది రెండో ముక్కు రంధ్రంలో నుండి బయటకు రావటాన్ని జలనేతి అంటారు. రెండు మిల్లీమీటర్ల వ్యాసం గల రబ్బరు గొట్టాన్ని ఒక ముక్కు రంధ్రంలో నుండి పోనిచ్చి, నోటి లో నుండి బయటకు తీయాలి. అలాగే రెండో ముక్కులో నుండి కూడా చేసే క్రియను సూత్రనేతి అంటారు.
ఉపయోగాలు: సైనస్ క్లియర్ అవుతుంది. మ్యూకస్ మెంబ్రేన్ వాపు, తలనొప్పి, పార్శనొప్పులను తగ్గిస్తుంది. సెప్టమ్ డీవియేషన్ సమస్యను శస్త్రచికిత్స లేకుండా నయం చేయవచ్చు.
2. ధౌతి: కొంచెం ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటిని సుమారు 3 లీటర్లు తాగి దానిని వమనం (వాంతి) చేసుకోవడం జలధౌతి అంటారు. 3 మీటర్ల పొడవాటి రిబ్బనువలె ఉన్న వస్త్రాన్ని నోటి ద్వారా లోపలికి మింగి చిన్న ప్రేవులలో ఉన్న మలిన పదార్థాలతో కలిపి బయటకు తీయడం వస్త్రధౌతి అంటారు.
ఉపయోగాలు: ఉదరకోశ శుద్ధికి, అజీర్తి, ఎసిడిటీ, ఎనరెక్సియా సమస్యలకు పరిష్కారం.
3. వస్తి (శంఖ ప్రక్షాళన): కొంచెం ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటిని 2, 3 గ్లాసులు చొప్పున తాగుతూ శంఖ ప్రక్షాళన ఆసనాలను సాధన చేస్తూ సుమారు 4 లేదా 5 లీటర్లు తాగిన తరువాత ఆ ఒత్తిడికి చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులలో ఉన్న వ్యర్థ పదార్థాలను గుద ద్వారం గుండా బయటకు పంపించుట.
ఉపయోగాలు: జీర్ణవ్యవస్థ, మలవిసర్జన వ్యవస్థ శుద్ధి అవుతుంది.
4. భాతి: కపాలభాతి ద్వారా ముక్కు రంధ్రాల నుండి గాలిని జర్కులుగా బయటకు పంపిస్తూ పొట్టను పదే పదే లోపలికి లాగుట.
ఉపయోగాలు: నడుము, పొట్ట భాగాల్లోని ఎడిపోజ్ టిష్యూలో ఉన్న కొవ్వు కరగడానికి ఉపయోగపడుతుంది.
5. నౌలి: నిలబడి కొంచెం ముందుకు వంగి, మోకాళ్లు ముందుకు వంచి, పొట్టని లోపలికి లాగి నిలువుగా దండం ఏర్పడిన తరువాత, లోపల చిన్న ప్రేవులను కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి తిప్పాలి. ఇది మూడు రకాలు. వామ, దక్షిణ, మధ్యమ నౌలి.
ఉపయోగాలు: పునరుత్పత్తి సమస్యలకు, ఫైబ్రాయిడ్స్, ఒవెరియన్ సిస్ట్లు కరగడానికి ఉపయోగపడుతుంది. వీటికి శస్త్ర చికిత్స అవసరం లేదు.
6. త్రాటకం: చేతి బొటవ్రేలును ముఖానికి దూరంగా ముందు ఉంచి శ్వాస తీసుకుంటూ చేతిని, బ్రొటనవేలును పైకి, శ్వాస వదులుతూ క్రిందకు వర్తులాకారంలో తిప్పుతూ తలతిప్పకుండా కేవలం కనుగుడ్లను మాత్రమే తిప్పుతూ తదేకంగా బొటనవేలు గోరును చూస్తూ 10 లేదా 15 నిమిషాల పాటు చేయడం.
ఉపయోగాలు: కంటిచూపు, ఏకాగ్రత పెరగడానికి దోహదం చేస్తుంది. కార్టెక్స్ మెదడుమీద పనిచేస్తుంది.
పైన చెప్పిన క్రియలన్నీ అనుభవజ్ఞులైన యోగశిక్షకుల పర్యవేక్షణలోనే (ఉదయపు సమయంలో)చే యాలి.