కాకి లెక్కలు కుదరవు!
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: ఇడ్లీ రూ.16, వడ రూ.20, ఉప్మా రూ.16 ఇదేదో ఉడిపీ హోటల్ మెనూ అనుకుంటే పొరపాటే. ఈ ధరలు ఎన్నికల కమిషన్ నిర్ధారించినవి. మారేటు సప‘రేటు’ అంటూ ఎన్నికల కమిషన్ అభ్యర్థుల ఖర్చులను కట్టు దిట్టం చేసింది. ప్రతి అభ్యర్థి తమ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టి ఆ తర్వాత కాకి లెక్కలు చూపకుండా ఎన్నికల కమిషన్ స్వయంగా ఎన్నికల ప్రచారానికి స్టేజీ కట్టింది మొదలు మైకు సెట్ రేటు, డ్రైవర్ బత్తా వరకు ప్రతి ధరను నిర్థారించింది.
ప్రచార కార్యక్రమాల నిర్వహణలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఉపయోగించే పలు ప్రచార సాధనాలు, వస్తువుల ధరలను ఎన్నికల కమిషన్ నిర్ణయించి వాటిని వెల్లడించింది.
రాజకీయపార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం ఎన్నికల ప్రచార వ్యయాన్ని, నిర్థారించిన రేట్లను ఖర్చుల్లో చూపాల్సిందే. ఎన్నికల కమిషన్ నిర్ణయంతో అభ్యర్థులు ఎన్నికల వ్యయం విషయంలో తప్పుడు లెక్కలు చూపేందుకు ఎటువంటి ఆస్కారం ఉండదు. లేదంటే ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగి అభ్యర్థులపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయంటున్నారు ఎన్నికల అధికారులు. ఎన్నికల కమిషన్ నిర్థారించిన రేట్లు ఇలా ఉన్నాయి.
క్ర.సం. ఐటం రేట్లు
01. ఇడ్లీప్లేటు రూ.16
02. వడ ప్లేటు రూ.20
03. ఉప్మా ప్లేటు రూ.16
04. మైక్రోఫోన్ రూ.1000
05. యాంప్లిఫయిర్ రూ.3వేలు
06. స్టేజీ డెకరేషన్(20/12 సైజు) రూ.6వేలు
07. స్టేజీ డెకరేషన్(16/8 సైజు) రూ.5వేలు
08. క్లాత్బ్యానర్లు(ఒకఫీటుకు) రూ.25
09. గుడ్డ జెండాలు(ఒకటికి) రూ.25
10. ఫ్లెక్సీ తయారీ(స్క్వేర్ఫీట్కు) రూ.8
11. పోస్టర్లు(17/27సైజు 1000కి) రూ.3500
12. కటౌట్ తయారీ (స్క్వేర్‌ఫీట్) రూ.125
13. డీవీడీ (ఒకటికి) రూ.10
14. ఆడియో క్యాసెట్(ఒకటికి) రూ.20
15. ఆడియో క్యాసెట్ రికార్డర్(ఒకటికి) రూ.35
16. భోజనం(ఒకరికి) రూ.55
17. సుమో/ఇండికా కారు(ఒక రోజుకు) రూ.1000
18. సుమో/ఇండికా కారు డ్రైవర్ బత్తా(ఒకరోజుకు) రూ.200