ఉప్పెనలా ఉద్యమం
రాష్ట్ర విభజన సెగలు రగులుతున్నాయి. సమైక్యాంధ్రోద్యమం మహోధృతంగా సాగుతోంది. వివిధ పార్టీలు, ఉద్యోగ, ప్రజా సంఘాలు, విద్యార్థుల నేతత్వంలో నిరసనలు మిన్నంటుతున్నాయి. భీమిలిలో ఆందోళనకారులు వంటావార్పు చేపట్టారు. తగరపువలసలో ఆటో కార్మికులు వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. నాయుడుతోటలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. జాతీయ రహదారిపై విద్యార్థులు బైఠాయించారు. ఏయూలో విద్యార్థుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లాలోనూ అదే పరిస్థితి కనిపించింది. సీలేరులో బంద్ నిర్వహించి ఉద్యమానికి ఊపుతెచ్చారు. అనకాపల్లిలో మున్సిపల్ ఉద్యోగులు రోడ్డెక్కారు. వాయిద్య కళాకారులు, సెల్ దుకాణ నిర్వాహకులు, ఆటో కార్మికులు, వికలాంగుల జేఏసీ నేతలు ఆందోళనను ఉధృతం చేశారు. నర్సీపట్నం పరిధిలో వైద్యులు, విశ్వబ్రాహ్మణులు ప్రదర్శనలతో హోరెత్తించారు. న్యాయవాదుల దీక్షలు కొనసాగిస్తున్నారు.
అట్టుడికిన జగదాంబ జంక్షన్ : జగదాంబ జంక్షన్ మంగళవారం అట్టుడికిపోయింది. న్యాయవాదుల ర్యాలీ, స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించారు. జిల్లా చౌకధరల దుకాణ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శనలు జరిగాయి. సెవెన్త్‌డే విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సాలిపేటలో రజకసంఘం ఆధ్వర్యంలో సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మల్ని దహనం చేశారు. ప్రభ చారిటబుల్ ట్రస్ట్, క్లినికల్ డయాగ్నోస్టిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసనలు హోరెత్తాయి. టీడీపీ బీచ్‌రోడ్డులో కాంగ్రెస్ అగ్రనేతలకు పిండ ప్రదానం చేపట్టింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేసి, వంటావార్పు చేపట్టారు. జీవీఎంసీ ప్రధాన అధికారులు దీక్షలకు దిగారు.
వైశాఖి మహా నగర మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈపీడీసీఎల్ ఉద్యోగులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. క్రికెట్ ఆడి నిరసన వ్యక్తం చేశారు. 28వ వార్డులో కోలాగురువులు ఆధ్వర్యంలో ఆందోళన జరి గింది. పైడా నర్సింగ్ కళాశాల విద్యార్థినులు నిరసన ప్రదర్శన చేశారు. మద్దిలపాలెంలో ఎన్ఎంయూ ఆధ్వర్యంలో రెండోరోజూ దీక్షలు కొనసాగాయి. మధురవాడ పరిధిలో తాతబ్బాయి (62) అనే వృద్ధుడు తనువు చాలించాడు. తాటిచెట్లపాలెం జాతీయ రహదారిపై ఉద్యమకారులు నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా టీవీల్లో ఎంటర్టైన్మెంట్ చానళ్లను నిలిపివేశారు.