ఇల్లు చూసేందుకు రూ. 2,500.. ఇదెక్కడి అరాచకం!
ఎక్కడైనా మీకు ఇల్లు అద్దెకు కావాలంటే ఏం చేస్తారు.. మొదట ఇల్లు చూసి అంతా నచ్చితే అడ్వాన్స్ ఇచ్చి ఇంట్లో చేరుతారు. కానీ అక్కడ మాత్రం మొదట ఇల్లు చూసేందుకే రూ.2,500 కట్టాలట. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వ్యవహారం గురించి విన్న నెటిజన్లు ఇదెక్కడి అరాచకంరా నాయనా.. అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఇల్లు అద్దెకు దొరకడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. అత్యంత జనాభా ఉండే మెట్రో నగరాల్లో ఢిల్లీ కూడా ఒకటి. ఈ నగరంలో అద్దె ఇంటి కోసం వెతుకుతున్న ఓ వ్యక్తికి అసాధారణమైన పరిస్థితి ఎదురైంది. ఇంటి వేటలో భాగంగా ఒక బ్రోకర్‌ను సంప్రదించగా 'సొసైటీ విజిటింగ్ కార్డ్' పేరుతో అద్దె ఇంటిని చూసేందుకు రూ. 2,500 కట్టాల్సి ఉంటుందని సూచించాడు.
సదరు వ్యక్తి తనకు ఎదురైన ఈ పరిస్థితి గురించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్ (Reddit)లో షేర్ చేశారు. ఇది చట్టబద్ధమైనదేనా లేదా స్కామా అని యూజర్లతో అనుమానం వ్యక్తం చేశారు. బ్రోకర్‌తో జరిగిన వాట్సాప్ సంభాషణ స్క్రీన్‌షాట్‌ను కూడా జత చేశారు. దీంట్లో బ్రోకర్ చెప్పినదాని ప్రకారం.. “ఇల్లు చూసేందుకు విజిటింగ్ ఫీజు రూ. 2500. మీకు ఫ్లాట్ నచ్చితే, అద్దె మొత్తంలో రూ. 2500 మినహాయిస్తారు. ఒకవేళ ఫ్లాట్ నచ్చకపోతే రూ. 2500 తిరిగిస్తారు.”
జనవరి 13న చేసిన ఈ పోస్టుకు యూజర్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. చాలా మంది యూజర్లు దీన్ని స్కామ్‌గా అభిప్రాయపడ్డారు. బెంగుళూరు వంటి నగరాల్లో కనింపించే స్కామ్ ఇప్పుడు ఢిల్లీలోనూ జరగుతోందంటూ ఓ యూజర్ బదులిచ్చారు. ఇల్లు చూసేందుకు విజిటింగ్ కార్డ్ ఎందుకు.. అదేమైనా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఇల్లా అంటూ మరో యూజర్ వ్యాఖ్యానించారు.