గృహనిర్మాణ శాఖలో సమాచార కేంద్రాల మూసివేత
సాక్షి, హైదరాబాద్: గృహనిర్మాణ శాఖలో ఉన్న హౌసింగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ల (హెచ్ఐసీ)లకు మంగళం పాడబోతున్నారు. పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారులు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోవటానికి వీలుగా ప్రభుత్వం గతంలో వీటిని ఏర్పాటు చేసింది. మండల, సబ్ డివిజన్, డీ ఈఈల స్థాయిలో వీటిని ఏర్పాటు చేశారు. అయితే ఇందులో పనిచేయటానికి సొంతంగా సిబ్బందిని నియమించకుండా ఓ ప్రైవేటు సంస్థకు గృహనిర్మాణ శాఖ ఆ బాధ్యతను కాంట్రాక్టు పద్ధతిలో కేటాయించింది. ఈ నవంబర్‌తో కాంట్రాక్టు గడువు పూర్తికాబోతున్నందున దాన్ని, ఆ విధానాన్ని కొనసాగించొద్దని నిర్ణయించింది. నవంబర్ 30 తర్వాత ఆ కార్యాలయాల్లోని ఫర్నిచర్‌ను, ఇతర వస్తువులను తొలగించాలంటూ తాజాగా ఆ ప్రైవేటు సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ ఒకటి నుంచి ఆ కార్యాలయాలు పనిచేయవని తేల్చిచెప్పింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భారీ అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం ఇటీవలే సీఐడీ విచారణకు ఆదేశించటంతో ఆ కసరత్తు జరుగుతోంది. దీంతో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపునూ నిలిపివేసింది. అటు బిల్లులు అందకపోయేసరికి లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని ఆపేశారు. ఎన్నికల ప్రధాన వాగ్దానమైన రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణాన్ని సీఐడీ విచారణ తర్వాతే ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ తరుణం లో ఈ ఇన్ఫర్మేషన్ సెంటర్లు అవసరం లేదని అధికారులు భావించారు. ఈ కేంద్రాల్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 500 మంది పనిచేస్తున్నారు.