రుషికొండ చేరిన ‘ఉభయచరం’
భారత రక్షణ దళంలో భాగంగా కోస్టుగార్డు అధికారులు సిద్ధం చేసిన కోస్టుగార్డు హోవర్‌క్రాఫ్ట్ హెచ్-193 నౌక సోమవారం విశాఖ ప్రాంతం రుషికొండ తీరానికి చేరింది. దీన్ని సముద్ర జలాలు, రోడ్డుపై కూడా నడపవచ్చు. మన దేశ సరిహద్దు జలాలు దాటి చొరబడిన శత్రు దేశాల యుద్ధ నౌకలు గుర్తిస్తుంది. సముద్రం అడుగులో మునిగిపోయిన, రాళ్ల మధ్యలో చిక్కుకుపోయిన నౌకల జాడ కనిపెడుతుంది.
దీన్ని పూర్తిగా యునెటైడ్ కింగ్డమ్ సాంకేతిక నైపుణ్యంతో తయారు చేశారు. ఇది నీటిలో గంటకు 45 నాటికల్ మైళ్ల (540 కిలోమీటర్లు) వేగంతో దూసుకుపోతుంది. దీనిలో 13 మంది ఉండడానికి వీలుగా సీట్లు, సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇందులోనే డైనింగ్‌హాల్, బాత్రూమ్, మరుగుదొడ్లు ఉన్నాయి. ఇంజన్ సామర్థ్యం 693 కిలోవాట్లు. ఇంజన్ కేబిన్‌లో నైట్‌విజన్ కెమెరాలు, రూట్‌మ్యాప్ ఏర్పాటు చేసి ఉన్నాయి. - న్యూస్‌లైన్, విశాఖపట్నం