'బ్రిటీష్ మ్యూజియం నుంచి కళాఖండాలు తెప్పిస్తాం'
గుంటూరు: బ్రిటీష్ మ్యూజియంలో ఉన్న ఇక్కడి కళాఖండాలను రప్పించేందుకు కృషిచేస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలశాఖల మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. అమరావతిలో హృదయ్ ప్రాజక్టుకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. చరిత్ర, సంస్కృతి గుర్తుంచుకుంటే మనిషి మనుగడ సాధ్యమవుతుందని ఆయన స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి శతాబ్దాల చరిత్ర ఉందని, సాక్షాత్తూ గౌతమ బుద్ధుడు నడయాడిన ప్రదేశం అమరావతి అని కేంద్ర మంత్రి వెంకయ్య పేర్కొన్నారు.
రూ.70 కోట్లతో పర్యాటక, ఆధ్యాత్మిక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామన్నారు. ఆంధ్రజాతికి అమరావతితో విడదీయరాని సంబంధం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ రాజధానికి అమరావతి కంటే సముచితమైన పేరు ఇంకొకటి ఉండదన్నారు. ధాన్యకటకంగా ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. దేశంలో వారసత్వ నగరాలు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.