ఊరి చుట్టూ ఫ్యాక్టరీలు..ఉపాధి మాత్రం కరువు
జేసీ కనుసన్నల్లో పరిశ్రమల యాజమాన్యాలు
పలుకుబడి ఉంటేనే స్థానికులకు కొలువు
తాడిపత్రి ప్రాంతంలో ఇదీ.. పరిస్థితి
తాడిపత్రి, న్యూస్‌లైన్: ఊరి చుట్టూ పెద్దపెద్ద పరిశ్రమలున్నా.. స్థానికులకు ఉపాధి కరువవడంతో, అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారైంది తాడిపత్రి వాసుల పరిస్థితి. కర్నూలు, వైఎస్సార్ జిల్లాల సరిహద్దులో ఉన్న తాడిపత్రి ప్రాంతంలో అపారమైన సున్నపురాతి నిల్వలుండడంతో ఈ ప్రాంతంలో ఇప్పటికే నాలుగు భారీ సిమెంట్ కర్మాగారాలు ఏర్పాటుకాగా, మరో కర్మాగారానికి అనుమతి లభించింది.
ఆసియాలోనే అతిపెద్దదైన అల్ట్రాటెక్ సిమెంటు ప్లాంటుతోపాటు, పెన్నా, బీఎంఎం కర్మాగారాలతోపాటు, రెండు ఉక్కు కర్మాగారాలు కూడా ఉన్నాయి. వీటన్నింటిలో ప్రత్యక్షంగా పరోక్షంగా 20 వేల మంది ఉపాధి పొందుతుండగా, వీరిలో స్థానికులు మాత్రం వేళ్లపై లెక్కపెట్టేంత మంది మాత్రమే ఉన్నారు.
జేసీ కనుసన్నల్లోనే...
ఈ నాలుగు సిమెంటు ఫ్యాక్టరీల యాజమాన్యాలూ జేసీ సోదరుల కనుసన్నల్లోనే నడచుకుంటాయని, వారి అనుమతి లేనిదే, ఈ సంస్థల్లో ఉద్యోగాలు లభించవన్న ఆరోపణలున్నాయి. ఇతర జిల్లాలు, రాష్ట్రాల వారికి ఉద్యోగాలు కల్పించడంలో చూపే శ్రద్ధ వారు స్థానికులపై చూపరని చెబుతారు. ఎవరైనా ఈ విషయంపై ప్రశ్నిస్తే పోలీసుల సాయంతో కేసులు నమోదు చేయిస్తారన్న భయం స్థానికుల్లో పేరుకుపోయింది.
ఈ పరిశ్రమల కోసం భూములు కోల్పోయిన రైతుల కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో సైతం వారు చొరవ తీసుకోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంపై పలుసార్లు ధర్నాలు చేసినా ఫలితం కనిపించలేదని అంటున్నారు. ఇక, ఈ పరిశ్రమల్లోని కాంట్రాక్టు పనులన్నీ జేసీ అనుచరులే దక్కించుకున్నారు.
ఇతరులెవరైనా ఈ పనులు దక్కించుకుంటే వారిపై దాడులకు పాల్పడడం, అక్రమ కేసులు బనాయించడం పరిపాటిగా మారిందని అంటున్నారు. రెండు దశాబ్దాలుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో స్థానిక యువతకు ఈ ప్రాంతంలోని పరిశ్రమల్లో ఉపాధి లభించడం కష్టంగా మారింది. ఆయా సంస్థల్లో తమకు ఉపాధి అవకాశం కల్పించే వారికే తమ మద్దతు ఉంటుందని, ఇంతకాలం నిర్లక్ష్యం చేసిన వారికి ఓటు హక్కుతో బుద్ధి చెప్పాలని యువత భావిస్తోంది.