హక్కుల పతాకానికి సలాం
కొత్త కోణం
దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జరిగిన జాతివ్యతిరేక ప్రపంచ సదస్సులో భారతదేశం నుంచి పెద్ద సంఖ్యలో దళిత ప్రతినిధులు హాజరై, వివక్షకు వ్యతిరేకంగా గొంతు వినిపించారు. అయినా ఇంకా అది పూర్తిస్థాయిలో ఫలించలేదు. థర్డ్ జెండర్ హక్కులను మానవహక్కులుగా గుర్తించాలని అనేక ఉద్యమాలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని దేశాలు వారి హక్కులను గుర్తించ డమూ అభినందించాల్సిన విషయం. అలాగే వలస కార్మికుల సమస్య కూడా ఇటీవల చాలా తీవ్రమైంది. వివిధ దేశాల్లో పనిచేస్తున్న వలస కార్మికులకు సరైన హక్కులు, సౌకర్యాలు లేవు.
దక్షిణాఫ్రికాలో కదిలే రైలు నుంచి మోహన్‌దాస్ కరంచంద్ గాంధీని గెంటి వేసిన సంగతి మనం చదివాం. న్యాయవాది మోహన్‌దాస్ కరంచంద్‌ని రిజ ర్వేషన్ బోగీ నుంచి గెంటివేసిన తెల్ల జాత్యహంకారం నేటికీ కొనసాగుతూనే ఉంది. బ్రిటిష్ వాళ్లు బసచేసే హోటళ్లలో కూడా వసతి ఇవ్వలేదు. రెస్టారెంట్లో తమతో కలసి భోంచేసేందుకు సైతం అనుమతించని తెల్లజాతి వర్ణవివక్ష గాంధీని నిలువెల్లా దహించివేసింది.
ఇటువంటి వెలివేతలు గాంధీలో స్వేచ్ఛా సమానత్వ కాంక్షను ప్రేరేపించాయి. తాను పుట్టిన గడ్డమీదనే వెలివేతల వెతలు అనుభవించిన వ్యక్తి డాక్టర్ భీంరావు అంబేడ్కర్. పాఠశాలలో ఒక మూలన కూర్చొని సామాజిక వెలివేతను చవిచూసిన పసిహృదయంలో రగి లిన జ్వాల ఆ తరువాత దావానలంలా మారింది. దాహం వేసి మంచినీళ్లు అడిగితే అంటరాని కులం వాడని భీంరావుని బురదగుంటలో నీళ్లు తాగమన్న ప్పుడు గాయపడ్డ ఆ హృదయం విలవిల్లాడింది. తండ్రిని చూసేందుకు ఎడ్ల బండిలో వెళుతున్న భీంరావు అంటరానివాడని తెలిసి, బండిని ముందుకు పోనిచ్చేందుకు కూడా నిరాకరించినప్పుడు ఆయనలో పరాభవం ఆగ్రహజ్వా లగా మారింది.
ఈ మూడు ఘటనలు డాక్టర్ అంబేడ్కర్ అంటరానితనం మీద తిరుగుబాటు జెండాను ఎగురవేయడానికి పునాదిగా నిలిచాయి. గాంధీ బ్రిటిష్ జాత్యహంకారంపైన, అంబేడ్కర్ అస్పృశ్యతపైన పోరాటం చేసినా ఈ రెండింటి తాత్విక పునాది సమానత్వమే. వివక్షా రహిత మానవ సమాజ నిర్మాణమే. చరిత్రలో అటువంటి ఆలోచనలు, ఆచరణలే మానవ హక్కులకు, పౌర హక్కులకు పునాదిరాళ్లుగా నిలిచాయి.
పరిస్థితులు కల్పించిన అనుభవం, దానితో పాటు అందివచ్చిన చైత న్యం తమ ఉనికి కోసం పోరాటానికి సంసిద్ధులను చేస్తాయి. ఆ పోరాటం ద్వారానే హక్కులు అందివస్తాయి. సరిగ్గా 67 సంవత్సరాల క్రితం ఇదే రోజున (1948, డిసెంబర్,10) ఐక్యరాజ్యసమితి ప్రపంచ మానవహక్కుల ప్రకటన చేసింది. ఈ ప్రకటన వెనుక దశాబ్దాల పోరాట చరిత్ర ఉంది. అయితే హక్కుల సాధనకు గానీ, పోరాటానికి గానీ ఇది ఆదీ కాదు, అంతమూ కాదు. భారతదేశంలో మానవహక్కుల ఉద్యమానికి బుద్ధుడి తాత్వికత పునాది కాగా, సమ్రాట్ అశోకుడు సాగించిన పాలన దానికి ఆచరణ రూపమిచ్చింది. ఆయన ప్రతిష్టించిన శిలాశాసనాలలో అది సాక్షాత్కరిస్తున్నది. పిల్లర్ రాక్ ఎడిక్ట్లలో 6వ శాసనం ఈ విషయాన్ని రూఢి చేస్తున్నది.
‘‘నేను పట్టాభిషిక్తుడి నైన పన్నెండేళ్ల తర్వాత ధమ్మం ప్రబోధించే శాసనాలను రూపొందించాను. ప్రజలందరి సంక్షేమం, సంతోషం కోసం నేను చేస్తున్న విషయాలను వెల్లడిం చాను. ప్రజలందరూ సుఖంగా, సంతోషంగా ఉండాలంటే ఏమి చేయాలి? నేను బంధుమిత్రులందరికీ ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాను. ఇస్తాను. అయితే ఇదే విధమైన ఆదరణను ప్రజలందరికీ అందిస్తున్నాను. వివిధ సంప్రదా యాలు కలిగిన అన్ని మతాలను నేను గౌరవించాను. అయితే ప్రజలందరికీ చేరువగా వెళ్లడం అన్నింటికంటే ఉత్తమమని భావిస్తాను’’. ఈ శాసనం భారతదేశంలో బౌద్ధ ధమ్మం ప్రారంభించిన ఒక మహత్తరమైన ఉద్యమం. అయితే అది ఉద్యమ రూపంలోనే కాకుండా, శాసనం ద్వారా చట్టరూపం కూడా దాల్చింది. ఒకరకంగా ఈనాటి మానవ హక్కుల ఆలోచనకు అక్కడే పునాదులు పడ్డాయంటే అసత్యమేమీకాదు. మిగతా దేశాల్లో హక్కులు, మానవహక్కుల పరిణామక్రమం ఎలాంటిదో పరిశీలిద్దాం.
మనుషులందరూ ఒకే రకమైన గౌరవంతో, సమాన హక్కులతో జన్మిస్తారనేది మానవహక్కుల నిర్వచనంగా చెప్పుకోవచ్చు. మానవహక్కులు లిఖిత పూర్వక చట్టాలలో, రాజ్యాంగంలో చేరితే అవే ప్రాథమిక హక్కులవు తాయని న్యాయకోవిదుల అభిప్రాయం. మానవ హక్కులు వ్యక్తుల స్వేచ్ఛకూ, సమానత్వానికీ, విముక్తికీ మార్గనిర్దేశనం చేస్తాయి. ప్రపంచ హక్కుల చరిత్రలో బ్రిటిష్‌రాజు లిఖిత పూర్వకంగా ఆమోదించిన మొట్ట మొదటి చట్టం ‘ది మాగ్నా కార్టా’ (1215). 63 క్లాజులతో ఉన్న ఈ చట్టం ప్రజలకు పౌరహక్కులను, న్యాయపరమైన రక్షణలను అందించడం మాత్రమే కాక, అక్రమ పన్నుల విధానానికి స్వస్తి పలికింది. మళ్లీ ‘ది ఇంగ్లిష్ బిల్ ఆఫ్ రైట్స్ 1689’ను బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించి, అప్పటికే సంప్రదాయకంగా ఉన్న సూత్రాలను క్రోడీకరించి పౌరుల స్వేచ్ఛ, హక్కులకు ఒక రూపం ఇచ్చింది.
ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి 1776 జూలై,4న అమెరికా స్వాతంత్య్రం ప్రకటించుకున్నది. దేశ ప్రజలు పరాయి దేశం చేతిలో బందీలుగా ఉండకూడదనే సార్వభౌమాధికార హక్కుకు అమె రికా ప్రజల ఆ తిరుగుబాటు ఒక ఉత్తేజం. ఆ తర్వాత ‘ది యు.ఎస్. బిల్ ఆఫ్ రైట్స్, 1791’ మరొక ముఖ్య ఘట్టం. ఫ్రెంచి విప్లవం మరొక రాజకీయ తాత్వి కతకు తెరతీసింది. అక్కడి రాచరిక వ్యవస్థను కూలదోసి చరిత్ర సృష్టించింది. 1789 ఆగస్టు 4న జాతీయ అసెంబ్లీ ‘ది ఫ్రెంచ్ డిక్లరేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ మాన్ అండ్ ఆఫ్ ది సిటిజన్ 1789’ను ఆమోదించింది. ఇది ఫ్రాన్స్ చరిత్రను మార్చి, చాలా దేశాల హక్కుల ప్రస్థానానికి దిక్సూచిగా నిలిచింది.
మొదటి ప్రపంచ యుద్ధానంతరం మానవ హక్కులపైన చర్చ విస్తృత మైంది. 1929లో అంతర్జాతీయ న్యాయసంస్థ ‘మనిషి అంతర్జాతీయ హక్కు లు’ పేరుతో ఒక ప్రకటన చేసింది. ఆ తర్వాత 1945లో ‘యునెటైడ్ నేషన్స్ చార్టర్’ను 51 దేశాల ప్రతినిధులతో శాన్ఫ్రాన్సిస్కోలో ఆమోదించారు. మానవహక్కుల పరిరక్షణ, విస్తరణ మీద ఆ చార్టర్ దృష్టిని కేంద్రీకరించింది. మానవ హక్కుల పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన చార్టర్ ఇదే. ఆ తర్వాత 1948 డిసెంబర్ 10వ తేదీన ఐక్యరాజ్యసమితి సాధారణ ప్రపంచ మానవహక్కుల ప్రకటనను ఆమోదించింది. ఇందులో పురుషులు, మహి ళలు, పిల్లలతో సహా మానవులందరికీ పౌర, రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులను కల్పిస్తూ 30 ఆర్టికల్స్‌ను రూపొందించారు. గౌరవ ప్రదమైన సమాన హక్కులను కల్పిస్తూ, స్వేచ్ఛ, న్యాయం, శాంతులతో కూడిన మానవ సమాజాన్ని నిర్మించడం ఈ ప్రకటన లక్ష్యంగా పీఠికలో పేర్కొన్నారు.
ఈ ప్రకటనలోని మొదటి ఆర్టికల్‌లో పేర్కొన్నట్టుగా మనుషు లుగా జన్మించిన అందరూ సమానమైన గౌరవం, హక్కులను కలిగి ఉం టారు. ఒకరికొకరు సహకరించుకుంటూ సోదర భావాన్ని పెంపొందించే వైపు పయనించాలని కూడా తెలిపారు. రెండవ ఆర్టికల్‌లో జాతి, రంగు, లింగ, భాష, మతం, రాజకీయ, జాతీయ, వర్గ, పుట్టుక, హోదాల పరంగా వివక్ష చూపకూడదని స్పష్టం చేశారు. ప్రతి మనిషికి జీవించే హక్కుతోపాటు స్వేచ్ఛ, భద్రత ఉండాలని మూడవ ఆర్టికల్ చెప్పింది. బానిస వ్యాపారాలు ఏ రూపంలో ఉన్నా రద్దు చేయాలనీ, ఏ వ్యక్తినీ కూడా సరైన కారణం లేకుండా నిర్బంధించడం, దేశం నుంచి బహిష్కరించడం వంటివి తగవనీ కూడా ఈ ప్రకటనలో తెలిపారు.
దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివాసముండే హక్కు ను, ఒకవేళ ఎవరైనా దేశం వదిలిపెట్టి పోదలచుకుంటే అటువంటి అవకా శాన్ని కూడా ఇవ్వడం, ఏ దేశంలోనైనా ఆశ్రయం కోరడం, ఏ దేశ పౌరసత్వా న్నైనా అభ్యర్థించడం, వ్యక్తులుగానీ, సంస్థలుగానీ, సొంత ఆస్తిని కలిగి ఉం డవచ్చుననీ, సరైన కారణం లేకుండా ఆస్తికి దూరం చేయడం సరికాదని ప్రకటనలో తెలిపారు. అందరికీ ప్రామాణికమైన వైద్యం, విద్య, గృహం, ఆహారం, దుస్తులు పొందే హక్కులు కలిగించాలి. అంతిమంగా, ఏ దేశం కూడా ఈ ప్రకటనలోని అంశాలకు వక్రభాష్యాలు చెప్పడం కానీ, సరైన ఆచ రణాత్మక కార్యక్రమాలు రూపొందించకపోవడం సరికాదని స్పష్టం చేశారు.
ఈ అంతర్జాతీయ మానవహక్కుల ప్రకటన వివిధ దేశాల్లో జరుగుతున్న ఎన్నో హక్కుల ఉద్యమాలకు నైతిక శక్తినిచ్చింది. ఇటీవల నియంతృత్వ దేశా ల్లో సాగిన, సాగుతున్న ప్రజాస్వామ్య ఉద్యమాలకు కొండంత ధైర్యాన్ని చ్చింది. దీని ఆధారంగానే ఐక్యరాజ్యసమితి కొన్నిసార్లు సహేతుకమైన జోక్యాన్ని కలుగజేసుకొని ప్రజాస్వామ్య శక్తులకు బలాన్ని అందించింది. ఈ ప్రకటనలో పేర్కొన్న అంశాలు మాత్రమే కాకుండా, ఎన్నో నూతన అంశాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. మానవ హక్కులను విస్తృతార్థంలో చూడటం మొదలైంది.
మనిషి స్వేచ్ఛకూ, సమానత్వానికీ ఉద్దేశించిన అనేక కోణాలు ఇప్పుడు హక్కుల ప్రాధాన్యతను మరింత పెంచాయి. ముఖ్యంగా దక్షిణా సియా దేశాల్లో కొనసాగుతున్న కుల వివక్ష కూడా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ఎజెండాలో భాగం కావాలనే డిమాండ్ పెరిగింది. 2001 సంవత్స రం దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జరిగిన జాతి వ్యతిరేక ప్రపంచ సదస్సులో భారతదేశం నుంచి పెద్ద సంఖ్యలో దళిత ప్రతినిధులు హాజరై, వివక్షకు వ్యతి రేకంగా గొంతు వినిపించారు. అయినా ఇంకా అది పూర్తి స్థాయిలో ఫలించ లేదు. థర్డ్ జెండర్ హక్కులను మానవహక్కులుగా గుర్తించాలని అనేక ఉద్యమాలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని దేశాలు వారి హక్కులను గుర్తించ డమూ అభినందించాల్సిన విషయం.
అలాగే వలస కార్మికుల సమస్య కూడా ఇటీవల చాలా తీవ్రమైంది. వివిధ దేశాల్లో పనిచేస్తున్న వలస కార్మికులకు సరైన హక్కులు, సౌకర్యాలు లేవు. యుద్ధాలు, ఘర్షణల వల్ల నిరాశ్రయులై ఇతర దేశాల్లో ఆశ్రయం పొందుతున్న వారి సమస్యలు కూడా ఎక్కువగా తెర మీదకు వస్తున్నాయి. వస్తూనే ఉంటాయి. మానవహక్కుల ప్రస్థానం, ఉద్య మం స్తంభించిపోదు. పోకూడదు. మానవ జాతి మనుగడ సాగించినంత కాలం హక్కుల ఉద్యమం సజీవంగా ఉంటుంది.
ఆధిపత్య అగ్ర రాజ్యాలు తమ దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ మానవ హక్కులను హరించడం పట్ల ఐక్యరాజ్యసమితి కఠిన వైఖరి అవలంబించాలి. దాదాపు అన్ని దేశా ల్లోనూ అణచివేతకు గురవుతున్న మహిళల, మైనారిటీల, దళితుల, ఆది వాసీల, థర్డ్ జెండర్స్ హక్కులకు ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు తగు ప్రాధాన్యమిచ్చి, ఆ వర్గాల ఆత్మగౌరవాన్నీ, హక్కులనూ పరిరక్షించడానికి ఐక్యరాజ్య సమితి మరింత నిర్దిష్టమైన కార్యక్రమాన్ని రూపొందిస్తే తప్ప మానవ హక్కుల ప్రకటనకు సార్థకత ఉండదు.
- మల్లెపల్లి లక్ష్మయ్య
(వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213