ప్రభుత్వ బడి.. ఫలితాల జడి!
- పదిలో ప్రతిభ చూపిన ప్రభుత్వ పాఠశాలలు
– 149 ప్రభుత్వ స్కూళ్ళలో 100 శాతం ఫలితాలు
– సీసీఈ విధానం వల్లే ఉత్తమ ఫలితాలు
కర్నూలు సిటీ: సాధారణంగా ప్రభుత్వ స్కూళ్లు అంటే అందరికీ చిన్నచూపు ఉంటుంది. అక్కడ సరైన వసతులు ఉండవు, టీచర్లు సక్రమంగా చదువు చెప్పరని చాలా మంది విద్యార్థులు తల్లిదండ్రుల భావన. ఈ కారణంతోనే గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్య ఏడాకేడాది తగ్గుతూ వస్తుంది. అయితే పరీక్షల ఫలితాల్లో కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రాణిస్తున్నాయి. ప్రభుత్వ స్కూళ్లకు చెందిన విద్యార్థులకు సైతం మంచి గ్రేడ్లు వస్తున్నాయి. నిరంతర సమగ్ర ముల్యాంకనం (సీసీఈ) విధానంతో ఈ ఏడాది మంచి ఫలితాలు వచ్చాయి.
కలిసొచ్చిన సీసీఈ విధానం!
జిల్లాలో మొత్తం 898 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 2016–17 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పరీక్షలు సీసీఈ విధానంలో నిర్వహించారు. ఈ విధానంలో మొదటిసారి పరీక్షలు రాస్తుండడంతో ఫలితాలపై ప్రభావం పడుతుందనే ఆందోళన నెలకొంది. ఈ ఆందోళనకు కారణం ప్రభుత్వ స్కూళ్లలో ప్రయోగాత్మకమైన భోధనకు అవసరమయిన సదుపాయలు లేకపోవడమే. అయితే ఎస్సీఈఆర్టీ సూచనలు, సలహాలతో సీసీఈ విధానంపై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, డీసీఈబీలు ముందస్తుగా నమూనా ప్రశ్న పత్రాలను తయారు చేసి అన్ని ఉన్నత పాఠశాలలకు ఇవ్వడంతో మెరుగైన ఫలితాలు సాధించారు. జిల్లాలో 149 వివిధ ప్రభుత్వ యాజమాన్యా స్కూళ్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి.
జెడ్పీ పాఠశాల్లో 91.20 శాతం ఉత్తీర్ణత...!
జిల్లా పరిషత్ యాజమన్యా పరిధిలోని స్కూళ్లకు చెందిన విద్యార్థులు 20,763 మంది విద్యార్థులు పరీక్షలు హాజరుకాగా, 18,936 మంది ఉత్తీర్ణలు అయ్యారు. మొత్తంగా 91.20 ఉతీతర్ణ శాతం నమోదైంది. అలాగే 94 సూళ్లు 100 శాతం సాధించాయి. 8.5 నుంచి 9.5 పాయింట్ల మధ్య అత్యధిక మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. జిల్లాలో మొత్తం 80 ప్రభుత్వ యజమాన్య స్కూల్స్ ఉన్నాయి. వీటిలో 2,865 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవ్వగా, 2381 మంది ఉత్తీర్ణత సాధించారు. వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన 1470 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 1403 మంది ఉత్తీర్ణులై..95.44 శాతం ఉత్తీర్ణత శాతం నమోదు చేశారు.
సీసీఈ విధానం వల్లే ఉత్తమ ఫలితాలు – ఎస్.తాహెరా సుల్తానా, డీఈఓ
పదో తరగతి పరీక్షలు ఈ ఏడాది నిరంతర సమగ్ర ముల్యాంకనం(సీసీఈ)లో జరిగాయి. ఈ విధానం వల్లే ప్రభుత్వ యాజమన్యాల కింద ఉన్న పాఠశాలకు చెందిన విద్యార్థులు అత్యధిక మంది ఉత్తీర్ణులు అయ్యారు. టీచర్లు సైతం మెరుగైన ఫలితాల కోసం కష్టపడ్డారు. వచ్చే ఏడాది ఇంకా మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేస్తాం.