లెక్క తేలేనా..?
ఖమ్మం, న్యూస్‌లైన్: ప్రతి ఏడాది వందల కోట్ల రూపాయలు విడుదలయ్యే రాజీవ్ విద్యామిషన్ నిధుల లెక్కలు తేలడం లేదు. రాజుల సొమ్ము రాళ్లపాలు అన్న చందంగా నిధులు మంజూరు చేయడమే తప్ప వాటి ఖర్చు వివరాలు తెలుసుకోవడంపై ఆ శాఖ అధికారులు ఏనాడూ దృష్టి సారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే తీసుకున్న డబ్బుల వివరాలు చెప్పేందుకు పలువురు ఎంఈవోలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ముందుకు రావడం లేదు. దీంతో ఇప్పటి వరకు ఎన్ని డబ్బులు విడుదలయ్యాయనే విషయంపై జిల్లా అధికారులు ఏళ్ల తరబడి కుస్తీపట్టినా సరైన వివరాలు తెలియడం లేదు. ఆర్వీఎం ద్వారా విడుదలైన సుమారు రూ. 1.70 కోట్లకు లెక్కలు తేలాల్సి ఉండగా వీటికి ఖర్చుల వివరాలు చెప్పేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. దీనిపై రాష్ట్ర అధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏ శాఖలో ఎంత ఖర్చు చేశారు.. నిల్వ ఎంత ఉంది..అనే లెక్కలు తేల్చేందుకు రాష్ట్ర ఆడిట్ బృందాన్ని జిల్లాకు పంపించారు.
ఎంఈవోల ఖాతాల్లో రూ. 31.44 లక్షలు...
ఆర్వీఎం ప్రారంభం నుంచి ఖర్చు చేయగా మిగిలిన డబ్బుతోపాటు 2013-14 ఆర్థిక సంవత్సరంలో విడుదల చేసిన గ్రాంట్స్ మొత్తం కలిసి జిల్లాలోని 46 మండలాల విద్యాశాఖాధికారుల ఖాతాల్లో ఉన్న రూ. 31,44, 640లకు అక్విటెన్సీలు సమర్పించాల్సి ఉంది. విడుదల చేసిన గ్రాంట్ల ఖర్చులు, మిగులు వివరాలు ఆయా ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఉన్నతాధికారులకు సమర్పించాలి. కానీ ఆర్వీఎం ద్వారా విడుదల చేసిన నిధుల వివరాలు సంవత్సరాలు గడిచినా చెప్పకపోవడంతో జాతీయ మానవ వనరుల శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి స్థాయిలో వివరాలు తెలిపితే తప్ప కొత్త గ్రాంట్స్ విడుదల చేయమని అధికారులు తేల్చి చెప్పారు. దీనికి తోడు రాష్ట్ర విభజన నేపథ్యంలో అన్ని శాఖల నిల్వ బడ్జెట్ వివరాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో గత వారం రోజులుగా జిల్లాలోని పలు మండల కేంద్రాలు, డివిజన్ సెంటర్లలో ఆడిట్ బృందాలు దిగి పాఠశాలల్లో లెక్కలు పరిశీలిస్తున్నాయి. ఇది ముగిస్తేనే ఎంఈవోల ఖాతాల నుంచి పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విడుదల చేసిన గ్రాంట్స్, ఖర్చులు, నిల్వ వివరాలు తేలే అవకాశం ఉంది.
ఇతర శాఖల పరిధిలో రూ.1.14 కోట్లు...
విద్యాశాఖతోపాటు, అనుబంధ శాఖలు, సంక్షేమ శాఖల పరిధిలో రాజీవ్ విద్యామిషన్ ద్వారా విడుదల చేసిన రూ. 1,14,92,116 లకు సంబంధించిన అక్విటెన్సీలు సమర్పించాల్సి ఉంది. ఇందులో బీసీ వెల్ఫేర్ పరిధిలో రూ. 3.4 లక్షలు, డీఈవో పరిధిలో రూ. 3,90,758, ఖమ్మం డిప్యూటీ ఈవో పరిధిలో రూ. 24,65,380, కొత్తగూడెం డిప్యూటీ ఈవో పరిధిలో రూ.18,00,589, బోనకల్ ఎంపీడీవో పరిధిలో రూ. 7,301, చింతకాని ఎంపీడీవో పరిధిలో రూ. 13,093, ఖమ్మం రూరల్ ఎంపీడీవో పరిధిలో రూ. 49,151, కూసుమంచి ఎంపీడీవో పరిధిలో 1,14,635, ఎర్రుపాలెం ఎంపీడీవో పరిధిలో రూ. 7,424, పీడీ డీడబ్ల్యూ అండ్ సీడీఏ రూ. 20 వేలు, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రోగ్రాం ద్వారా రూ.1,05,970, బాలవెలుగు ప్రాజెక్టు ద్వారా రూ. 16 వేలు, ఐటీడీఏ భద్రాచలం నుంచి రూ. 15,19,489 కు సంబంధించిన ఖర్చుల వివరాలు తెలియడం లేదు. వీటితోపాటు రెండవ ఫేస్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ లిమిటెడ్ పేరుతో రూ. 1.5 లక్షలు విడుదల చేసినట్లు అధికారుల లెక్కల్లో ఉన్నాయి. అయితే ఈ కార్యాలయం ఎక్కడ ఉందో.. ఆ డబ్బులు ఎందుకు ఖర్చు చేశారో అనేది అధికారులకే అంతుపట్టడం లేదు.
అందరికి నోటీసులు పంపించాము: ఆర్వీఎం పీవో
రాజీవ్ విద్యామిషన్ ద్వారా విడుదల చేసిన నిధులకు సంబంధించి అక్విటెన్సీలు ఇవ్వని అన్ని శాఖల అధికారులకు నోటీసులు పంపించామని ఆర్వీఎం పీవో బాలె శ్రీనివాస్ తెలిపారు. ఎంఈవోల పరిధిలో ఉన్న డబ్బుల వివరాలు అడిట్ తర్వాత వస్తాయని, మిగిలిన ఇతర శాఖల అధికారులకు నోటీలు పంపించామని, అప్పటికీ స్పందించకపోతే ఉన్నతాధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.