చేపల వేటకు వెళ్లి విగతజీవిగా..
..కనిపించిన మత్స్యకారుడు
* ఏరు కాలువలో పడి మృతి
రేపల్లె : వేటకు వెళ్ళి మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన మండలంలోని మోళ్ళగుంట గ్రామంలో చోటు చేసుకుంది. బంధువుల కథనం ప్రకారం మోళ్ళగుంట గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ శ్రీరాములు(60) ఎప్పటి మాదిరిగానే ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో సముద్రంకు వెళ్లే దారిలోని పెద ఏరు కాలువకు వేటకు వెళ్లాడని, రాత్రి ఈదురుగాలులు వీస్తున్న సమయంలో శ్రీరాములు ప్రమాదవశాత్తు కాల్వలో పడి మృతి చెందాడు. సోమవారం ఉదయం 9 గంటలకు మృతదేహం పెద ఏరు కాల్వలో తేలుతూ కనిపించినట్టు గమనించి స్థానికులు సమాచారం అందించారని, దీంతో మృత దేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్టు చోడాయిపాలెం ఏఎస్ఐ ఇస్మాయిల్ చెప్పారు. మృతుడికి ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్ఐ తెలిపారు.