చీర విషయంలో ఘర్షణ, భార్య హత్య
మంథని (కరీంనగర్): కలకాలం కలిసి ఉంటామని బాస చేసిన భర్త పెళ్లి జరిగి ఏడాది పూర్తి కాకముందే భార్యను హత్యచేసిన ఘటన మంథనిలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..కమాన్‌పూర్ మండలం రొంపికుంట గ్రామానికి చెందిన కొండి పద్మ-రాజయ్య పెద్ద కూతరు శిరీష(22)ను మంథనికి చెందిన మేర్గు రాజమల్లు కుమారుడు చంద్రమోహన్‌కు ఇచ్చి గత ఏడాది జూన్ 20న వివాహం జరిపించారు. వివాహం సమయంలో రూ.3.70 లక్షల కట్నంతో పాటు ఇతర కానుకలు ముట్టజెప్పారు. దంపతులులు కొంతకాలంగా అన్యోన్యంగానే ఉన్నారు. వారం రోజుల్లో పెళ్లి రోజు ఉండటంతో చీర విషయంలో సోమవారం రాత్రి భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగి హత్యకు దారితీసినట్లు తెలిసింది.
తాగిన మైకంలో మాటామాట పెరిగి ఓ చేత్తో ముక్కు నోరు మూసి మరో చేత్తో గొంతు నులిమి శిరీషను భర్త చంద్రమోహన్ హత్యచేసినట్లు సీఐ తెలిపారు. కొద్ది రోజులుగా తన కుమార్తెను ఆమె భర్త, తల్లిదండ్రులు, మేన త్త రూ. 3 లక్షల అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, ఈ విషయంపై మూడు నెలల క్రితం పంచాయితీ కూడా జరిగిందని మృతురాలి తల్లిదండ్రులు పద్మ-రాజయ్యలు తెలిపారు. కూలినాలి చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న తాము ఉన్న ఇరువై గుంటల పొలం అమ్మి కట్నం డబ్బులు ఇచ్చామని మరింత సొమ్ము ఇచ్చే స్థోమత లేదని కాళ్లావేళ్లపడి బతిమిలాడామని వారు తెలిపారు. తమ ఆర్థిక స్థోమతను పసిగట్టిన వీరు కావాలనే పథకం ప్రకారం తన కూతరుని హత్యచేశారని వారు కన్నీరుమున్నీరయ్యారు. కూతురు చనిపోయిన సమాచారం చుట్టుపక్కల వారి ద్వారా తెలిసిందని రోదించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ ప్రభాకర్, ఎస్సై షేక్ మస్తాన్అలీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.