Neeta: కష్టాలే ఇంధనంగా..
నీతా గత జీవితంలోకి తొంగిచూస్తే ‘బాధలు’ ‘కష్టాలు’ తప్ప ఏమీ కనిపించనంత చీకటి. నీతా చిన్న వయసులో ఉన్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రి తాగుబోతు. ఆయన పెట్టే హింస భరించలేక అమ్మమ్మ వాళ్ల ఇంటికి పారిపోయి అక్కడే ఉంది.
14 సంవత్సరాల వయసులో 22 ఏళ్ల వ్యక్తితో నీతాకు పెళ్లి జరిగింది. పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. భర్త తాగుబోతు. రకరకాలుగా హింస పెట్టేవాడు.
భర్త పెట్టే బాధలు భరించలేక అతడి నుంచి వేరుపడింది. ముగ్గురు పిల్లలు తనతో పాటే ఉన్నారు. చిన్నాచితకా పనులు చేస్తూనే ఆగిపోయిన చదువును కొనసాగించింది. పిల్లలతో పాటు చదువుకుంది. ‘నీకు ఏ పనీ చేతకాదు’ అని భర్త ఎప్పుడూ తిట్టేవాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్కూటర్ నడపడం నేర్చుకుంది. ఆ తరువాత వ్యాన్, బస్ డ్రైవింగ్లను నేర్చుకుంది.
ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ముంబయిలో 13 బస్సులకు యజమాని అయింది. ముగ్గురు పిల్లలు బాగా చదువుకుంటున్నారు. కుమారుడు కెనడాలో ఉంటున్నాడు.
స్టోరీ టెల్లింగ్ ప్లాట్ఫామ్ ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ నీతా స్టోరీని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఆన్లైన్లో ఈ ఇన్స్పైరింగ్ స్టోరీ వైరల్గా మారింది.
‘నేను ఎన్నోసార్లు నీతా ట్రావెల్ బస్సులలో ప్రయాణం చేశాను. ఆమె వెనుక ఇన్ని కష్టాలు ఉన్నాయని తెలియదు. ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిని ఇచ్చే స్టోరీ ఇది’ అని ఇన్స్టాగ్రామ్ యూజర్ ఒకరు స్పందించారు.