భార్య పీక కోసి.. బావిలోకి తోసేశాడు!
శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. నిండు నూరేళ్లు కష్టసుఖాల్లో చేయి వీడనంటూ అగ్నిసాక్షిగా బాసలు చేసి భర్తే.. పెళ్లయిన రెండు వారాలకే కట్టుకున్న భార్య పీక కోసేశాడు. అంతేకాదు, ఆమెను బావిలోకి తోసేసి.. బండరాళ్లు కూడా విసిరాడు.
సూర్యనారాయణ స్వామి కొలువై ఉన్న అరసవిల్లిలో ఈ ఘాతుకం జరిగింది. అదనపు కట్నం కోసమే అతగాడు ఈ దారుణానికి పాల్పడ్డాడని బాధితురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం బాధితురాలు తీవ్రంగా గాయపడి విశాఖపట్నంలోని ఎన్నారై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
''డిసెంబర్ 8న పెళ్లయింది. తన ఉద్యోగానికి తగిన కట్నం ఇవ్వలేదని వేధించారు. నిన్న రాత్రి శ్రీకాకుళంలో పాలు పొంగించాం. ఇరువైపులా బంధువులు అందరూ వచ్చారు. వచ్చాక, అందరూ భోజనం చేశారు. బంధువులంతా శ్రీకాకుళంలో వేరే బంధువుల ఇంటికి వెళ్లారు. మధ్యరాత్రి లేచి, బాత్రూంకి వెళ్లి, షేవింగ్ బ్లేడు పట్టుకుని మెడమీద పెట్టి కోసేశారు. నేను అరిచేసరికి అమ్మ, పిన్ని లేచారు. పిన్ని తలను గోడకేసి కొట్టారు. నేను పారిపోయాను. ఆ వీధిలో బావి ఉంది. అక్కడ కూర్చుని ఉంటే ఎత్తి బావిలో పారేసి, రెండుమూడు రాళ్లు విసిరేశారు. ఫైర్ స్టేషన్ నుంచి సిబ్బంది వచ్చి నన్ను బయటకు తీశారు. మా భర్త కూడా అగ్నిమాపకశాఖలోనే పనిచేస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. మరో అమ్మాయి ఎవరికీ ఇలా జరగకూడదన్నదే నా ఆరాటం'' అని దివ్యశ్రీ తెలిపింది.