hydrophonic
-
ఏం ఐడియారా సామీ.. పోలీసులకే దిమ్మ తిరిగిపోయింది
బెంగళూరు: ఎంబీఏ చదివాడు.. భక్తి పారవశ్యంలో మునిగిపోయాడు.. నెమ్మదిగా మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు. లాక్డౌన్ కాలంలో అవి సులువుగా లభించకపోవడంతో.. తనే వాటిని తయారు చేయాలనుకున్నాడు. ఇంటినే పెరడుగా మార్చి.. హైటెక్ పద్దతిలో ఇంట్లోనే గంజాయి పండించడం ప్రారంభించాడు. తనలానే ఇబ్బందిపడుతున్న మత్తుబాబులకు దాన్ని సరఫరా చేస్తూ.. భారీగా ఆర్జించాడు. ఏడాది కాలం నుంచి గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం కాస్త పోలీసులకు తెలిసిపోయింది. ప్రస్తుతం ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ హైటెక్ గంజాయి సాగు బెంగళూరులో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. కర్ణాటకకు చెందిన జావేద్ అనే వ్యక్తి బెంగళూరు కళ్యాణ్ నగర్లో ఎంబీఏ పూర్తి చేశాడు. కమ్మనహళ్లి ప్రాంతంలో నివసించేవాడు. ఈ క్రమంలో అతడు ఆధ్యాత్మికంవైపు మళ్లి.. గంజాయికి అలవాటు పడ్డాడు. గత మూడు సంవత్సరాల నుంచి మత్తు పదార్థాలకు బానిసగా మారాడు. తను తీసుకోవడమే కాక స్నేహితులను కూడా డ్రగ్స్‌కు అలవాటుపడేలా చేశాడు. (చదవండి: లోడ్ దించుతున్నారనుకున్నాం; దీని కింద ఇంత కథ ఉందా!) లాక్డౌన్ ఎఫెక్ట్.. ఇలా సాగిపోతున్న సమయంలో గతేడాది బెంగళూరులో భారీ ఎత్తున మత్తుపదార్థాలు వెలుగు చూడటంతో భయపడిన జావేద్.. కమ్మనహళ్లి ప్రాంతం నుంచి బిదాదికి మకాం మార్చాడు. ఆ ప్రాంతంలోని ఓ విల్లాలో మకాం పెట్టాడు. దాని రెంటే ఏకంగా 35 వేల రూపాయలు. ఇలా ఉండగా లాక్డౌన్ విధించడంతో డ్రగ్స్ లభించడం కష్టంగా మారింది. వాటికి బానిసైన జావేద్.. మత్తుపదార్థాలు లభించకపోవడంతో పిచ్చివాడిగా మారాడు. ఇంట్లోనే గంజాయి పెంపకం... ఆ పరిస్థితి నుంచి బయటపడటం కోసం తన ఇంట్లోనే గంజాయి పెంచాలని భావించాడు. ఇందుకు గాను ఎల్ఈడీ లైట్లను అమర్చి హైడ్రోఫోనిక్ మోడల్ని సెటప్ చేశాడు. అనంతరం డార్క్ వెబ్ నుంచి గింజలను ఆర్డర్ చేశాడు. యూరోప్ నుంచి వాటిని పొందాడు. ప్రారంభంలో తన ఇంట్లో ఉన్న ఫిష్ ట్యాంక్‌లో ఓ విత్తనాన్ని నాటాడు. అది విజయవంతంగా పెరగడంతో.. మరిన్ని గింజలను నాటాడు. (చదవండి: వెబ్ సిరీస్ స్ఫూర్తి.. ఈ జంటది మామూలు తెలివి కాదు!) గ్రాము ధర రూ.3-4 వేలు ఇలా ఇప్పటి వరకు 130 మొక్కలను పెంచాడు. వాటి పెంపకం కోసం చాలా అధునాతనమైన పద్దతిని సెట్ చేశాడు. వాటిని మత్తుపదార్థంగా ఉపయోగించేలా తయారు చేశాడు. తన స్నేహితుల ద్వారా ఈ హైడ్రో గంజాయిని వినియోగదారులకు సరఫరా చేయడం ప్రారంభించాడు. ఒక్క గ్రాము గంజాయిని 3-4 వేల రూపాయలకు విక్రయించడం ప్రారంభించాడు. ఎలా దొరికాడంటే.. రెండు రోజుల క్రితం క్రైం బ్రాంచ్ పోలీసులు డీజే హళ్లి ప్రాంతంలో మత్తుపదార్థాలను సరఫరా చేస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా జావేద్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితులు చెప్పిన అడ్రెస్ ప్రకారం పోలీసులు జావేద్ విల్లాలో సోదాలు నిర్వహించారు. అక్కడ ఉన్న హైటెక్ ఏర్పాట్లును చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు నలుగురు డ్రగ్ పెడ్లర్స్‌ని.. ఇద్దరు ఇరానియన్లను అరెస్ట్ చేశారు. చదవండి: 8వ తరగతి ప్రేమ.. బాలిక తిరస్కరించిందని ఆమె ఇంట్లోనే..? -
పది నెలలుగా ఇంటి కూరగాయలే
చుట్టూ పచ్చని వాతావరణం.. ఉదయం లేవగానే పలకరించే పూలు.. తాజా సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు... ఇవన్నీ పట్టణంలోనే మన ఇంటిపైనే అందుబాటులోకి తెచ్చుకుంటే అంతకన్నా ఆనందం ఏమి ఉంటుంది. డా. వేదప్రకాశ్, కిరణ్మయి దంపతులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి గాయత్రీ నగర్‌లోని తమ ఇంటిపై ఎంతో శ్రద్ధగా cను ఏర్పాటు చేసుకున్నారు. బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్‌గా డా. వేదప్రకాశ్ పనిచేస్తున్నారు. 280 చదరవు గజాల ఇంటి పైకప్పుపై ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలతో ఒక పచ్చని లోకాన్ని సృష్టించారు. ఇటు కుండీలు, గ్రోబాగ్స్‌లోను.. అటు హైడ్రోపోనిక్స్ పద్ధతిలోనూ ఇంటిపంటలు సాగు చేసుకొని పది నెలలుగా తింటున్నారు. లాక్డౌన్ సమయంలో పది నెలల క్రితం డా. వేదప్రకాశ్ ఈ మిద్దె తోటకు శ్రీకారం చుట్టారు. కోతుల నుంచి కాపాడుకునేందుకు ఇనుప జాలీని ఏర్పాటు చేస్తూ ఇంటికి కావలసిన కూరగాయలన్నీ పండిస్తున్నారు. రసాయనిక అవశేషాల్లేని కూరగాయలను బందువులు, స్నేహితులకూ రుచి చూపిస్తున్నారు. వేదప్రకాశ్‌తో పాటు కుటుంబ సభ్యులందరూ ఇంటి పంటల సాగు పనులు చూసుకుంటున్నారు. 32 రకాల కూరగాయల సాగు వేదప్రకాశ్ ఇంటి పైకప్పుపై 32 రకాల కూరగాయలు సాగవుతున్నాయి. బీర, కాకర, దోస, గుమ్మడి, చిక్కుడు, సోరకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యారెట్, వంకాయ, టమాట, చిక్కుడు, మిర్చి, క్యాప్సికం, అల్లం, వెల్లుల్లి, ఆలు, ఇలాయిచీ వంటివి పండిస్తున్నారు. అలాగే పాలకూర, తోటకూర, మెంతి, కొత్తిమీర, గోంగూర, బచ్చలి, బిర్యానీ ఆకును అక్కడ పండిస్తున్నరు. అలాగే మామిడి, అరటి, యాపిల్ చెర్రీ, వాటర్ యాపిల్, స్ట్రాబెర్రీ, గ్రేప్స్, సింగపూర్ చెర్రి, జామ, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్స్, నిమ్మ, ఆరెంజ్, బత్తాయి, బాదాం, పనస, మునగ వంటి పండ్లు, కాయల చెట్లు పెంచుతున్నారు. అప్పటి నుంచి మార్కెట్‌కు వెళ్ల లేదు వేదప్రకాశ్ తన ఇంటిపైకప్పుపై పండిస్తున్న కూరగాయలు వాళ్ల ఇంటి అవసరాలకే కాకుండా, ఇరుగు పొరుగు వారికి, బంధువులు, స్నేహితులకు ఇస్తున్నారు. గడచిన పది నెలలుగా మార్కెట్లో అడుగు పెట్టలేదని కిరణ్మయి తెలిపారు. ఇంటి అవసరాలకు కావలసిన అన్ని రకాల కూరగాయలు అక్కడే లభిస్తున్నాయి. మార్కెట్లో లభించనివి కూడా మిద్దెపై అందుబాటులో ఉన్నాయి. ఇంట్లో ఈ రోజు ఏ కర్రీ వండుకోవాలో మిద్దెపైకి వెళ్లి అక్కడ చూసి నిర్ణయం తీసుకుంటారు. క్షణాల్లో తమకు కావలసిన కూరగాయలను కోసుకుని వెళ్లి వండుకోవడం జరుగుతోంది. ఇంటిపంటల మధ్య వెదురు బొంగులతో వేసిన కుటీరం ఎంతో ఆహ్లాదాన్ని పంచుతోంది. పండుగల పూట, బంధువులు, స్నేహితులు వచ్చినపుడు అందరూ అక్కడే కూర్చుని భోజనాలు చేస్తున్నారు. రాత్రి పూట రంగురంగుల విద్యుద్దీపాల మద్యన విందులు చేసుకుంటున్నారు. ఇంటికి ఎవరు వెళ్లినా మిద్దెపైకి తీసుకువెళ్లి అంతా చూయిస్తారు. తిరిగి వెళ్లేటపుడు కూరగాయలు కత్తిరించి చేతిలో పెట్టి పంపించడం వాళ్లకు ఆనవాయితీగా మారింది. – ఎస్.వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి పంట చేలో ఉన్నంత ఆనందం మిద్దె మీద కూరగాయలు, ఆకుకూరలు పండించుకుంటున్నాం. పది నెలల కాలంగా మార్కెట్‌కు వెళ్లే అవసరం రాలేదు. ఇంట్లో అందరం పొద్దున లేస్తే చాలు మిద్దెపైకి రావడం, మొక్కలకు నీళ్లు పట్టడం, వాటì ని చూసుకోవడం అలవాటైంది. మనకు కావలసిన కూరగాయలు మనమే పండించుకుంటే ఎంత ఆనందాన్ని పొందవచ్చో మాకు అర్థమైంది. ఎలాంటి రసాయనాలు లేకుండా కూరగాయలు పండిస్తున్నాం. పండుగల సందర్భంగా అందరం కలిసి ఇక్కడే భోజనం చేస్తుంటే పంట చేను దగ్గర తిన్నంత తృప్తి కలుగుతోంది. – డాక్టర్ వేదప్రకాశ్ (95531 81399), కామారెడ్డి -
నిరంతరం పచ్చిగడ్డి
అనంతపురం అగ్రికల్చర్ : అజొల్లా, హైడ్రోఫోనిక్ పద్ధతుల ద్వారా ఏడాది పొడవునా పచ్చిగడ్డి తీసుకోవచ్చని పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వి.రవీంద్రనాథ్ ఠాగూర్ తెలిపారు. పశుశాఖ ద్వారా ఈ ఏడాది 90 శాతం రాయితీతో అజొల్లా, 75 శాతం రాయితీతో హైడ్రోఫోనిక్ యూనిట్లు మంజూరు చేస్తామన్నారు. అవసరమైన రైతులు పశుశాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. అజొల్లా రోజుకు నాలుగు కిలోల అజొల్లా ఉత్పత్తి చేయుటకు 2.50 ‘‘ 1.5 మీటర్ల సైజులో ఒక తొట్టి తయారు చేసుకుని ఒకటి నుంచి ఒకటిన్నర కిలోల తాజా మదర్ కల్చర్ అజొల్లా బెడ్‌పై సమానంగా పడేలా చల్లాలి. జాగ్రత్తలు పాటించి 8వ రోజు నుంచి ప్రతిరోజూ ఒక్కో తొట్టి నుంచి కిలో అజొల్లా గడ్డి తీసుకోవచ్చు. అజొల్లాను సూటిగా సూర్యకాంతి పడని, మరీ ఎక్కువ నీడ పడని ప్రదేశంలో పెంచాలి. ఎండబెట్టిన అజొల్లా పొదిలో 25–35 శాతం మాంసపు కృత్తులు, 10–15 శాతం ఖనిజ లవణాలు, 7–10 శాతం అమినో ఆమ్లాలు, కెరోటిన్, బీ–12 విటమిన్లు ఉంటాయి. ఇందులో లిగ్నైట్ తక్కువగా ఉండటంతో పశువులు తేలికగా జీర్ణం చేసుకుంటాయి. రోజూ 1.5 నుంచి 2 కిలోల అజొల్లాను పశువుకు తినిపించవచ్చు. ఫలితంగా పాల డిగుబడి 15 నుంచి 20 శాతం పెరుగుతుంది. దాణాలో వేరుశనగ పిండికి బదులుగా అదే పరిమాణంలో అజొల్లాను వాడవచ్చు. హైడ్రోఫోనిక్ గడ్డి బార్లీ, సజ్జ, మొక్కజొన్న, జొన్న వంటి విత్తనాలతో మొలకగడ్డి తయారు చేసుకోవచ్చు. మన ప్రాంతానికి మొక్కజొన్నతోనే లాభదాయకం. అధిక దిగుబడికి నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంతో అవసరం. ప్లాస్టిక్ ట్రేలలో కొన్ని పద్ధతులు పాటించి పెంచితే 8 రోజుల్లో కిలో విత్తనం నుంచి 12–15 కిలోల పచ్చి మేత పొందవచ్చు. ఈ గడ్డిలో 17.2 శాతం ప్రోటీన్లు, 25.4 శాతం పీచు పదార్థం, 84.8 శాతం నీరు ఉన్నట్లుగా ప్రయోగాల్లో రుజువైంది. అలాగే దాణాలో ఉన్న విధంగా విటమిన్లు ఏ, ఈ, లవణాలు, క్యాల్షియం, భాస్వరం ఇతరత్రా పోషక పదార్థాలు ఉన్నట్లుగా తేలింది. మొలకగడ్డిని 9వ రోజు వేర్లతో సహా పశువుకు పెట్టాలి. ఒక్క పశువుకు 15–20 కిలోల గడ్డి పెట్టవచ్చు. నీరు, భూమి, కరెంటు ఖర్చు తక్కువతోనే ఇంటి వద్ద పెంచవచ్చు. పైగా పాల ఉత్పత్తి 15–20 శాతం పెరుగుతుంది. పశువులు సకాలంలో ఎదకు వచ్చి చూలు కడతాయి. వ్యాధి నిరోధకశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటాయి.