విమానంలో యోగా.. గలాభా
హొనోలులు: విమానంలో భార్యపై దౌర్జన్యం చేయడమే కాకుండా, సిబ్బందితో గొడవ పడిన దక్షిణ కొరియా ప్రయాణికుడు అమెరికాలో జైలు పాలయ్యాడు. జపాన్ కు చెందిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానంలో మార్చి 26న ఈ ఘటన చోటుచేసుకుందని ఎఫ్ బీఐ తెలిపింది. హొనోలులు ఎయిర్ పోర్టు నుంచి నారిటా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా వెళుతున్న విమానంలో హయొంగటాయ్ పాయె అనే వ్యక్తి దౌర్జన్యానికి పాల్పడ్డాడని వెల్లడించింది.
భోజనం వడ్డించే సమయంలో సీటులో ఉండనని యోగా, మెడిటేషన్ చేసుకునేందుకు హయొంగటాయ్ పాయె విమానంలోని వెనక భాగానికి వెళ్లిపోయాడు. తిరిగి వచ్చిన అతడిని సీటులో కూర్చోమని పాయె భార్యతో, విమాన సిబ్బంది కోరడంతో ...పాయె కోపంతో ఊగిపోయాడు. భార్యను పక్కకు తోసేందుకు ప్రయత్నించి, అడ్డుకున్న సిబ్బందిపై దౌర్జన్యం చేశాడు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన తోటి ప్రయాణికులను చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో హయొంగటాయ్ భార్య కిమ్ ను అతడి వెనుక సీటులో కూర్చొబెట్టారు.
విమాన సిబ్బంది ఫిర్యాదు మేరకు అతడిని అరెస్ట్ చేసి, అమెరికా కోర్టులో ప్రవేశపెట్టారు. 25 వేల డాలర్ల పూచీకత్తుతో అతడికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయింది. అయితే పాయె మానసిక స్థితిగా సరిగా లేదన్న కారణంతో అతడిని విడుదల చేయలేదు.
తమ 40వ వివాహ వార్షికోత్సవాన్ని హవాయ్ లో జరుపుకునేందుకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుందని పాయె భార్య కిమ్ వాపోయింది. ఒత్తిడిని తట్టుకునేందుకు ఇటీవలే పాయె యోగా నేర్చుకున్నాడని, గత 11 రోజులుగా అతడు సరిగా నిద్ర పోలేదని వెల్లడించింది.