వేదాంత గ్రూప్ చైర్మన్‌పై సీబీఐ విచారణ
న్యూఢిల్లీ: హిందుస్థాన్ జింక్ లిమిటెడ్(హెచ్‌జడ్‌ఎల్)లో పెట్టుబడుల ఉపసంహరణలో అక్రమాలకు సంబంధించి వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్‌పై సీబీఐ ప్రాథమిక విచారణ చేపట్టనుంది. ఎన్డీఏ హయాంలో చోటుచేసుకున్న ఈ అక్రమాలతో ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని సీబీఐ భావిస్తోంది. అగర్వాల్‌తో పాటు హెచ్‌జడ్‌ఎల్ అధికారులు, డిజిన్వెస్ట్‌మెంట్, గనుల శాఖల ఆఫీసర్లపై విచారణ జరుగుతుందని సీబీఐ వర్గాలు సోమవారం వెల్లడించాయి. వేదాంత రిసోర్సెస్‌కు చెందిన స్టెరిలైట్ ఇండస్ట్రీస్... హెచ్‌జడ్‌ఎల్ వాటాలను తక్కువ ధరకు కొనుగోలు చేసిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. స్టెరిలైట్ ఇండస్ట్రీస్ గత ఆగస్టులో సెసా గోవాలో విలీనమైంది. తర్వాత కంపెనీ పేరు సెసా స్టెరిలైట్‌గా మారింది. 2002లో నాటి ఎన్డీఏ సర్కారు చేపట్టిన హిందుస్థాన్ జింక్ డిజిన్వెస్ట్మెంట్లో తీవ్రమైన అక్రమాలు జరిగాయని సీబీఐ వర్గాలు తెలిపాయి. అగర్వాల్‌తో పాటు పెట్టుబడుల ఉపసంహరణ, గనుల శాఖల అధికారులకు త్వరలో నోటీసులు జారీ అవుతాయని పేర్కొన్నాయి.
హెచ్‌జడ్‌ఎల్‌లో వాటాను స్టెరిలైట్‌కు విక్రయించడాన్ని నాటి డిజిన్వెస్ట్‌మెంట్ శాఖ సమర్థించుకుంది. హెచ్‌జడ్‌ఎల్‌లో 26 శాతం వాటా అమ్మకానికి ఒక్కో షేరు రిజర్వు ధర రూ.32.15 (మొత్తం రూ.353.17 కోట్లు) కాగా ఇండోగల్ఫ్ కార్పొరేషన్, స్టెరిలైట్ కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. ఇండోగల్ఫ్ కార్పొరేషన్ కంటే అధిక ధరను (ఒక్కో షేరుకు రూ.40.50 చొప్పున మొత్తం రూ.445 కోట్లు) ఆఫర్ చేసిన స్టెరిలైట్ బిడ్‌ను ఆమోదించినట్లు నాటి డిజిన్వెస్ట్‌మెంట్ శాఖ పేర్కొంది.