ఎస్బీఐ జనరల్‌లో 49 శాతానికి ఐఏజీ వాటా
న్యూఢిల్లీ: బీమా రంగ సంస్కరణల నేపథ్యంలో దేశీ ఇన్సూరెన్స్ కంపెనీల్లో వాటాలు పెంచుకునే విదేశీ సంస్థల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. తాజాగా దేశీ బీమా సంస్థ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ఇన్సూరెన్స్ ఆస్ట్రేలియా గ్రూప్ (ఐఏజీ) తన వాటాను 26 శాతం నుంచి 49 శాతానికి పెంచుకోనుంది. జేవీలో ఈ మేరకు తమ వాటాను ఐఏజీకి బదలాయించేందుకు ఈ నెల 25న జరిగిన సెంట్రల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీసీబీ) సమావేశంలో ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది.
ఇందుకోసం వాటా ధరను మదింపు చేసేందుకు వేల్యుయర్‌ను నియమించే ప్రతిపాదనకు కూడా ఆమోదముద్ర వేసినట్లు బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్బీఐ జనరల్‌లో ఎస్బీఐకి 74 శాతం, ఐఏజీకి 26 శాతం వాటాలు ఉన్నాయి. ఇది 2010లో కార్యకలాపాలు ప్రారంభించింది. ఇప్పటికే మ్యాక్స్ ఇండియాతో ఏర్పాటు చేసిన మాక్స్‌బూపా బీమా కంపెనీలో బ్రిటన్‌కి చెందిన బూపా ఇన్సూరెన్స్ తమ వాటాను 26 శాతం నుంచి 49 శాతానికి పెంచుకోబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.