ఐఏఎస్ అధికారిని ప్రశ్నిస్తున్న పోలీసులు
హైదరాబాద్ : యూసుఫ్‌గూడలో దారుణ హత్యకు గురైన కారు డ్రైవర్ హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు, ఐఏఎస్ అధికారి వెంకటేశ్వరరావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డ్రైవర్ నాగరాజు మృతదేహాన్ని తరలించేందుకు కుమారుడికి సహకరించారన్న అనుమానంపై ఆయనను విచారణ జరుపుతున్నారు. అయితే ఈ కేసులో ఐఏఎస్ ప్రమేయం కూడా ఉందా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.
ఈ కేసుపై వెస్ట్ జోన్ డీసీపీ మాట్లాడుతూ సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులు ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా ఈ కేసులో ఐఏఎస్ కుమారుడు వెంకటేష్ ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. మరోవైపు తన భర్త హత్యకు వెంకటేషే కారణమని మృతుడి భార్య జమున ఆరోపిస్తుంది.