టూకీగా ప్రపంచ చరిత్ర 79
ఏలుబడి కూకట్లు
మంచు కరిగేకొద్దీ ఉత్తరంగా జరుగుతూ, ఉత్తర ఆఫ్రికాతీరం నుండి ఆదిమకాలంలోనే యూరప్ ఖండాన్ని చేరుకున్న ‘ఐబేరియన్’ తెగలు కొన్ని అప్పటికే యూరప్‌లో ఉన్నాయి. యూరప్ ఉత్తరార్థంలో వాటి జనసంఖ్య పలుచన. దానికితోడు సామాజిక స్థాయిలో ఎదుగుదల కూడా అంతంత మాత్రమే. అందువల్ల, తారసపడిన తెగలను తమలో జీర్ణించుకుంటూ, పోలెండ్, ఆర్మీనియా, జర్మనీ, స్కాండినేవియా ప్రాంతాల్లో ఆర్యుల ఆక్రమణ నల్లేరు మీద బండి నడకలా సాగింది. నడిమి యూరప్‌లోని రుమేనియా, హంగెరీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ ప్రాంతాల్లో సవాళ్లు ఎదురైనా సత్తాతో జవాబిస్తూ, స్థానికులతో పలురకాల సంబంధాలు నెరుపుతూ, దొంతర్లు దొంతర్లుగా వాళ్లు ఇంగ్లండు చేరుకున్నారు. అప్పటికి కూడా ఆ స్థానికులూ వ్యవసాయదారులు కాదు, వచ్చినవాళ్లకూ వ్యవసాయం తెలీదు. మట్టిగోడలూ, పూరికప్పుతో తాత్కాలిక మజిలీగా పనికొచ్చే గుడిసెలే తప్ప, క్రీ.పూ. 3000 వరకు అక్కడ స్థిరనివాసానికి అనువైన కట్టడం దొరకదు. పగలంతా పశువులు మేపుకుంటూ ఆరుబయట గడపడం, చీకటిపడే ముందు మందలను మళ్లించుకుని, రాత్రి వేళ తలదాచుకునేందుకు పూరిపాకకు చేరడం వాళ్ల దినచర్య. వేదాలు విధించిన కర్మకాండ ఆ ఆర్యులకు తెలిసినట్టు లేదు. అక్కడ దొరికే పొట్టిజాతి గుర్రాలు ఆహారానికేగానీ వాహనంగా పనికొచ్చేవిగావు.
కాస్పియన్ సముద్రం వెనక్కు తీసిన అంచుల్లో పచ్చదనం ఏర్పడినప్పుడు ఆర్యుల దృష్టి తూర్పు దిశకు మళ్లింది. ఆ సందుగుండా వాళ్లకు ‘బొటాయ్’ నివాసులతో సంబంధాలు ఏర్పడ్డాయి. బొటాయ్ ప్రాంతం ఇప్పటి కజికిస్థాన్లోని పడమటి రాష్ట్రం. అక్కడి నివాసులు మంగోలియన్ తెగలనుండి ఎదిగినవాళ్ళు; వ్యవసాయం, లోహం తెలిసినవాళ్లు; క్రీ.పూ. 4000 సంవత్సరాల నాడే వాళ్లు గుర్రాలను మచ్చిక చేసుకున్నవాళ్లు. అక్కడ దొరికేది భారీ శరీరం, అమితమైన వేగంగల గుర్రాలజాతి. వ్యవసాయానికీ, చక్రాలుండే బండ్లును లాగటానికీ వాళ్లు అప్పటికే గుర్రాలను ఉపయోగిస్తున్నారు. వాళ్లతో పరిచయం ఏర్పడిన తరువాతే ఆర్యులకు గుర్రమూ, దానివల్ల ప్రయోజనమూ తెలిసొచ్చింది. వాళ్ల స్నేహంవల్ల గుర్రాలూ, వాటి తర్ఫీదు, రథాలు ఆర్యులకు అందుబాటయ్యాయి. వాళ్ల సంపర్కం వల్ల ఆర్యులకు ఉరల్ పర్వతాల తూర్పు పాదం వెంట ఉత్తరంగా ఉన్న రష్యాలోకీ, కాస్పియన్ సముద్రం తూర్పు తీరం వెంట దక్షిణ దిశగా పర్షియా (ఇప్పటి ఇరాన్)లోకి మార్గం దొరికింది.
కాస్పియన్ తూర్పుతీరం వెంట దక్షిణంగా దిగివస్తున్న ఆర్యుల్లో యజ్ఞ యాగాదుల ఆచూకీ కనిపిస్తుంది. అక్కడి మొదలు ఆఫ్గనిస్తాన్ వరకు ‘సోమలత’ సమృద్ధిగా దొరుకుతుంది. సోమరసం లేకుండా యజ్ఞం లేదు. బహుశా కాస్పియన్ దక్షిణానికి చేరుకున్న దశలో ఒకే మూసగా ఉన్న ఆర్యులమధ్య విభేదాలు ఏర్పడినట్టు కనిపిస్తుంది. అవి కేవలం తాత్విక వైరుధ్యాలు. యజ్ఞయాగాదులనూ, సురాపానాన్నీ విసర్జించినవాళ్లు ‘అసురులు’. వాళ్లే తరువాతి జొరాస్ట్రియన్లు. వైదికకర్మలను ఆచరించేవాళ్లు ‘ఆర్యులు’. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే - సుర, సోమరసాలు వేరువేరు పానీయాలని! సోమలతను నలగదంచి పిండగా వచ్చేది సోమరసం. తృణధాన్యాన్ని పులియబెట్టి, కాచినప్పుడు వచ్చే ఆవిరిని చల్లబరిస్తే తయారయ్యేది సుర. అసురులు విసర్జించింది సురాపానమేగాని, సోమపానం గాదు. కొన్ని పండుగ సందర్భాలకు ఎండినదైనా సరే, ఎన్ని తంటాలైనా పడి, ఇప్పటికీ సోమలతను సంపాదించుకుంటున్నవాళ్లు జొరాస్ట్రియన్ తత్వాన్ని అనుసరించే పారసీలు మాత్రమే.
రుగ్వేదం పుట్టిన తొలినాటి ఆర్యుల్లో వర్ణభేదం కనిపించదు. పశుపోషణ మినహా ఇతర వ్యాపకం లేని రోజుల్లో సామాజిక అంతస్తులు ఏర్పడే అవకాశం ఉండదుకూడా. తాత్కాలిక మజిలీలకు పరిమితమైన తావులు మారే సంచారజాతికి సంతలూ వ్యాపారాలూ ఊహకందని విషయాలు. కాకపోతే ఇప్పుడు చక్రాలమీదే దొర్లే రథాలూ, వాటిని పరిగెత్తించే గుర్రాలూ చేతికి చిక్కడంతో పశువులు మేపుకురావడం సులభతరమయింది; వలసల్లో వేగం పుంజుకుంది. రుగ్వేదం నడిమి దశలో ‘రాజు’ అనే పదం అరుదుగా కనిపిస్తుంది. యజ్ఞాలు నిర్వహించేవాళ్లల్లో ఎక్కువభాగం యజమానులే. రుక్కులు నిర్మించిన రుషివర్గ మొక్కటీ ప్రత్యేక హోదాకు ఎదిగింది.
సోమలతను నలగదంచి పిండగా వచ్చేది
సోమరసం. తృణధాన్యాన్ని పులియబెట్టి, కాచినప్పుడు వచ్చే ఆవిరిని చల్లబరిస్తే తయారయ్యేది సుర. అసురులు విసర్జించింది సురాపానమేగాని, సోమపానం గాదు. కొన్ని పండుగ సందర్భాలకు ఎండినదైనా సరే,
ఎన్ని తంటాలైనా పడి, ఇప్పటికీ సోమలతను
సంపాదించుకుంటున్నవాళ్లు జొరాస్ట్రియన్ తత్వాన్ని అనుసరించే పారసీలు మాత్రమే.
రచన: ఎం.వి.రమణారెడ్డి