స్పెషలిస్ట్ ఆఫీసర్ల ప్రిపరేషన్ ఇలా
కిరణ్ కుమార్ అడుసుమిల్లి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్
బ్యాంక్ కార్యకలాపాలు ఒకప్పటి మాదిరిగా కేవలం బ్యాంకింగ్ సేవలకే పరిమితం కావడం లేదు.. బ్యాంకులు మారుతున్న అవసరాలకనుగుణంగా సేవలను విస్తృతం చేస్తున్నాయి..
ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి సేవలను అందుబాటులోకి
తెస్తున్నాయి.. దీంతో సంబంధిత వ్యవహారాలను నిర్వహించడానికి ప్రత్యేక నిపుణుల అవసరం ఏర్పడుతోంది.. ఈ నేపథ్యంలోనే ఐబీపీఎస్.. స్పెషలిస్ట్ ఆఫీసర్ల నియామకం కోసం క్రమం
తప్పకుండా నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.. ఇదే కోవలో తాజాగా ఐబీపీఎస్-స్పెషలిస్ట్ ఆఫీసర్ల నియామకం కోసం నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో సంబంధిత వివరాలపై ఫోకస్..
బ్యాంకుల్లో క్లరికల్, ఆఫీసర్ స్థాయి ఉద్యోగులు ఫ్రంట్ లైన్ సేవలను అందిస్తుంటారు. కొన్ని ప్రత్యేక సేవలను అందించడానికి నైపుణ్యం ఉన్న అభ్యర్థులు కావాలి.
తాజా నోటిఫికేషన్ ద్వారా 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర బ్యాంకింగ్/ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లలో.. 10 రకాల స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వాటి వివరాలు..
ఐటీ ఆఫీసర్(స్కేల్-1); అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్-1); రాజభాష అధికారి (స్కేల్-1); లా ఆఫీసర్ (స్కేల్-1); హెచ్ఆర్/పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-1); మార్కెటింగ్ ఆఫీసర్ (స్కేల్-1); ఐటీ ఆఫీసర్ (స్కేల్-2); లా ఆఫీసర్ (స్కేల్-2); చార్టెడ్ అకౌంటెంట్ (స్కేల్-2); మేనేజర్ క్రెడిట్ /ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ (స్కేల్-2)
ఎంపిక విధానం:
రాత పరీక్ష, ఇంటర్వ్యూ దశల ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తర్వాతి దశ ఇంటర్వ్యూకు హాజరుకావాలి. ఇందులో రాత పరీక్షకు 80 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇంటర్వ్యూకు 100 మార్కులు కేటాయించారు (20 శాతం వెయిటేజీ). ఇందులో కనీసం 40 శాతం అర్హత మార్కులను (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఓబీసీ అభ్యర్థులకు 35 శాతం) సాధించాలి.
రాత పరీక్ష ఇలా:
రాత పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో ప్రశ్నలు ఇంగ్లిష్/హిందీ భాషల్లో ఉంటాయి. వివరాలు..
లా ఆఫీసర్ (స్కేల్-1,2), రాజభాష అధికారి (స్కేల్-1)
విభాగం {పశ్నలు మార్కులు
రీజనింగ్ 50 50
ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 25
జనరల్ అవేర్నెస్
(రిఫరెన్స్ టు బ్యాంకింగ్) 50 50
ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50 75
మొత్తం 200 200
సమయం 120 నిమిషాలు (రెండు గంటలు)
మిగతా పోస్టులకు:
రీజనింగ్ 50 50
ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 25
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 50
ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50 75
మొత్తం 200 200
సమయం 120 నిమిషాలు (రెండు గంటలు)
నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు (0.25) కోత విధిస్తారు.
నోటిఫికేషన్ సమాచారం:
అర్హత: సంబంధిత/అనుబంధ విభాగంలో డిగ్రీ/పీజీ. నిర్దేశించిన పోస్టులకు అనుభవం తప్పనిసరి.
వయసు: 20-30 ఏళ్లు
(స్కేల్-2 కేటగిరీకి మాత్రం 20-35 ఏళ్లు).
దరఖాస్తు: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 14, 2013.
దరఖాస్తు ఫీజు: రూ. 600
(ఎస్సీ/ఎస్టీ/పీడ బ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100)
దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ:
డిసెంబర్ 16, 2013 (ఆన్లైన్లో మాత్రమే)
రాత పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 8-9, 2014.
వివరాలకు: www.ibps.in
వివిధ పన్నులకు సంబంధించిన వ్యవహారాలను సక్రమంగా నిర్వహించడానికి చార్టెడ్ అకౌంటెంట్ సేవలు అవసరం.
పలు వ్యవసాయ పనులకు సంబంధించిన సలహాలు ఇవ్వడానికి అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారు.
న్యాయ సంబంధ విషయాల్లో, రుణాలకు సంబంధించి డాక్యుమెంట్స్‌ను నిర్ధారించడానికి లా ఆఫీసర్లు ఉపయోగపడతారు.
నిర్వహణలో ఐటీ/సాఫ్ట్వేర్ వినియోగం కోసం ఐటీ ఆఫీసర్ల సేవలను వినియోగించుకుంటారు.
హిందీ భాష అభివృద్ధి-వినియోగంతోపాటు సిబ్బందిని ఆ దిశగా ప్రేరేపించడా నికి రాజభాష అధికారిని నియమిస్తారు.
కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి మార్కెటింగ్ ఆఫీసర్ల సేవలు అవసరం.
కెరీర్-వేతనాలు:
స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీలు సాధారణంగా జూనియర్, మిడిల్, సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో ఉంటాయి. తాజా నోటిఫికేషన్ ద్వారా జూనియర్, మిడిల్ మేనేజ్మెంట్ కేడర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. సాధారణ బ్యాంక్ శాఖలలో స్పెషలిస్ట్ ఆఫీసర్లు ఉండరు. వ్యవసాయ సంబంధ ప్రత్యేక శాఖలలో అగ్రికల్చర్ ఆఫీసర్లు, పెద్ద బ్రాంచ్‌లలో మార్కెటింగ్ ఆఫీసర్లు ఉంటారు. మిగిలిన పోస్టులు సాధారణంగా రీజనల్, జోనల్ ఆఫీస్, హెడ్ ఆఫీస్‌లకు మాత్రమే పరిమితం.
స్పెషలిస్ట్ ఆఫీసర్ల పదోన్నతులు కూడా ఆ కేడర్ ఆఫీసర్ల మధ్యనే ఉంటాయి. పోటీ తక్కువగా ఉన్న కారణంగా టైమ్ బౌండ్ ప్రమోషన్లు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ ప్రమోషన్లు స్పెషలిస్ట్ కేడర్‌కు మాత్రమే పరిమితం. కొన్ని బ్యాంకులు స్పెషలిస్ట్ ఆఫీసర్లను జనరల్ కేడర్‌కు మారే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇలా కేటగిరీ మారిన వారు అత్యున్నత స్థాయి హోదాకు కూడా చేరుకోవచ్చు.
స్పెషలిస్ట్ ఆఫీసర్ల జీతాభత్యాలు ఇతర ఆఫీసర్లతో సమానంగా ఉంటాయి. స్కేల్-1 ఆఫీసర్లకు రూ. 25 వేల వరకు, స్కేల్-2 ఆఫీసర్లకు రూ. 30 వేల వరకు వేత నం అందుతుంది. నవంబర్, 2012 నుంచి వేతన ఒప్పందం సవరణ జరగాల్సి ఉంది. ఇప్పుడే చేరే అభ్యర్థులకు ఇది వర్తిస్తుంది. కాబట్టి భవిష్యత్‌లో ఎరియర్స్‌తో సహా పెరిగిన వేతనాలను అందుకుంటారు.
సన్నద్ధం ఇలా...
రీజనింగ్:బ్యాంకుల్లో నియామకం కోసం నిర్వహించే పరీక్షల్లో అత్యంత క్లిష్టమైన విభాగం రీజనింగ్. అభ్యర్థి నిర్ణయాత్మక శక్తిని అంచనా వేసేందుకు ఉద్దేశించిన విభాగమిది. ఇందులో ప్రశ్నలను సాధించాలంటే విశ్లేషణ సామర్థ్యంతోపాటు తార్కికత (లాజిక్) కూడా అవసరం. అంతేకాకుండా స్వల్ప సమయంలోనే సమాధానాన్ని గుర్తించాలి. ఇందులో సిరీస్; అనాలజీ; క్లాసిఫికేషన్; కోడింగ్ అండ్ డీకోడింగ్; డెరైక్షన్స్; రక్త సంబంధాలు; సీటింగ్ అరేంజ్మెంట్స్; ఆల్ఫాబెట్ టెస్ట్, ర్యాంకింగ్, పజిల్స్ తదితర అంశాలుంటాయి. ఇందులో మెరుగైన స్కోర్ సాధించాలంటే షార్ట్‌కట్ మెథడ్స్, కొండ గుర్తులను సాధన చేయాలి. ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యతనివ్వాలి. చిత్రాలు, మిర్రర్ ఇమేజ్‌లతో కూడిన ప్రశ్నలను అధికంగా ప్రాక్టీస్ చేయాలి.
ఇంగ్లిష్ లాంగ్వేజ్:
ఇంగ్లిష్‌లో గ్రామర్, రీడింగ్ కాంప్రెహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, రూట్‌వర్డ్స్‌ను బాగా సాధన చేయాలి. జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వంటివాటిల్లో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. అందువల్ల అభ్యర్థులు వీటిపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. దినపత్రికలు, ప్రామాణిక పుస్తకాల సహాయంతో వొకాబ్యులరీని డెవలప్ చేసుకోవాలి. రోజుకు 10-15 వరకు యాంటోనిమ్స్, సినానిమ్స్ నేర్చుకోవాలి. ప్రాథమిక గ్రామర్ అంశాలైన పార్ట్స్ ఆఫ్ స్పీచ్; యాక్టివ్, పాసివ్ వాయిస్; డెరైక్ట్-ఇన్‌డెరైక్ట్ స్పీచ్ తదితర అంశాలను సాధన చేయాలి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్:
అభ్యర్థుల్లోని గణిత సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగమిది. ఇందులో చాలా వరకు ప్రశ్నలు నేరుగా లేదా సూత్రాల ఆధారితంగా ఉంటాయి. కాబట్టి గణిత నేపథ్యం లేని విద్యార్థులు కూడా ప్రాథమిక భావనలపై పట్టు సాధిస్తే ఈ విభాగంలో మెరుగైన స్కోర్ సాధించవచ్చు. వర్గమూలాలు, ఘన మూలాలు, శాతాలు, కాలం-పని; కాలం-దూరం, లాభం-నష్టం, నిష్పత్తులకు సంబంధించిన సమస్యల్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. వీటికి తేలిగ్గా సమాధానాలు గుర్తించాలంటే గణిత మూలస్తంభాలైన కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలపై పట్టు సాధించాలి. దాంతోపాటు 20 వరకు టేబుల్స్, 25 వరకు స్క్వేర్స్, 15 వరకు క్యూబ్స్‌ను నేర్చుకోవాలి.
జనరల్ అవేర్నెస్ (రిఫరెన్స్ టు బ్యాంకింగ్):
ఈ విభాగానికి సంబంధించి బ్యాంకింగ్ రంగంలో తాజాగా చోటు చేసుకుంటున్న మార్పులు, చేర్పులపై ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. ఈ క్రమంలో ఆర్బీఐ-విధాన నిర్ణయాలు, బ్యాంకింగ్ రంగంలో వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం (నెట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్), వివిధ బ్యాంకులు/ఆర్థిక సంస్థల ఉన్నతాధికారుల వివరాలు, బ్యాంకింగ్/ ఆర్థిక రంగంలో ఉపయోగించే పదజాలం (ఎన్పీఏ, ఎన్ఈఎఫ్టీ వంటివి), ద్రవ్య సాధనాలు (చెక్స్, ఏటీఎం కార్డు తదితర), భారత ఆర్థిక వ్యవస్థ వంటి అంశాల నుంచి అధిక శాతం ప్రశ్నలు రావచ్చు. ఈ విభాగంలో మెరుగైన స్కోర్ కోసం ప్రతిరోజూ ఫైనాన్షియల్ డైలీ/మ్యాగజైన్స్ చదవాలి. స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ అంశాలపై కూడా దృష్టి సారించాలి. స్టాండర్డ్ జీకేకు సంబంధించి వివిధ దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షుల పేర్లు; కరెన్సీలు; ఆస్కార్లతో పాటు వివిధ అవార్డుల విజేతల గురించి తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు ముఖ్యమైన సంఘటనలను తెలుసుకోవాలి.
ప్రొఫెషనల్ నాలెడ్జ్:
ఈ విభాగంలో ఆయా పోస్టులకు అర్హతగా పేర్కొన్న డిగ్రీ/పీజీ కోర్సుల సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. ఉదాహరణకు ఐటీ ఆఫీసర్ పోస్టును పరిగణనలోకి తీసుకుంటే.. నెట్ వర్కింగ్, డేటాబేస్ మేనేజ్మెంట్, నెట్వర్క్ సెక్యూరిటీ, వెబ్ టెక్నాలజీస్, ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్, బేసిక్ హార్డ్‌వేర్ వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. లా ఆఫీసర్ పోస్టును తీసుకుంటే.. బ్యాంకింగ్/ఆర్థిక రంగంతో ముడిపడి ఉన్న చట్టాలపై అధికంగా ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలో మెరుగైన స్కోర్ కోసం స్టాండర్డ పబ్లికేషన్స్ ప్రచురణలు లేదా ఆయా పోస్టుల వారీగా అకడమిక్ పుస్తకాలను చదివితే సరిపోతుంది.
ప్రిపరేషన్:
పరీక్షలో అన్ని ప్రశ్నలను ప్రయత్నించడం కంటే కచ్చితంగా సరైనవి అనే నమ్మకం ఉన్న 80 శాతం ప్రశ్నలను సాధించడం ఉత్తమం. జీకే, బ్యాంకింగ్, ఇంగ్లిష్ విభాగాలు సబ్జెక్ట్ ఆధారంగా ఉంటాయి. ఇందులోని ప్రశ్నలను సాధించడానికి ఎటువంటి తార్కికత అవసరం లేదు. 10 నిమిషాల్లో 80 శాతం మార్కులకు సరిపడ ప్రశ్నలను సాధించవచ్చు. కాబట్టి వీటిని స్కోరింగ్ బూస్టర్స్‌గా వినియోగించుకోవాలి. ప్రొఫెషనల్ నాలెడ్జ్‌ను మినహాయిస్తే.. ఈ పరీక్ష పీఓ మాదిరిగానే ఉంటుంది. కాబట్టి పీఓకు ప్రిపేరైన వారు ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీద దృష్టి సారించడం మంచిది. తొలిసారి ప్రిపేరవుతున్న అభ్యర్థులు ఉన్న వ్యవధిలో అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లిష్ అంశాలను వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. లా, అగ్రికల్చర్ అభ్యర్థులు రీజనింగ్, క్వాంటిటేటివ్ విభాగాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. కనీసం 140, అంతకంటే ఎక్కువ మార్కులు సాధిస్తేనే పోటీలో ఉంటారు. కాబట్టి ఆ దిశగా ప్రిపరేషన్ సాగించాలి.
రిఫరెన్స బుక్స్:
వెర్బల్-నాన్ వెర్బల్ రీజనింగ్- ఆర్.ఎస్.అగర్వాల్
క్వికర్ మ్యాథ్స్-ఎం.థైరా
క్యాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-అరుణ్ శర్మ
ఇంగ్లిష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్-హరిమోహన్ ప్రసాద్
ప్రతియోగితా దర్పణ్
మనోరమ ఇయర్ బుక్
కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ
కాన్సెప్టుల అధ్యయనంతో
Hard work with smart mind.. ఇది ఐబీపీఎస్ స్పెషలిస్టు ఆఫీసర్ రిక్రూట్మెంట్లో విజయానికి దగ్గర చేస్తుంది. రోజుకు ఎన్ని గంటలు చదివామనే దాని కంటే సమయాన్ని సద్వినియోగం చేసుకొని, సమర్థవంతంగా చదివామన్నదే ముఖ్యం. ఏ స్పెషలిస్టు ఆఫీసర్‌కు సంబంధించిన పరీక్ష రాస్తున్న వారైనా ప్రొఫెషనల్ నాలెడ్జ్ విభాగంలో ఎక్కువ స్కోర్ సాధించాలంటే సంబంధిత సబ్జెక్టులోని ప్రాథమిక అంశాలకు సంబంధించిన కాన్సెప్టులను తప్పకుండా అధ్యయనం చేయాలి. ఆయా సబ్జెక్టు పరిజ్ఞానాన్ని, బ్యాంకింగ్ రంగానికి అన్వయించుకుంటూ చదవాలి.
ఇంటర్వ్యూలో కూడా ఈ అంశాలపైనే ఫోకస్ చేస్తారు. ఈ విభాగంలో ప్రిపరేషన్‌కు ఇంటర్నెట్ను బాగా ఉపయోగించుకోవాలి. చాలా మంది ప్రిపరేషన్‌ను బిట్స్‌కు మాత్రమే పరిమితం చేస్తారు. ఇది మంచిది కాదు. రీజనింగ్ విభాగంలో గ్రూప్ రీజనింగ్ (సీటింగ్ అరేంజ్మెంట్, ర్యాంకింగ్..) పై ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి వాటిని బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లిష్ వొకాబ్యులరీపై పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. అరిహంత్ కంప్యూటర్ అవేర్నెస్, బ్యాంకింగ్- అరిహంత్, బ్యాంకింగ్ సర్వీస్ క్రానికల్, ఆర్.ఎస్.అగర్వాల్ (ఆర్థమెటిక్, రీజనింగ్) వంటి పుస్తకాలు ప్రిపరేషన్‌కు
ఉపయోగపడతాయి.
-బి.రాజేష్,స్పెషలిస్టు ఆఫీసర్,యూబీఐ.