'డివిలియర్స్ కు బౌలింగ్ చేయడమే కష్టం'
కోల్‌కతా: తాను ఎదుర్కొన్న బ్యాట్స్మెన్లలో దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్సే అత్యంత ప్రమాదకారని ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజల్‌వుడ్ స్పష్టం చేశాడు. అతని సాంకేతిక పరిజ్ఞానంతో కలగలసిన దూకుడు నిజంగా అమోఘమన్నాడు. ప్రత్యేకంగా డివిలియర్స్‌కు బౌలింగ్ వేయడమే చాలా కష్టంతో కూడుకున్న పనిగా అభివర్ణించాడు. 'ప్రత్యర్థిపై తొలి ఆరు ఓవర్లలో డివిలియర్స్ ఎప్పుడూ పైచేయి సాధించడానికే చూస్తాడు. అదే ఆటను చివర్లో కూడా కొనసాగించి బౌలర్ల మనోధైర్యాన్ని దెబ్బతీస్తాడు. అతనికి బౌలింగ్ చేయడమంటే క్లిష్టమే' అని హాజల్‌వుడ్ తెలిపాడు.
ఇదిలా ఉండగా, బౌలింగ్‌లో వైవిధ్యమే ఆటలో ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తుందన్నాడు. తనదొరకమైన బౌలింగ్ శైలి అయితే.. ఫాల్కనర్ బౌలింగ్ లో కొద్దిగా భిన్నమైన వైవిధ్యం ఉంటుందన్నాడు. ప్రస్తుతం బౌలింగ్‌లో వైవిధ్యంపైనే తన సహచర ఆటగాళ్లతో చర్చిస్తున్నట్లు హాజల్‌వుడ్ పేర్కొన్నాడు. తనను ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్ పోల్చడాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపాడు.