ICDC
-
పుత్తడి బొమ్మలకు పుస్తెల బంధం..
బడికెళ్లాల్సిన బాలికలు పెళ్లి పీటలెక్కుతున్నారు. పుస్తకాలు పట్టాల్సిన అమ్మాయిలు పుస్తెలతాడుతో అత్తారింటి బాట పడుతున్నారు. పట్టుమని 15 ఏళ్లు నిండకుండానే భార్యగా, తల్లిగా బాధ్యతలను మోస్తున్నారు. సంసార మధురిమలు తెలియకుండానే జీవితాన్ని మోస్తున్నారు. పేదరికం ఒక వైపు, ఆడపిల్ల భారం తీరుతుందని కన్నోళ్లే సంసార సాగరంలోకి నెట్టేస్తున్నారు. ఎక్కువగా ఇలాంటి పరిస్థితులు గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల్లోనే జరుగుతున్నాయి. సాక్షి, నెల్లూరు: సాంకేతికత రోజు రోజుకూ పెరుగుతున్నా, ఆధునిక సమాజం వైపు అడుగులు వేస్తున్నా జిల్లాలో మాత్రం బాల్య వివాహాల సంఖ్య నానాటికి పెరుగుతోంది. పెళ్లంటే ఏమిటో కూడా తెలియని వయసులో బాలికలను అత్తారింటికి పంపి, వారి బంగారు భవిష్యత్‌కు తల్లిదండ్రులే సంకెళ్లు వేస్తున్నారు. మరికొందరు ఆడ పిల్లలను బరువుగా భావించి వదిలించుకునే ఆలోచనతో పెళ్లిపీట లెక్కిస్తున్నారు. ఇలాంటి పరిణామాలతో మానసికంగా, శారీరకంగా బాలికలు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నా.. బాల్య వివాహాలు ఆగడం లేదు. ప్రేమ వివాహాలు, మేనరికాలు, వలసలు, వరుడికి ఉద్యోగం ఉందని పరిపక్వత లేని బాల్యాన్ని మాంగల్యంలో బందీ చేస్తున్నారు. ఎక్కువగా గిరిజన, మత్స్యకార కుటుంబాల్లో ఆడ పిల్లలను ఇంటి వద్ద ఉంచలేక 18 ఏళ్ల లోపే వివాహాలు జరిపిస్తున్నారు. పిల్లలు చదువుకునే సమయంలో ప్రేమ, పెళ్లి వైపు వెళ్తే కుటుంబం పరువు పోతుందనే భయంతో మరి కొందరు ఇలా చేస్తున్నారు. అడ్డుకట్టకు మార్గాలు గ్రామ స్థాయిలో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, ఐసీడీఎస్ సెక్టార్ పరిధిలో సూపర్వైజర్, సీడీపీఓ, మండల స్థాయిలో తహసీల్దార్లు, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు బాల్యవివాహాలు అడ్డుకునే అధికారం ఉంది. ఎవరైనా 1098 ఫోన్ చేసి ఫిర్యాదు ఇవ్వొచ్చు. ఇప్పటికే సమగ్ర బాలల పరిరక్షణ పథకం కింద ఐసీడీఎస్ ప్రాజెక్ట్ స్థాయి సమావేశాల్లో అంగన్వాడీ కార్యకర్తల మండల మహిళా సమాఖ్య, సంరక్షణ అధికారుల సమన్వయంతో 18 ఏళ్లు నిండుకుండానే పెళ్లిళ్లు చేయకూడదనే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వివాహ రిజిస్ట్రేషన్ తప్పని సరి బాల్యవివాహాల నిరోధానికి అధికారులు ప్రత్యేక ప్రణాళిక చేపట్టారు. జిల్లాలోని అన్ని, రెవెన్యూ డివిజనల్, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని సీడీపీఓలు వివాహ రిజిస్ట్రేషన్ చట్టం -2002 అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని జీఓ జారీ చేశారు. గ్రామ, వార్డు స్థాయిలో మహిళ సంరక్షణ కార్యదర్శి ద్వారా తప్పక వివాహ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్ని ఆదేశాలిచ్చారు. పెళ్లికి ముందే వరుడు, వధువు, ఇద్దరు సంతకం చేసిన దరఖాస్తు ఫారం, నివాస ధ్రువీకరణ పత్రాలు, వయస్సు నిర్ధారణకు ఆధార్ , రెండు పాస్‌ఫొటో సైజు ఫొటోలు, వివాహ పత్రికలతో కలిసి దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే జైలు శిక్ష, జరిమానా కూడా ఉంటుంది. ఇకపై జిల్లాలో బాల్య వివాహాలు నిరోధించేందుకు కఠినంగా చర్యలు చేపడుతాం. – రోజ్‌మాండ్, ఐసీడీఎస్ పీడీ -
ఆ పాపాలు ఎవరివంటే..?
భామిని: వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ద్వా రా పిల్లలు, బాలింతలకు పంపిణీ చేయాల్సిన ఐసీడీఎస్ పాలు ఆక్రమ రవాణా కేసులో ఇద్దరిని అరె స్టు చేశామని, మరో ముగ్గురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పాలకొండ డీఎస్పీ ఎం.శ్రావణి తెలిపారు. అరెస్టయిన వారిలో వ్యాన్ యజమాని, డ్రైవర్ ఉన్నట్టు పేర్కొన్నారు. భామిని మండలం బత్తిలి పోలీస్ స్టేషన్లో ఎస్సై కె.వి.సురేష్‌తో కలిసి పాలు ఆక్రమ రవాణా కేసు వివరాలను ఆది వారం వెల్లడించారు. బత్తిలి పోలీస్‌లు చెక్‌పోస్టు వ ద్ద శనివారం పట్టుకున్న 1919 లీటర్ల పాల అక్రమ రవాణాపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలకు పాల ప్యాకెట్లను సరఫరా చేసే సబ్‌డీలర్లే కార్యకర్తల వద్ద కొనుగోలు చేసి అ క్రమంగా రవాణా చేస్తున్నట్టు గుర్తించామన్నారు. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురంలోని భద్రగిరి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధి నుంచి పాల ప్యా కెట్లు తరలివచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. వీటిని మిఠాయి, టీ షాపులకు విక్రయిస్తున్నారన్నా రు. ప్యాకెట్లపై ఉన్న నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేయగా.. వీరఘట్టం ప్రాజెక్టుకు చెందిన ప్యాకెట్లు కూడా ఉన్నట్టు వివరించారు. వీటి అమ్మకాలపై డి విజన్‌లోని కొన్ని మండలాల్లో తనిఖీలు నిర్వహించి పలు దుకాణాల్లో ఇవే రకం పాలు ప్యాకెట్లు అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. సీజ్ చేసిన ప్యాకెట్లను ఐసీడీఎస్ పీడీకి అప్పగించామన్నారు. -
ఐసీడీఎస్‌లో వసూల్ రాణి!
ఖమ్మం కార్పొరేషన్, న్యూస్‌లైన్: ఐసీడీఎస్‌లో కిందిస్థాయి సిబ్బందిపై ఓ సూపర్వైజర్ వేధింపులు, వసూళ్ల పర్వం శ్రుతి మించుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఆ సూపర్ వైజర్ తాను చెప్పినట్లు వినకపోతే ఉద్యోగం చేయలేవంటూ తరచూ బెదిరిస్తున్నట్లు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన మాట వినని ఉద్యోగిపై కక్ష కట్టి పదే పదే విజిటింగ్లంటూ ఆ సెంటర్‌ను తనిఖీ చేసి తనదారికి తెచ్చుకుంటున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఆ సూపర్వైజర్కు శాఖలో కొంతమంది ఉన్నతాధికారుల అండదండలు ఉండడంతో ఎవరికీ ఫిర్యాదు చేయలేక, మామూళ్లు ఇచ్చుకోలేక అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ, ప్రతీ నెల మాత్రం ఆమెకు మామూళ్లు ఇవ్వాల్సిందేనని పలువురు అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సూపర్వైజర్ల బదిలీలు జరిగినప్పటికీ ఆ సూపర్వైజర్ మాత్రం జిల్లా కేంద్రం నుంచి బదిలీ కాలేదు. ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని ఇక్కడే తిష్టవేసిందని, అంతేకాకుండా మరో సర్కిల్‌కు ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు శాఖలో చర్చించుకుంటున్నారు. వసూళ్లపర్వం ఇలా... విజిటింగ్ల పేరుతో అంగన్వాడీ కార్యకర్తలను, ఆయాలను బెదిరించడంతో పాటు ప్రతీ కేంద్రం నుంచి నెలకు కొంత వసూళ్లకు కూడా సూపర్వైజర్ పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రతినెలా తాను సెంటర్లకు వస్తున్నందున తన బండి పెట్రోల్ ఖర్చుల కింద రూ.100 ఇవ్వాలని వసూలు చేస్తున్నట్లు, నెలకు ఒకసారి జరిగే సర్కిల్ మీటింగ్‌లో ఈ డబ్బులను వసూలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. అలాగే ప్రతిసెంటర్ నుంచి పిల్లల సంఖ్యను ఎక్కువ చూపించి ఒక ట్రే గుడ్లతోపాటు పిండి(పౌష్టికహారం) కట్టలను సైతం తన ఇంటికి తెప్పించుకుంటారని చెబుతున్నారు. ఆ సూపర్వైజర్ ఇటీవల ఒక నూతన గృహాన్ని కొనుగోలు చేసింది. గృహ ప్రవేశం నిమిత్తం ప్రతీ సెంటర్ కార్యకర్త నుంచి రూ. 1000 చొప్పున వసూలు చేసినట్లు అంగన్వాడీలు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. తన సర్కిల్‌తోపాటు మరో సర్కిల్‌కు ఇన్చార్జ్గా ఉండటంతో మొత్తం 90 మందికిపైగా అంగన్వాడీ కార్యకర్తలు ఒక్కొక్కరి నుంచి రూ. 1000 చొప్పున వసూలు చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఆమె ప్రతినెలా సెంటర్లో తనిఖీలు చేయకుండా ఉండాలన్నా... సెలవులు కావాలన్నా.. డబ్బులు ఇవ్వాల్సిందేనని, లేదంటే వారికి వేధింపులు తప్పడం లేదని సిబ్బంది చెబుతున్నారు. కాగా, ఈ ఆరోపణలు ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ సుఖజీవన్‌బాబు దృష్టికి పోవడంతో సదరు సూపర్వైజర్పై వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేయాలని సీడీపీవో ఝన్సీని ఆదేశించినట్లు సమాచారం. దీంతో సీడీపీవో బుధవారం అంగన్వాడిలను సూపర్వైజర్ అక్రమాల గురించి విచారణ చేసినట్లు సమాచారం.