ఐసీడీఎస్‌లో వసూల్ రాణి!
Published Thu, Aug 15 2013 6:03 AM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM
ఖమ్మం కార్పొరేషన్, న్యూస్‌లైన్: ఐసీడీఎస్‌లో కిందిస్థాయి సిబ్బందిపై ఓ సూపర్‌వైజర్ వేధింపులు, వసూళ్ల పర్వం శ్రుతి మించుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఆ సూపర్ వైజర్ తాను చెప్పినట్లు వినకపోతే ఉద్యోగం చేయలేవంటూ తరచూ బెదిరిస్తున్నట్లు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన మాట వినని ఉద్యోగిపై కక్ష కట్టి పదే పదే విజిటింగ్‌లంటూ ఆ సెంటర్‌ను తనిఖీ చేసి తనదారికి తెచ్చుకుంటున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఆ సూపర్‌వైజర్‌కు శాఖలో కొంతమంది ఉన్నతాధికారుల అండదండలు ఉండడంతో ఎవరికీ ఫిర్యాదు చేయలేక, మామూళ్లు ఇచ్చుకోలేక అంగన్‌వాడీ కార్యకర్తలు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ, ప్రతీ నెల మాత్రం ఆమెకు మామూళ్లు ఇవ్వాల్సిందేనని పలువురు అంగన్‌వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సూపర్‌వైజర్ల బదిలీలు జరిగినప్పటికీ ఆ సూపర్‌వైజర్ మాత్రం జిల్లా కేంద్రం నుంచి బదిలీ కాలేదు. ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని ఇక్కడే తిష్టవేసిందని, అంతేకాకుండా మరో సర్కిల్‌కు ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు శాఖలో చర్చించుకుంటున్నారు.
వసూళ్లపర్వం ఇలా...
విజిటింగ్‌ల పేరుతో అంగన్‌వాడీ కార్యకర్తలను, ఆయాలను బెదిరించడంతో పాటు ప్రతీ కేంద్రం నుంచి నెలకు కొంత వసూళ్లకు కూడా సూపర్‌వైజర్ పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రతినెలా తాను సెంటర్‌లకు వస్తున్నందున తన బండి పెట్రోల్ ఖర్చుల కింద రూ.100 ఇవ్వాలని వసూలు చేస్తున్నట్లు, నెలకు ఒకసారి జరిగే సర్కిల్ మీటింగ్‌లో ఈ డబ్బులను వసూలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. అలాగే ప్రతిసెంటర్ నుంచి పిల్లల సంఖ్యను ఎక్కువ చూపించి ఒక ట్రే గుడ్లతోపాటు పిండి(పౌష్టికహారం) కట్టలను సైతం తన ఇంటికి తెప్పించుకుంటారని చెబుతున్నారు.
ఆ సూపర్‌వైజర్ ఇటీవల ఒక నూతన గృహాన్ని కొనుగోలు చేసింది. గృహ ప్రవేశం నిమిత్తం ప్రతీ సెంటర్ కార్యకర్త నుంచి రూ. 1000 చొప్పున వసూలు చేసినట్లు అంగన్‌వాడీలు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. తన సర్కిల్‌తోపాటు మరో సర్కిల్‌కు ఇన్‌చార్జ్‌గా ఉండటంతో మొత్తం 90 మందికిపైగా అంగన్‌వాడీ కార్యకర్తలు ఒక్కొక్కరి నుంచి రూ. 1000 చొప్పున వసూలు చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఆమె ప్రతినెలా సెంటర్‌లో తనిఖీలు చేయకుండా ఉండాలన్నా... సెలవులు కావాలన్నా.. డబ్బులు ఇవ్వాల్సిందేనని, లేదంటే వారికి వేధింపులు తప్పడం లేదని సిబ్బంది చెబుతున్నారు. కాగా, ఈ ఆరోపణలు ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ సుఖజీవన్‌బాబు దృష్టికి పోవడంతో సదరు సూపర్‌వైజర్‌పై వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేయాలని సీడీపీవో ఝన్సీని ఆదేశించినట్లు సమాచారం. దీంతో సీడీపీవో బుధవారం అంగన్‌వాడిలను సూపర్‌వైజర్ అక్రమాల గురించి విచారణ చేసినట్లు సమాచారం.
Advertisement
Advertisement