నేడు వైఎస్సార్ సీఎల్పీ తొలి సమావేశం
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం(వైఎస్సార్ సీఎల్పీ) తొలిసారి బుధవారం సమావేశం కానుంది. ఇందుకోసం ఇడుపులపాయలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమావేశంలో పార్టీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకోనున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం శాసనసభలో నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ సమావేశంలో నేతలకు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు.ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్ర ఏర్పాటు, ఎదురయ్యే సమస్యలు, సవాళ్ల నేపథ్యంలో గట్టి ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ప్రజల పక్షాన నిలవాలన్నదే సమావేశం ప్రధాన ఎజెండాగా నిర్ణయించారు. సభలో ఏకైక ప్రతిపక్షంగా ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో మరింత గట్టిగా ప్రజల పక్షాన పోరాటాలు చేయాలన్న ఆలోచనలో పార్టీ నేతలున్నారు.
జగన్ను కలిసిన ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు
తన సోదరుని కుమారుడి వివాహం కారణంగా వైఎస్సార్ సీఎల్పీ తొలి సమావేశానికి హాజరు కాలేకపోతున్నానని ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో పార్టీ అధ్యక్షుడు జగన్ను కలుసుకుని సమావేశానికి రాలేనని అనుమతి కోరారు.