అభివృద్ధి పనులకూ పోలీసుల సహకారం
సిరిసిల్ల: శాంతి భద్రతల పరిరక్షణతో పాటు అభివృద్ధి పనులకు కూడా పోలీసుల సహకారం ఉంటుందని వరంగల్ ఐజీ నవీన్‌చంద్ అన్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం, చిన్నలింగాపూర్ గ్రామంలోని ఎల్లమ్మ చెరువులో బుధవారం పోలీసులు నిర్వహించిన మిషన్ కాకతీయ పనులకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకారం అందించాలని కోరారు. కాగా, మిషన్ కాకతీయ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలంటూ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా పోలీసులు ఎల్లమ్మ చెరువును దత్తత తీసుకున్నారు. బుధవారం గ్రామస్థుల సహకారంతో ఎల్లమ్మ చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. చెరువులో పూడిక తీసి ట్రాక్టర్ల ద్వారా ఎత్తిపోశారు. ఈ కార్యక్రమంలో ఐజీ నవీన్ చంద్‌తో పాటు డీఐజీ మల్లారెడ్డి, ఎస్పీ శివకుమార్, సిరిసిల్ల డీఎస్పీ నరసయ్య, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.