ఐఐఎం విద్యార్థులకు..ఎంబీఏ ‘పట్టా’!
ఐఐఎం బిల్లు–2017తో స్వయం ప్రతిపత్తి
ఐఐఎంలు.. పరిచయం అక్కర్లేని, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు. కానీ.. అవి ఇచ్చే సర్టిఫికెట్లకు మాత్రం అంతర్జాతీయ గుర్తింపు విషయంలో ఒక్కో దేశంలో ఒక్కో నిర్ణయం. ఇన్స్టిట్యూట్స్లో పరిపాలనపరంగానూ పలు అడ్డంకులు. ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను నియమించుకోవాలన్నా ఎన్నో నిబంధనలు. ఇలాంటి పరిస్థితికి ఫుల్స్టాప్ పెట్టే దిశగా ఐఐఎంలకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తూ తెచ్చిన ఐఐఎం బిల్లు–2017కు ఇటీవల లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుతో
ఇన్స్టిట్యూట్లకు, విద్యార్థులకు కలగనున్న ప్రయోజనాలపై విశ్లేషణ..
ఇక ఎంబీఏ, పీహెచ్డీ పట్టాలు
ఇప్పటివరకు ఐఐఎంలు తాము అందిస్తున్న కోర్సులను పీజీ డిప్లొమా లేదా, ఎగ్జిక్యూటివ్ డిప్లొమా పేరుతో సర్టిఫికెట్లను జారీ చేస్తున్నాయి. వీటికి మార్కెట్పరంగా, ఉన్నత విద్య కోర్సుల్లో చేరడం విషయంలోనూ పలు దేశాల్లో మాస్టర్ స్థాయి గుర్తింపు లభించడం లేదు. పీహెచ్‌డీకి సమానమైనదని పేర్కొనే ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ (ఎఫ్‌పీఎం)ను సైతం పలు విదేశీ వర్సిటీలు పీహెచ్‌డీగా పరిగణించేందుకు సంకోచిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో.. ఐఐఎం బిల్లు–2017 అమలు ద్వారా ఐఐఎంలకు డిప్లొమాలకు బదులు డిగ్రీలు మంజూరు చేసే అవకాశం లభిస్తుంది. ఐఐఎంలు పీజీడీఎం, ఫెలో ప్రోగ్రామ్స్‌కు బదులు ఎంబీఏ, పీహెచ్‌డీలు ప్రదానం చేసే వీలు కలుగుతుంది.
డైరెక్టర్ నియామకం
తాజా బిల్లు ద్వారా కొత్త డైరెక్టర్‌ను నియమించుకోవడంలో ఐఐఎంలులోని
బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌కు స్వీయ అధికారాలు కల్పిస్తారు. ఇప్పటివరకు ఈ విషయంలో హెచ్ఆర్డీ శాఖ ఆమోదం తీసుకోవాల్సి వచ్చేది. దీనివల్ల ఏళ్ల తరబడి డైరెక్టర్లు లేకుండానే ఇన్స్టిట్యూట్స్ నడవాల్సిన పరిస్థితి నెలకొంది. స్వయంప్రతిపత్తి కల్పించడం వల్ల ఒక డైరెక్టర్ పదవీ కాలం పూర్తవగానే కొత్త డైరెక్టర్‌ను నియమించుకునే వీలు కలుగుతుంది.
ఫ్యాకల్టీ కొరతకూ పరిష్కారం
ఐఐఎం–బిల్లు 2017లో ఫ్యాకల్టీ నియామకాల్లోనూ ఇన్స్టిట్యూట్లకు స్వయంప్రతిపత్తి ప్రతిపాదించారు. దీనివల్ల ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా ఐఐఎంలలో ఫ్యాకల్టీ కొరత సమస్యకు పరిష్కారం దొరకనుంది. విజిటింగ్ ఫ్యాకల్టీ, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీని ఆహ్వానించే విషయంలోనూ ఐఐఎంలకు స్వేచ్ఛ లభించనుంది.
కోఆర్డినేషన్ ఫోరమ్
బిల్లు ప్రకారం అన్ని ఐఐఎంలకు కలిపి ఒక కోఆర్డినేషన్ ఫోరమ్ ఏర్పాటు కానుంది. దీనికి అన్ని ఇన్స్టిట్యూట్ల బీఓజీ చైర్ పర్సన్స్ ప్రాతినిథ్యం వహిస్తారు. వారిలోంచి ఒకరిని కోఆర్డినేషన్ ఫోరమ్ చైర్ పర్సన్‌గా ఎంపిక చేస్తారు. చైర్ పర్సన్ రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారు. తద్వారా ప్రస్తుతం పలు అంశాలపరంగా ఒక్కో ఐఐఎంలో ఒక్కో తీరుగా అమలవుతున్న విధానాలకు తెరపడి.. కామన్ పాలసీ రూపొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రవేశ ప్రక్రియల్లో ఈ ఉమ్మడి విధానం వల్ల విద్యార్థులకు వ్యయప్రయాసల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇతర ప్రాంతాల్లో... విదేశాల్లో సైతం
ప్రస్తుత నిబంధనల ప్రకారం ఐఐఎంలు.. అవి నెలకొన్న ప్రాంతంలోనే అకడమిక్ తరగతులను నిర్వహించే వీలుంది. ఐఐఎం–బిల్లు 2017 ద్వారా కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఇతర ప్రాంతాల్లోనూ లెర్నింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ అనుమతితో విదేశాల్లో సైతం స్టడీ సెంటర్లను నెలకొల్పవచ్చు. ఈ సెంటర్లతో గ్లోబల్ ర్యాంకింగ్స్ పరంగా కీలక పారామీటర్‌గా ఉన్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రేషియో విషయంలో ముందంజలో ఉండొచ్చు. సెంటర్ ఏర్పాటు చేసిన విదేశీ యూనివర్సిటీతో ఒప్పందం ద్వారా కొలాబరేటివ్ రీసెర్చ్ కార్యకలాపాలు నిర్వహించే అవకాశం కూడా లభిస్తుంది. ఇది కూడా గ్లోబల్ ర్యాంకింగ్స్ పరంగా పోటీ పడేందుకు, ముందు నిలిచేందుకు ఆస్కారం కల్పిస్తుంది.
రీసెర్చ్‌కు ప్రాధాన్యం
బిల్లులో మరో ప్రధానాంశం.. ఐఐఎంలు స్వయంగా రీసెర్చ్ యాక్టివిటీస్ దిశగా స్వతంత్రంగా వ్యవహరించడం. రీసెర్చ్‌కు అవసరమైన నిధుల సమీకరణ, ఎక్సే్ఛంజ్ ఒప్పందాలు, స్పాన్సర్డ్ రీసెర్చ్ కార్యకలాపాలు వంటివాటి విషయంలో సదరు ఐఐఎం గవర్నింగ్ కౌన్సిల్‌కే పూర్తి నిర్ణయాధికారాలు ఉంటాయి. ఈ ప్రతిపాదన విద్యార్థులకు రీసెర్చ్ యాక్టివిటీస్ పరంగా విద్యార్థులకు మేలు చేస్తుందని భావిస్తున్నారు.
వైవి«ధ్యానికి ప్రాధాన్యం
బిల్లులో మరో కీలకాంశం వైవిధ్యం (డైవర్సిటీ)కు ప్రాధాన్యం ఇవ్వడం. రిజర్వేషన్లు, జండర్ డైవర్సిటీ ద్వారా అన్ని వర్గాలకు ఐఐఎంలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టే వీలు కల్పిస్తోందీ బిల్లు. ఐఐఎంలు దేశవ్యాప్తంగా విస్తరించినా కొందరికే అవకాశం లభిస్తోంది. ఇలాకాకుండా ఫ్యాకల్టీ నియామకాల్లోనూ డైవర్సిటీని పాటించనున్నారు. దాంతోపాటు ఐఐఎంలలో ప్రవేశానికి నిర్వహించే క్యాట్ స్వరూపం అన్ని అకడమిక్ నేపథ్యాలవారికి అనుకూలంగా ఉండేలా చూడాలనేది కొత్త బిల్లులోని మరో ముఖ్యాంశం. ఫలితంగా ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ నేపథ్యం ఉన్నవారికే క్యాట్ అనుకూలం, మిగతా వారికి అవకాశాలు స్వల్పం అనే అభిప్రాయాలకు స్వస్తి పలికే చర్యలు చేపట్టే వీలు కలుగుతుంది.
ముఖ్యాంశాలు
మాస్టర్స్ డిగ్రీ ప్రదానం చేసే అధికారం
ఫ్యాకల్టీ, డైరెక్టర్ల నియామకంలో స్వేచ్ఛ
కొలాబరేటివ్ రీసెర్చ్ విషయంలో స్వతంత్రత
డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సెంటర్స్ ఏర్పాటు
అడ్మిషన్ ప్రక్రియలో లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్‌కు ఆస్కారం ఇచ్చేలా చర్యలు
ఐఐఎం కోఆర్డినేషన్ ఫోరం ఏర్పాటు – ఫలితంగా అన్ని ఐఐఎంలలో ఒకే తరహా విధానాలు అమలయ్యే అవకాశం
ప్రైవేటు బి–స్కూల్స్‌కు స్వయంప్రతిపత్తి!
దేశంలో ప్రముఖ ప్రయివేట్ బి–స్కూల్స్‌కు కూడా స్వయంప్రతిపత్తి హోదా ఇచ్చే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ విషయంపై అధ్యయనానికి ఇప్పటికే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఒక కమిటీని నియమించింది. ఐఐఎంలకు దీటుగా రాణిస్తూ ప్రపంచ స్థాయిలో పేరుపొందిన ప్రైవేటు ఇన్స్టిట్యూట్లు.. ప్రభుత్వ నియంత్రణ సంస్థల కారణంగా కార్యకలాపాలు, అకడమిక్స్ నిర్వహణలో ఇబ్బందులకు గురి కాకూడదనే ప్రైవేటు బి–స్కూల్స్‌కు అటానమస్ హోదా ఇచ్చే దిశగా హెచ్ఆర్డీ యోచిస్తున్నట్లు సమాచారం.
అటానమస్ హోదాతో ప్రయోజనం
ఐఐఎంలకు స్వయంప్రతిపత్తి హోదా కల్పించడం వల్ల అటు విద్యార్థులు, ఇటు ఇన్స్టిట్యూట్లకు ప్రయోజనం కలుగుతుంది. విద్యార్థులకు గ్లోబల్ ఎక్స్పోజర్ లభిస్తుంది. ఇన్స్టిట్యూట్లు కూడా ఎక్సే్ఛంజ్ ప్రోగ్రామ్స్ నిర్వహణ, కొలాబరేటివ్ రీసెర్చ్ పరంగా స్వతంత్రంగా వ్యవహరించే వీలు కలుగుతుంది.
– ప్రొఫెసర్.దినేశ్ కుమార్, ఐఐఎం–బెంగళూరు