ఐఐఎస్టీ – కోర్సులు
దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటి.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్టీ). కేంద్ర అంతరిక్ష శాఖ పరిధిలోని ఈ సంస్థ.. స్పేస్ సంబంధిత కోర్సులను అందించడంలో మంచి పేరు పొందింది. అంతేకాకుండా నిర్దేశిత గ్రేడ్ మార్కులతో కోర్సులు పూర్తిచేసినవారికి ఇస్రో ఆధ్వర్యంలోని వివిధ రాకెట్ ప్రయోగ కేంద్రాల్లో నేరుగా ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తోంది. 2017కు సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ఐఐఎస్టీ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఐఐఎస్టీ కోర్సులు.. అర్హతలు..
ఆఫర్ చేస్తున్న కోర్సులు – అర్హతలు – సీట్లు
బీటెక్ – ఏరోస్పేస్ ఇంజనీరింగ్
వ్యవధి: నాలుగేళ్లు సీట్లు: 60
బీటెక్ – ఏవియానిక్స్
వ్యవధి: నాలుగేళ్లు
సీట్లు: 60
డ్యుయెల్ డిగ్రీ (బీటెక్, ఎంఎస్/ఎంటెక్).
ఇందులో భాగంగా విద్యార్థులు బీటెక్‌లో ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఎంఎస్‌లో (ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్)/(ఎర్త్ సిస్టమ్ సైన్స్), (సాలిడ్ స్టేట్ ఫిజిక్స్) లేదా ఎంటెక్‌లో (ఆప్టికల్ ఇంజనీరింగ్) చదవాల్సి ఉంటుంది. అంతేకాకుండా నాలుగేళ్లు పూర్తికాగానే బీటెక్ పట్టా ఇవ్వరు. ఐదేళ్లపాటు డ్యుయెల్ డిగ్రీ చదవాల్సిందే.
వ్యవధి: ఐదేళ్లు సీట్లు: 20
అర్హతలు:భారతీయ పౌరులై ఉండాలి.
జనరల్, ఓబీసీ అభ్యర్థులు అక్టోబర్ 1, 1992; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు అక్టోబర్ 1, 1987న లేదా తర్వాత జన్మించి ఉండాలి.
75 శాతం (ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు 65 శాతం) అగ్రిగేట్ మార్కులతో ఇంటర్మీడియెట్ (ఎంపీసీ) ఉత్తీర్ణత. అగ్రిగేట్ మార్కుల కోసం ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, లాంగ్వేజ్, ఇతర ఏదైనా సబ్జెక్టుల్లో సాధించిన మార్కులను పరిశీలిస్తారు.
జేఈఈ అడ్వాన్స్డ్ – 2017లో కేటగిరీలవారీగా ఐఐఎస్టీ నిర్దేశించిన మార్కులు సాధించాలి. ఈ క్రమంలో జనరల్ కేటగిరీ విద్యార్థులు మొత్తం మీద కనీసం 20 శాతం మార్కులు; ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీల్లో ప్రతి సబ్జెక్టులో కనీసం 5 శాతం మార్కులు సాధించాలి.
ఓబీసీ (ఎన్సీఎల్) విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్–2017లో మొత్తం మీద కనీసం 18 శాతం మార్కులు; ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ల్లో ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 4.5 శాతం మార్కులు పొందాలి.
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు జేఈఈ అడ్వాన్స్డ్–2017లో మొత్తం మీద కనీసం 10 శాతం మార్కులు; ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ల్లో ప్రతి సబ్జెక్టులో కనీసం 2.5 శాతం మార్కులు సాధించాలి.
జేఈఈ అడ్వాన్స్డ్ – 2017లో నిర్దేశిత మార్కులు సాధించడంతోపాటు ఐఐఎస్‌టీకి దరఖాస్తు చేసుకున్నవారు మాత్రమే ప్రవేశాలకు అర్హులు.
ఆర్థిక సదుపాయం: ఐఐఎస్‌టీలో ప్రవేశం పొందిన విద్యార్థులు మొదటి సెమిస్టర్లో 10కి 7.5 సీజీపీఏ సాధిస్తే రెండో సెమిస్టర్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇలా ప్రతి సెమిస్టర్లో నిర్దేశిత సీజీపీఏ సాధిస్తే సెమిస్టర్ ఫీజు, ఇతర ఖర్చులు కలిపి మొత్తం రూ.48,400 మినహాయింపు ఉంటుంది.
ఇస్రో కేంద్రాల్లో ఉద్యోగం గ్యారెంటీ: ఐఐఎస్టీ నాలుగేళ్ల బీటెక్, ఐదేళ్ల డ్యుయెల్ డిగ్రీ కోర్సులు అభ్యసించి 10కి 7.5 సీజీపీఏ సాధించినవారిని ఇస్రో/డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ (డీవోఎస్) కేంద్రాల్లో అదనపు పోస్టుల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. తద్వారా నెలకు రూ.56,100 వేతనం (ఏడో పే కమిషన్ ప్రకారం) అందుకోవచ్చు. వీటితోపాటు ఇంటి అద్దె, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ చెల్లిస్తారు. ఇంకా కుటుంబమంతటికీ వైద్య సదుపాయం, గ్రూప్ ఇన్సూరెన్స్, లీవ్ ట్రావెల్ కన్సెషన్, పెన్షన్ తదితర సౌకర్యాలుంటాయి.
ముఖ్య తేదీలు
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: మే 22, 2017
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: జూన్ 12, 2017
ప్రవేశాల కౌన్సెలింగ్: జూన్ నాలుగో వారం, 2017
వెబ్సైట్: www.iist.ac.in