అక్రమ రవాణాకు చెక్ పెట్టాలి
చెక్ పోస్టుల్లో విధులు సక్రమంగా నిర్వహించాలి
సమీక్ష సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ దివ్య
ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో వివిధ శాఖలచే నిర్వహించబడుతున్న చెక్ పోస్టుల అధికారులు అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డి. దివ్య ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో పౌరసరఫరాల శాఖ, పోలీస్, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మార్కెంటింగ్, రవాణా, మైనింగ్, అటవీశాఖ అధికారులతో వస్తువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాతో పాటు పక్క రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలకు జరుగుతున్న అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్టుల్లో విధులు నిర్వహించే అధికారుల సమాచారం, ఫోన్‌నంబర్లు క్రోడికరించి ప్రతీ సమాచారం అందరికీ తెలిసేలా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీఎస్ఓ ఉషారాణిని ఆదేశించారు. పోలీస్ శాఖ సూచించిన మేరకు తొమ్మిది ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టుల ఏర్పాటుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతామన్నారు. అటవీసందప, వాణిజ్యపరమైన సరుకులు, ఇసుక, బియ్యం అక్రమ రవాణా, గంజాయి వంటి వస్తువుల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు చెక్ పోస్టుల్లో విస్తృతంగా తనిఖీలు చేయాలన్నారు. వివిధ శాఖల ద్వారా నిర్వహిస్తున్న బోర్డర్ చెక్ పోస్టుల వివరాలను, విధులు నిర్వహించే అధికారుల వివరాలను, మోడల్ వే బిల్లు నమూనాలను క్రోడికరించి పీడీఎఫ్ రూపంలో వాట్సాప్‌లో పొందుపర్చాలని డీఎస్ఓకు సూచించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ సాయికృష్ణ, ఎక్సైజ్ డీసీ మహేష్‌బాబు,ఆర్డీఓ మోహిమిన్,డీఎస్ఓ ఉషారాణి, గనుల శాఖ ఏడీ నర్సింహాæరెడ్డి, వాణిజ్య పన్నుల శాఖాధికారి శంకర్, మార్కెఫెడ్ డీఎం వినోద్‌కుమార్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.