అక్రమాల క్వారీ
అవినీతికి చెట్టు, పుట్టు, మట్టి ఏదైనా ఒకటేనని నిరూపిస్తున్నారు కొత్తూరు రిజర్వు ఫారెస్టు అధికారులు, సిబ్బంది. దాదాపు రూ.20కోట్లకుపైనే అక్రమ క్వారీయింగ్ జరిగినట్లు సమాచారం. గురువారం ‘సాక్షి’లో వచ్చిన ‘అమ్మకానికి అడవి’ కథనం కలకలం రేపింది. దీనిపై చీఫ్ కన్జర్వేటర్ విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో అవినీతిరాయుళ్లు భయంతో వణికిపోతున్నారు.
పశ్చిమ కృష్ణా, న్యూస్‌లైన్ : అటవీశాఖలో అవినీతి ఊడలు దిగింది. కొత్తూరు రిజర్వు ఫారెస్టును అడ్డాగా చేసుకొని కొందరు అధికారులే అక్రమాలకు ఊతమిస్తూ కోట్ల రూపాయలు గడించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటవీభూములను అడ్డగోలుగా అమ్ముకోవడమేగాక అక్రమ క్వారీలను ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ యడవల్లి వీరయ్య కుంట నుంచి జానకమ్మ కుంట వరకు 13 అక్రమ క్వారీలు వెలిశాయి. వీటిలో ప్రస్తుతం తొమ్మిది క్వారీల నుంచి గ్రావెల్ తరలిపోతుంది.
రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు పొక్లెయిన్లతో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. అక్రమ క్వారీయింగ్ ద్వారా ఇప్పటివరకు సుమారు రూ.20 కోట్లపైనే వ్యాపారం జరిగిందని సమా చారం. భారీగా ముడుపులు దండుకుంటున్న అధికారులు ఈ విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తూ అప్పుడప్పుడు మొక్కుబడి కేసుల నమోదుతో ‘షో’ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జరిగిన నష్టానికి ఐదురెట్లు వసూలు చేయాలని అటవీశాఖ చట్టాలు చెబుతున్నాయి. దీని ప్రకారం అక్రమ క్వారీయింగ్ వ్యవహారంలో రూ. కోట్లు నష్టపరిహారంగా వసూలు చేయాల్సి ఉంది. ఇక్కడి క్వారీలను పరిశీలిస్తే జరిగిన నష్టానికి, ఆ శాఖాధికారులు జరిమానాలుగా వసూలు చేసిన మొత్తానికి ఏమాత్రం పొంతన కనిపించడంలేదు.
కలప సొమ్ము స్వాహా
జానకమ్మ కుంట ప్రాంతంలో ఉన్న కానూరి కరణంగారి తోట 70 ఎకరాల్లో జామాయిల్ సాగులో ఉంది. నాలుగు నెలల క్రితం అధికారులు సర్వేచేసి 30 ఎకరాలు అటవీభూమిగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ భూమిలోని జామాయిల్ చెట్లను నరికించారు. ఆ కలపను లారీల్లో తరలించి విక్రయించగా వచ్చిన మొత్తం సొమ్ము రూ.8లక్షలను ఉద్యోగులు స్వాహా చేశారనే అభియోగాలు వినిపిస్తున్నాయి. ఇది కొత్తేమీకాదని, ఈ తరహా ఘటనలు కొత్తూరు రిజర్వు ఫారెస్ట్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్నాయి.
సంచలనం రేపిన ‘సాక్షి’ కథనం
గురువారం ‘సాక్షి’లో వచ్చిన ‘అమ్మకానికి అడవి’ కథనం అటవీశాఖలో కలకలం సృష్టించింది. డీఎఫ్ఓ రాజశేఖర్ గోప్యంగా కొందరు అధికారుల్ని విచారించినట్లు తెలుస్తోంది. నూజివీడు, మైలవరం ప్రాంతాల నుంచి ఫారెస్ట్ సిబ్బంది, అధికారులు కొందర్ని పిలిపించి కొత్తూరు రిజర్వు ఫారెస్ట్‌లో క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సిందిగా ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. అక్రమాలకు ప్రధాన సూత్రధారి అయిన కిందిస్థాయి ఉద్యోగి వైఖరిపై దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు భోగట్టా. అయితే అక్రమాలు బయటపడకుండా కేరిన్(అటవీ హద్దులు) మార్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. క్వారీ గోతుల విషయంలో విచారణ కమిటీకి దొరికిపోతామనే భయం అవినీతి అధికారుల్ని వెంటాడుతోంది.