ఏపీ కేబినెట్ లో 'భూ దందా' ప్రకంపనలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో అధికార టీడీపీ నాయకుల భూదందాపై 'సాక్షి' వెలువరించిన కథనం సంచలనం సృష్టిస్తోంది. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అడ్డగోలుగా భూ దోపిడీకి పాల్పడిన వైనాన్ని సవివరంగా సాక్ష్యాలతో 'సాక్షి' ప్రజల ముందుంచింది. తమ బండారం బయటపడడంతో అధికార పార్టీ నాయకులు ఉలిక్కి పడ్డారు.
బుధవారం విజయవాడలో జరుగుతున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలోనూ ఈ అంశం చర్చకు వచ్చినట్టు తెలిసింది. సాక్షి పత్రికలను మంత్రులు కేబినెట్ లోకి తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ ఉదయమే మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ సమావేశమై 'భూ దందా' కథనాలపై చర్చించినట్టు తెలిసింది. ఇతర మంత్రులు కూడా దీనిపై చర్చించుకుంటున్నట్టు సమాచారం.
'సాక్షి' కథనంపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. తమపై అసత్య కథనాలు ప్రచురించారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అభాండాలు వేశారని వాపోయారు.