రైల్లో అక్రమంగా తరలుతున్న పటిక పట్టివేత
మధిర : రైల్లో అక్రమంగా తరలిస్తున్న సారాతయారీకి ఉపయోగించే పటికను మధిర రైల్వేపోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం ఇంటికన్నె తండాకు చెందిన నలుగురు ఏపీలోని కష్ణాజిల్లా కొండపల్లి నుంచి సుమారు రెండు క్వింటాళ్ల సారా పటికను కొనుగోలు చేశారు. ఇంటికన్నె తండాకు చెందిన అజ్మీరాస్వాతి, గుగులోతు వెంకన్న, బోడ బుజ్జి, భూక్యా శాంతి సారాతయారీకి ఉపయోగించే పటిక, బెల్లం తదితర వాటిని సేకరించి సొంతంగా సారాతయారుచేసి నెక్కొండ, కేసముద్రం తదితర ప్రాంతాల్లో విక్రయిస్తుంటారని రైల్వేపోలీసులు తెలిపారు. కొండపల్లిలో కొనుగోలు చేసిన పటికను ఎవరికీ అనుమానం రాకుండా సరుకులు తీసుకువెళ్లే సంచుల్లో, పాత చీరెల్లో మూటలుగా కట్టి విజయవాడ నుంచి ఖాజీపేట వైపు వెళ్లే పాసింజర్ రైల్లో తరలిస్తున్నారు. రైలుబండిలోని బాత్రూంలో ఈ మూటలను దాచి ఉంచారు. అంతేకాకుండా వారు బాత్ రూమ్‌కు బయటవైపు ఉండి వ్యూహాత్మకంగా లోపలివైపు గడియ పెట్టారు. బాత్రూం తలుపును ఎంతకీ తీయకపోవడంతో అనుమానం వచ్చిన కొంతమంది ప్రయాణికులు మధిర రైల్వేపోలీసులకు సమాచారం అందించారు. దీంతో పాసింజర్ రైలు మధిర రైల్వేస్టేష¯ŒSకు చేరుకున్న తరువాత రైల్వేహెడ్‌కానిస్టేబుల్ తుమ్మల బాలస్వామి ఆధ్వర్యంలో పోలీసులు ఎ¯ŒS.రమేష్, ఎస్బి.శ్రీనివాసులు దాడి చేసి బాత్రూం గడియను తొలగించారు. అందులో ఉన్న మూటలను జాగ్రత్తగా పరిశీలించగా సారాపటిక అని తేలింది. పటికను అక్రమంగా తరలిస్తున్న నలుగురిలో ముగ్గురు పరారు కాగా అజ్మీరా స్వాతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ సంఘటనపై పంచనామా నిర్వహించడం జరిగిందని, ఖమ్మం రైల్వే ఎస్ఐ కె.నరేష్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారని రైల్వే హెడ్ కానిస్టేబుల్ తుమ్మల బాలస్వామి తెలిపారు.