అడ్డుకునేవారెవరు?
కాతేరులో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా l
పట్టించుకోని అధికారులు
సాక్షి, రాజమహేంద్రవరం :
కాతేరులో ఇసుక అక్రమ రవాణా ఏమాత్రం ఆగలేదు. కాతేరు అనధికార ర్యాంపు నుంచి ఇసుకను ట్రాక్టర్లలో తరలించి లారీల్లో నింపి విశాఖ జిల్లా, ఇతర దూర ప్రాంతాలకు యథేచ్ఛగా రవాణా చేస్తున్న విషయం పలు మార్లు ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ వ్యవహారం కలెక్టర్ దృష్టికి వెళ్లినా మండల స్థాయిలో అధికారులు మిలాఖాత్ అవ్వడం వల్ల ఇసుక అక్రమ దందాకు అడ్డుపడడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇందుకు మంగళవారం జరిగిన çఘటన ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.
అధికారులకు కనిపించలేదా!
కాతేరు పంచాయతీలో రికార్డులను ప్రస్తుత ఇ¯ŒSచార్జి కార్యదర్శికి అప్పగించేందుకు, సిబ్బం దికి జీతాలు ఎన్ని నెలలకు ఇవ్వాలి? లెక్కా పత్రం తేల్చేందుకు రాజమహేంద్రవరం రూరల్ మండల తహసీల్దార్ జి.భీమారావు, మండల అభివృద్ధి అధికారి రమణారెడ్డి మంగళవారం మధ్యాహ్నం కాతేరు పంచాయతీ కార్యాలయం లో పంచాయతీ స్థాయి అధికారులతో సమావేశమయ్యారు. అయితే ఓ పక్క వీరి సమావేశం కొనసాగుతుండగానే మరో పక్క ఇసుక అక్రమ రవాణాదారులు తమ పని తాము నిమ్మలంగా చేసుకుంటున్నారు. కాతేరు అనధికార ఇసుక ర్యాంపునకు వెళ్లే దారిలో గ్రామం చివరన ఉన్న ఖాళీ స్థలంలో భారీ స్థాయిలో ఇసుక డంపు చేశారు. అక్కడ నుంచి లారీల్లో మినీ ప్రొక్లెయి¯ŒS ద్వారా నింపుతున్నారు. తహసీల్దార్, ఎంపీడీవో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉన్నా తమ పని తాము కానిచ్చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి కేవలం 200 అడుగుల దూరంలోని డంపు నుంచి ఇసుకను లారీల్లో నింపుతున్నా అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడలేదు.
వేకువజామునే..
కాతేరు అనాధికార ర్యాంపు నుంచి గ్రామంలో పెద్ద మనుషులుగా, రాజకీయ పార్టీ నేతలుగా చెలామణి అవుతున్నా వారు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. వేకువజామున కూలీల సహాయంతో ఇసుకను ట్రాక్టర్లలో నింపిస్తున్నారు. కూలీలకు ఒక్కో ట్రాక్టర్కు రూ. 250లు ఇస్తున్నారు. గ్రామంలో తమ, తమ బంధువుల ఖాళీ స్థలాల్లో డంపులు ఏర్పాటు చేసి ఇసుక నిల్వ చేస్తున్నారు. ఇసుక డంపులు గ్రామంలో పలు చోట్ల ఉన్నాయి. ప్రధాన రహదారి వెంట వెళుతున్నా స్పష్టంగా కనిపిస్తాయి.
అధికారులపై ఆరోపణలు
కాతేరు అనాధికార ఇసుక ర్యాంపు నుంచి ఇసుక తరలించడం, గ్రామంలో డంపు చేయడం వరకూ రెవెన్యూ అధికారులకు తెలియందేమీ కాదు. అయితే ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు ఒక్క ట్రాక్టరును పట్టుకోలేదు. ఏ ఒక్కరిపై కేసు నమోదు చేయలేదు. గ్రామానికి వస్తున్న దారిలోనే ఇసుక నిల్వలు కనిపిస్తున్నా చర్యలు తీసుకోకపోవడంపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దాటవేత ధోరణి
ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న విషయం ‘సాక్షి’ కంటపడిన వెంటనే వీఆర్వో ముని దృష్టికి తీసుకెళ్లగా ‘ఇక్కడ అలా జరగదండీ’ అంటూ దాటవేశారు. మరో 15 నిమిషాల తర్వాత కార్యాలయానికి వచ్చిన తహసీల్దార్ జి.భీమారావు దృష్టికి తీసుకెళ్లగా ‘ విచారిస్తాం. ఇసుక డంపు చేసే ప్రాంతం మా పరిధిలోకి వస్తుందో రాదో, వీఆర్వోను పంపిస్తా’ అంటూ ముక్తసరిగా జవాబిచ్చారు.
దూర ప్రాంతాలకు తరలింపు
రాష్ట్ర విభజన తర్వాత విశాఖపట్నంలో భనవ నిర్మాణాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఇసుక అక్రమంగా రవాణా చేసేందుకు మంచి అనువైన ప్రదేశంగా కాతేరు ఉంది. ఈ గ్రామ సరిహద్దును అనుకుని జాతీయ రహదారి వెళుతోంది. ఇసుకను లారీలల్లో నింపిన జాతీయ రహదారిపైకి వెళితే మధ్యలో ఎక్కడా ఆగే అవసరం ఉండదు. నేరుగా విశాఖ, ఇతర ప్రాంతాలకు తరలించొచ్చు. దీనిని అవకాశం తీసుకున్న అసాములు ఉచిత ఇసుకను పెట్టుబడిలేని వ్యాపారంగా మలుచుకున్నారు. 10 టైర్ల లారీలో 5 యూనిట్లు, 12 టైర్ల లారీలో 7 యూనిట్ల చొప్పున ఇసుక నింపుతున్నారు. 5 యూనిట్ల లారీ ఇసుకను దూరాన్ని బట్టి రూ. 30 నుంచి 40 వేలకు విక్రయిస్తున్నారు. అదే 7 యూనిట్ల లారీ ఇసుకను దూరాన్ని బట్టి రూ. 40 నుంచి రూ. 50 వేల లెక్కన భవన నిర్మాణదారులు కోరుకున్న చోటుకు తరలిస్తున్నారు.
తహసీల్దార్ అక్కడే ఉన్నారు.. విచారణ చేయిస్తా..
కాతేరు ఇసుక ర్యాంపునకు అనుమతి ఇవ్వలేదు. అక్కడ తవ్వకాలు జరపడం చట్టవిరుద్ధం. అక్కడ అర్ధరాత్రి తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారంతో గత వారం మేము దాడి చేశాం. కానీ ఎవ్వరూ దొరకలేదు. ఇంటి నిర్మాణం జరుగుతుంటే దాని పక్కనే 10 యూనిట్ల వరకు ఇసుకను నిల్వ చేసుకోవచ్చు. కానీ డంపులు ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలించడం చట్ట విరుద్ధం. ప్రస్తుతం రూరల్ తహసీల్దార్ అక్కడే ఉన్నారు. విచారణ చేయిస్తా.
– విజయకృష్ణ¯ŒS, రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్