కళా‘కాండా’లు
బీహార్ రాష్ట్రంలోని మధుబని జిల్లాకు వెళ్తే... ఓ అద్భుత దృశ్యం కనిపిస్తుంది. అక్కడ ఉన్న ప్రతి చెట్టూ రంగురంగుల చిత్రాలతో వింత శోభతో కనిపిస్తూ ఉంటుంది. చెట్ల మీద చిత్రాలు ఉండటమేంటా అని వింతగా అనిపిస్తుంది కొత్త వాళ్లకు. కానీ అక్కడివాళ్లకు మాత్రం అది అత్యంత సుపరిచితమైన విషయం.
పర్యావరణం పరిరక్షణ గురించి తీవ్రంగా కలత చెందిన ఓ వ్యక్తి మనసులో కలిగిన ఆలోచనకి ఫలితం! మధుబనిలో శష్ఠినాథ్ ఝా అనే పెద్దాయన గ్రామవికాస్ పేరుతో ఓ సంస్థను నడుపుతున్నారు. మానవ తప్పిదాల కారణంగా ప్రకృతిలో వస్తున్న మార్పుల గురించి తీవ్రంగా ఆలోచించారు ఝా. వంటచెరకు కోసం, ఇతరత్రా పనుల కోసం చెట్లను పెద్ద సంఖ్యలో నరికేయడం వల్ల బీహార్లో పచ్చదనం అంతకంతకూ తరిగిపోతోంది. అది గమనించిన ఆయన మనసు కలత చెందింది. పచ్చగా అలరారే తమ మధుబని జిల్లా కూడా మోడువారిపోతుందేమోనన్న భయం పట్టుకుందాయనకి. అందుకే వృక్షసంపదను కాపాడుకోవడానికి, తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి ఓ అద్భుతమైన ఆలోచన చేశారు ఝా. దాని ఫలితమే చెట్లమీద దేవతల బొమ్మలు!
మధుబని జిల్లాలో విద్యావంతులు తక్కువే. వారికి పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన లేకపోవచ్చు కానీ, మనసుల నిండా భక్తి నిండి ఉందని ఝాకి తెలుసు. అందుకే ప్రతి చెట్టు మీదా దేవతల చిత్రాలను చిత్రించే పని మొదలు పెట్టారు. అలాగైతే ఎవరూ చెట్లు మీద గొడ్డలి వేయరని ఆయన నమ్మకం. అందుకే కొందరు ఔత్సాహిక చిత్రకారులతో కలిసి ఎండకు, వానకు చెరగని విధంగా చెట్ల మీద బొమ్మలు వేయిస్తున్నారు ఝా.
ఇప్పటికే మధుబనిలో చాలావరకూ వేయడం పూర్తయ్యింది. మొత్తం బీహార్లోని చెట్లని పూర్తి చేసి దేశమంతా కూడా ఈ కార్యక్రమాన్ని విస్తరించాలని అనుకుంటున్నారు ఝా. ఒక చెట్టు మీద చిత్రాలు వేయడానికి రెండు నుంచి మూడు వేల దాకా ఖర్చవుతోందట. అయినా కూడా వెనకడుగు వేయడం లేదాయన. ‘ప్రకృతి బాగుంటే మనం బాగుంటాం’ అనేది ఆయన విశ్వాసం. ఆ విశ్వాసం, ఆయన పట్టుదలే పర్యావరణానికి శ్రీరామరక్ష!