రాగరంజితం.. రామవర్మ గాత్రం
వియవాడ కల్చరల్ :
ఇమీస్ (ఐఎంఐఎస్) ఫార్మా ఆధ్వర్యంలో మొగల్రాజపురంలోని పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో ఆదివారం బెంగళూరుకు చెందిన ప్రిన్సెస్ రామవర్మ నిర్వహించిన కర్నాటక గాత్ర సంగీత సభలో రాగాల వర్షం కురిసింది. కర్నాటక సంగీత విద్వాంసుల కీర్తనలతో ఆడిటోరియం మార్మోగిపోయింది. చాలాకాలం తరువాత సంగీతప్రియులు రామవర్మ గాత్రంతో మైమరచిపోయారు. కర్నాటక సంగీతాన్ని దశదిశలా ప్రవహింపజేసిన వాగ్గేయకారుల కీర్తనలను అద్భుతంగా గానం చేశారు. ‘అమ్మా ఆనంద దాయని..’తో ప్రారంభించి.. ‘గజవదన మాం పాహి..’ తదితర కీర్తనలను గానం చేశారు. వయోలిన్పై ఎస్ఆర్ వేణు, మృదంగంపై హరికుమార్ సహకరించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన డాక్టర్ ప్రసూన మాట్లాడుతూ ఇమీస్ వ్యవస్థాపకురాలు డాక్టర్, ఇందుమతి 80వ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించామని, కచేరీ నిర్వహించిన ప్రిన్స్ రామవర్మ.. ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ కుటుంబానికి చెందినవారని, దేశ విదేశాల్లో సంగీత సభలు నిర్వహించారని కొనియాడారు. డాక్టర్ ఇందుమతి కుటుంబసభ్యులు నాగప్రసూన, నాగలక్ష్మి, నాగమల్లిక, నాగశైల తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంగీత విద్వాంసుడు, వాగ్గేయకారుడు రజనీ కాంతరావు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.